Central Govt Fires On AP: ఏపీ సర్కారు విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్థితిగతులపై దృష్టిపెట్టింది. సంక్షేమ పథకాలు, రాయితీల పేరిట రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక క్రమశిక్షణ కట్టుదాటడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ విషయాన్ని గణాంకాలతో బయటపెట్టి.. ఇప్పటికైనా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని సూచించింది. మొత్తం 11 రాష్ట్రాల జాబితాను ప్రవేశపెట్టగా.. అందులో ఏపీ ముందు వరుసలో ఉంది. అయితే ఈ హాఠాత్ పరిణామంతో వైసీపీ షాక్ కు గురైంది. అడగకుండానే రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు తెలిపామని.. ఉప రాష్ట్రపతి అభ్యర్థికి సైతం మద్దతు ప్రకటించామని.. అయినా అవసరం తీరాక బీజేపీ తమను మోసం చేసిందని వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం శ్రీలంక పరిస్థితులపై అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఏపీతో సహా పది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వాలు పరిధులు దాటి అప్పులు చేయడం, ఉచిత పథకాలు పేరిట ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం వంటివి సమావేశంలో చర్చకు వచ్చాయి. అయితే దీనిపై వైసీపీతో పాటు టీఆర్ఎస్ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల మాటేమిటని ప్రశ్నించాయి. వాటి గురించి బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అస్తవ్యస్థ విధానాలతో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని.. అందుకే రాష్ట్రాలను అప్రమత్తం చేసేందుకు సమావేశం నిర్వహించామని.. ఇందులో రాజకీయాలేవీ లేవని..ఈ జాబితాలో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్న విషయం గుర్తించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
ఆ పది రాష్ట్రలపై ఫోకస్..
అఖిలపక్ష సమావేశంలో ఏపీతో సహా పది రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఏపీ, బిహార్, హరియాణా, ఝార్కండ్, కేరళ, మధ్యప్రదేశ్,పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ప్రధానంగా ఏపీ ప్రభుత్వ వ్యవహార శైలిపై ప్రత్యేకంగా చర్చకు వచ్చింది. పరిమితికి మించి అడ్డగోలుగా అప్పులు చేస్తుండడంపై సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో రుణాలు జీఎస్ డీపీలో 32 శాతానికి చేరినట్టు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం25 శాతానికి చేరినట్టు పేర్కొన్నారు. అయితే దీనిపై టీఆర్ఎస్, వైసీపీ ఒక్కసారిగా భగ్గుమన్నాయి. కానీ దీనిపై కేంద్ర మంత్రి జైశంకర్ స్పందించారు. రాష్ట్రాల వాస్తవ పరిస్థితిని చెప్పి అప్రమత్తం చేశామే తప్ప..ఇందులో ఎటువంటి రాజకీయం లేదన్నారు. అయితే కేంద్రం వెల్లడించిన జాబితాలో బీజేపీయేతర పార్టీలు అధికారమున్న రాష్ట్రాలే ఉండడం విశేషం. దీనిపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. అసలు రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనమేమిటని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తోందని.. వాటి మాటేమిటని నిలదీస్తున్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ చర్యగా అభివర్ణిస్తున్నారు. బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ ఒక తాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
Also Read: Pawan Kalyan: పంథా మార్చుకున్న జనసేనాని… సరైన వ్యూహంతో ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్
పోలవరం జాప్యంపై క్లారిటీ..
అటు పోలవరం విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఏపీ సర్కారుపై కన్నెర్ర జేసింది. పోలవం నిర్మాణం పూర్తిచేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. అందుకే పనుల్లో జాప్యం జరుగుతూ వస్తోందన్నారు. ఏపీ అసమర్థత స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నాటికే పూర్తికావాల్సి ఉన్నా..రాష్ట్ర ప్రభుత్వం వల్లే పూర్తికాలేదన్నారు. ఏపీ సర్కారుకు వ్యూహాత్మక ప్రణాళిక అన్నది లేకపోవడమే ప్రధాన లోపమన్నారు. కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్ టుడు లిఖితపూర్వకంగా పోలవరంపై తెలియజేయడం ప్రకంపనలకు దారితీస్తోంది. ఇటీవల ప్రత్యేక హోదాపై కూడా కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. గతంలో చెప్పినట్టుగానే ఎట్టి పరిస్థితుల్లో హోదా ఇవ్వలేమని తేల్చేసింది. 14వ ఆర్థిక సంఘం నిధులు పెంపు, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా పెంపు, రెవెన్యూ లోటు, ప్రత్యేక గ్రాంట్లు వంటి వాటిపై పార్లమెంట్ వేదికగా సమాధానాలిచ్చింది. ఇప్పుడు పోలవరం విషయంలో తప్పును ఏపీపై పెట్టింది. అటు ఆర్థిక క్రమశిక్షణ, ఇటు పోలవరంపై కేంద్రం కన్నెర్ర జేయడంతో వైసీపీ సర్కారుకు ఎలా ముందుకెళ్లాలో తెలియడం లేదు.
ఏపీలో విపక్షాలకు ఆయుధం..
అయితే ఏపీలో విపక్షాలకు ప్రధాన ఆయుధం దొరికినట్టయ్యింది. గత కొన్ని రోజులుగా వైసీపీ సర్కారుపై విపక్షాలు ఆరోపణలు చేస్తూ వస్తున్నాయి. సంక్షేమ పథకాల మాటున రాష్ట్రాన్ని అప్పులమయంగా మార్చేస్తున్నారని.. ఆర్థిక దివాళాకోరు దిశగా రాష్ట్రం ప్రయాణిస్తోందని ప్రధాన విపక్ష నేత చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముప్పేట దాడి చేస్తున్నారు. వైసీపీ సర్కారు రాష్ట్రానికి హానికరంగా ఆరోపించారు. మరో ఛాన్స్ ఇస్తే మాత్రం రాష్ట్రం దివాళా తీయడం ఖాయమని ఇరువురు నేతలు ఆరోపణలు, విమర్శలు చేస్తూ వస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే కేంద్ర ప్రభుత్వం బాంబు పేల్చింది. వాస్తవానికి కేంద్రం తన ఊసు రాదని సీఎం జగన్ చాలా నమ్మకంగా ఉండేవారు. ఎన్డీఏకు అవసరమైనప్పుడు అడగకుండానే సాయం చేసేవారు. అటువంటిది రాష్ట్రపతి ఎన్నికలు అయిన రెండు రోజులకే కేంద్రం తన విశ్వరూపాన్ని చూపించింది. దీంతో కేంద్రానికి టీఆర్ఎస్ తరహాలో కౌంటర్ ఇవ్వాలని వైసీపీ నిర్ణయించింది. అంటే బీజేపీతో వార్ మొదలైనట్టేనన్న మాట.
Also Read:Shreyas Iyer: టీమిండియా కెప్టెన్ కావాల్సిన శ్రేయాస్ అయ్యర్.. ఎందుకు ఇలా అయ్యాడు?
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Central govt fires on andhra pradesh debts ycp which is burning on the warnings of the center what is jagan going to do
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com