Chandrababu: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీని అధికారంలోకి తేవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు తన వయసును లెక్కచేయకుండా శ్రమిస్తున్నారు.ఇందు కోసం ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఒక పక్క పొత్తుతో ముందుకెళ్లాలని ప్రయత్నిస్తునే పార్టీని బలోపేతం దిశగా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా తటస్థులను, గతంలో పార్టీకి దూరమైన వారిని దగ్గర చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో కఠిన నిర్ణయాలు దిశగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే వరుసగా మూడు సార్లు ఓటమి చవిచూసిన వారికి టిక్కెట్లు ఇవ్వకూడదని సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరో నిర్ణయం కొన్ని కుటుంబాల్లో ఆందోళన రేపుతోంది. ఒక కుటుంబానికి ఒకటికి మించి టిక్కెట్ ఇవ్వకూడదన్నదే తాజా నిర్ణయం.అయితే దీనిపై అధిష్టానం ఇప్పటివరకూ ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ ప్రచారం మాత్రం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుకు చంద్రబాబు ఈ కఠిన నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల్లో ప్రచారమైతే సాగుతోంది.
ఆ కుటుంబాల్లో ఆందోళన
అధినేత చంద్రబాబు తాజా నిర్ణయంతో టీడీపీతో పెనవేసుకున్న చాలా కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. ఒకే కుటుంబం నుంచి ఒక్కరికే టిక్కెట్ అన్న ఫార్ములా అమలుచేస్తే తమ సంగతి ఏమిటన్న ప్రశ్న వారిలో మొదలైంది. ఉత్తరాంధ్రను తీసుకుంటే దివంగత కింజరాపు ఎర్రన్నాయుడు కుటుంబం నుంచి ఆయన సోదరుడు అచ్చెన్నాయుడు ఎమ్మెల్యేగా, కుమారుడు రామ్మోహన్ నాయుడు ఎంపీగా ఉన్నారు. అచ్చెన్నాయుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక ఎర్రన్న కుమార్తె భవానీ సైతం ఎమ్మెల్యేగా గెలుపొందారు. విజయనగరం నుంచి పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు ఎంపీగా పోటీచేశారు. ఆయన కుమార్తె అదితి గజపతిరాజు ఎమ్మెల్యేగా పోటీచేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. అలాగే మాజీ మంత్రి కళా వెంకటరావుది అదే పరిస్థితి. ఆయన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నుంచి , ఆయన సోదరుడు కుమారుడు నాగార్జున విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి గత ఎన్నికల్లో బరిలో నిలిచారు. వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచే పోటీచేయాలని భావిస్తున్నారు. విశాఖ జిల్లా నుంచి మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేగా, ఆయన కుమారుడు విజయ్ ఎంపీగా పోటీచేసేందుకు సిద్ధపడుతున్నారు. ఒకే టిక్కెట్ ఫార్ములా కానీ అమల్లోకి వస్తే మాత్రం ఈ రాజకీయ నేపథ్యమున్న కుటుంబాలకు కాస్తా ఇబ్బందికరమే.
Also Read: Munugode Bypoll: రాజగోపాల్రెడ్డి బలమెంత.. కాంగ్రెస్ బలహీనత ఎంత! మునుగోడులో గెలుపెవరిది?
సీమలో అధికం..
రాయలసీమ జిల్లాల్లో సైతం కుటుంబ నేపథ్యమున్న రాజకీయ కుటుంబాలు ఉన్నాయి. ఒకే కుటుంబం నుంచి ఒకరు ఎమ్మెల్యేగా, ఒకరు ఎంపీగా పోటీచేస్తుంటారు. అటువంటి వారు టీడీపీలో అధికం. అనంతపురంలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు, పరిటాల సునీత, శ్రీరామ్ లు, కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, సుజాతమ్మలు, భూమా అఖిలప్రియ, బ్రహ్మానందరెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డిలు,కేఈ కృష్ణమూర్తి, ప్రభాకర్, శ్యామ్ లు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చిత్తూరు జిల్లా నుంచి దివంగత నేత డీకే ఆదికేశవులనాయుడు, మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి కుటుంబాలు రెండేసి టిక్కెట్లను ఆశిస్తున్నాయి. అయితే ఒకటే టిక్కెట్ ఫార్ములా ప్రచారంతో వీరంతా ఓకింత షాక్ కు గురవుతున్నట్టు తెలుస్తోంది. కానీ అధిష్టానం అటువంటి నిర్ణయం తీసుకోదన్న అభిప్రాయంతో వారంతా ఉన్నారు. తమ పని తాము చేసుకుంటున్నారు.
సాధ్యమయ్యే పనేనా?
అయితే ఈ ఫార్ములా ఎంతవరకూ అమలవుతుందన్నది ప్రశ్నార్థకమే. ఒకే కుటుంబంలో ఇద్దరికి టిక్కెట్ ఇచ్చారంటే రెండు కారణాలున్నాయి. ఒకటి అక్కడ ఆ కుటుంబానికి బలమైన రాజకీయ నేపథ్యమైనా ఉండాలి…లేకుంటే పార్టీ గట్టెక్కాలంటే బలమైన అభ్యర్థి అవసరమైనా ఉండాలి. ఉదాహరణకు శ్రీకాకుళం ఎంపీ స్థానానికి కింజరాపు రామ్మోహన్ నాయుడు అయితేనే ధీటైన అభ్యర్థి. ఆయన్ను తప్పిస్తే ఆ ప్రభావం పార్లమెంట్ పరిధిలోని ఎనిమిది నియోకవర్గాలపై పడుతుంది. గత ఎన్నికల్లో ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను.. ఆరింట ఓడిపోయినా ఎంపీగా రామ్మోహన్ నాయుడు గెలుపొందారు. ఇటువంటి చోట మాత్రం తాజా ఫార్ములా పనిచేయదని పార్టీ వర్గాలే భావిస్తున్నాయి. సందర్భానుసారం కొన్ని కుటుంబాలకు రెండో టిక్కెట్ నిరాకరించే అవకాశముందని.. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అది సాధ్యమయ్యే పనికాదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read:Indian Temples Unique Prasads: భారతదేశంలోని ఈ దేవాలయాల్లో నైవేద్యంగా మాంసాహారం.. వింత ఆచారాలు
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Chandrababus new formula one ticket for one family
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com