మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో హీరో మంచు విష్ణు ప్యానల్ ను ‘కృష్ణుడి’ రథసారథియే గెలిపిస్తానని నటుడు నరేశ్ హాట్ కామెంట్స్ చేశారు. విష్ణు గెలుపు కోసం కృషి చేస్తానని.. ఓడినా గెలిచినా అంతా ‘మా’ సభ్యులమేనని నరేశ్ మరోసారి స్పష్టం చేశారు.

మా అంటే అప్పులు, పప్పులు ఇవ్వడం కాదని ప్రకాష్ రాజ్ చెబుతున్నారని.. డ్యాన్స్ లు, డ్రామాలు వేయొద్దని నరేశ్ హితవు పలికారు. ప్రత్యేక కార్యక్రమం నిధుల కోసం పక్క రాష్ట్రం సంగీత దర్శకుడు ‘ఇళయరాజా’తో చేయించడం ఏంటని.. ఇక్కడ సంగీత దర్శకులు లేరా? అని నరేశ్ ప్రశ్నించారు.
తెలుగువారే ‘మా’ అధ్యక్షులుగా ఉండాలని ప్రకాష్ రాజ్ కు నరేశ్ హితవు పలికారు.ఆ పదవి కోసం ఇక్కడ సమర్థులు లేరన్న మాటను ప్రకాష్ రాజ్ వెనక్కి తీసుకోవాలని సూచించారు. మా ప్యానల్ అజెండా సంక్షేమం.. మీది ఏంటి? అని సూటిగా అడిగారు నరేశ్. మీరెప్పుడైనా మా ఎన్నికల్లో ఓటు వేశారా? సమావేశాలకు హాజరయ్యారా? ఉన్నట్టుండి ఇలా ‘మా’పై ప్రేమ ఎలా పుట్టింది? మీ ఇష్టంతోనే వచ్చారా? ఎవరైనా పంపారా? అని ప్రకాష్ రాజ్ ను నరేశ్ ప్రశ్నించారు.
ప్రకాష్ రాజ్ నాకు మంచి స్నేహితుడని.. కానీ మంచు విష్ణు ఇక్కడే అందరికీ అందుబాటులో ఉంటాడని .. మా అధ్యక్షుడిగా విష్ణు సరైన వాడు అని నరేశ్ తెలిపారు. నాది కృష్ణుడి పాత్ర.. ‘మా’ కోసం మంచు విష్ణఉ రథం ఎక్కుతున్నానని తెలిపారు. విష్ణుకే నా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నానని నరేశ్ తెలిపారు.