
అవి ‘నేటి చరిత్ర’ సినిమా తీస్తున్న రోజులు.. దర్శకుడు ముత్యాల సుబ్బయ్య చాల బిజీగా ఉన్నారు. కానీ అదే సమయంలో నేటి చరిత్రకు పారలల్ గా మోహన్ బాబు వచ్చి ‘మా ఇంటి ధర్మరాజు’ సినిమా చేయమని కోరారు. సహజంగా ఎవర్నీ నొప్పించే అలవాటు లేని ముత్యాల సుబ్బయ్య మోహన్ బాబు కోరికను కాదనలేక పోయారు. దాంతో ‘మా ఇంటి ధర్మరాజు’ సినిమా కూడా చేయడానికి కసరత్తులు చేశారు. అన్నదమ్ముల అనుబంధాన్ని వివరించే సినిమా కావడంతో ఆ చిత్రంలో మోహన్ బాబు తమ్ముళ్లుగా చరణ్‌రాజ్, సుధాకర్ లను తీసుకున్నారు.
ఇక వాణీ విశ్వనాథ్ హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే మొదటినుంచీ ముత్యాల సుబ్బయ్యకి ఓ అలవాటు ఉంది. కథ ఎన్నుకున్న దగ్గర నుంచి సెన్సార్ పూర్తయ్యేవరకూ ఆయన చేసే సినిమా బాధ్యతను పూర్తిగా ఆయనే తీసుకునేవాడు. అయితే ఆర్టిస్టుల పారితోషికాలు మాట్లాడే అలవాటు ఆయనకు లేదు. పైగా ఏ విషయంలోనైనా నిర్మాత అడిగితేనే సలహా ఇచ్చేవాడు తప్ప మిగిలిన విషయాల్లో ఆయన వేలు పెట్టేవాడు కాదు. అయితే ‘మా ఇంటి ధర్మరాజు’’, ‘నేటి చరిత్ర’ సినిమాలు ఒకే రోజు అంటే 1990 ఫిబ్రవరి 9న విడుదలయ్యాయి. ‘మా ఇంటి ధర్మరాజు’’ సినిమాతో పోల్చుకుంటే ‘నేటి చరిత్ర’ సినిమా రిలీజ్ విషయంలో చాల ఇబ్బందులు పడింది.
దాంతో ఆ సినిమా నిర్మాత ముత్యాల సుబ్బయ్య పై అసంతృప్తిని వ్యక్తపరుస్తూ అప్పట్లో ఆయన చాల మాటలే అన్నారు. రెండు సినిమాలు మీరే దగ్గర ఉండి చూసుకుంది, కానీ మోహన్ బాబు సినిమాకి రాని సమస్య, మా సినిమాకు ఎందుకు వచ్చింది ? అంటూ ఆ నిర్మాత సీరియస్ అయ్యాడు. నిజానికి మోహన్ బాబు తన సినిమా విషయంలో అన్ని విషయాలూ ఆయనే దగ్గరుండి చూసుకునేవారు. అలాగే సినిమా బిజినెస్ చేయడం, థియేటర్లు మాట్లాడటం కూడా ఆయనే చూసేవారు. ఇవేమి తెలియని ‘నేటి చరిత్ర’ నిర్మాత మొత్తానికి ముత్యాల సుబ్బయ్యను అవమానించాడు.