YCP- BJP: కరవమంటే కప్పకు కోపం…విడవమంటే పాముకు కోపం అన్న చందంగా మారింది ఏపీలో భారతీయ జనతా పార్టీ దుస్థితి. గత ఎన్నికల తరువాత బలపడాలన్న ఆకాంక్షతో రాష్ట్ర బీజేపీ నేతలు పనిచేస్తున్నారు. ఎటువంటి ఎన్నికలు వచ్చినా బరిలో దిగుతున్నారు. చివరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ బహిష్కరించినా.. అధికార వైసీపీపై బీజేపీ నేతలు పోటీకి నిలబడ్డారు. తిరుపతి, బద్వేలు, మొన్నటికి మొన్న నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికల్లో సైతం పోటీచేశారు. అయితే రాష్ట్ర బీజేపీ నేతలు ఒక వైపు వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తుంటే.. జాతీయ సమీకరణల ద్రుష్ట్యా ఆ పార్టీ పెద్దలు వైసీపీకి స్నేహహస్తం అందిస్తున్నారు. ఇలాగైతే తాము పార్టీని ఎలా బలోపేతం చేస్తామని రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే అధిష్టానం తమను డిఫెన్స్ లో పెడుతోందని మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలాగైతే ఏపీలో బలోపేతం మాట అటుంచి కనీసం ఉనికి చాటుకోలేమని ఆందోళన చెందుతున్నారు. గత ఎన్నికల తరువాత తాము అధికార వైసీపీకి, విపక్ష టీడీపీకి సమదూరం పాటిస్తామని రాష్ట్ర నాయకులు చెబుతూ వచ్చారు. జనసేనతో అధికారిక పొత్తు పెట్టుకున్నారు. అందుకు అనుగుణంగా అధికార వైసీపీపై విమర్శలు కురిపించారు. ప్రభుత్వ పాలనా వైఫల్యాలను ఎండగడుతూ వచ్చారు. అయితే దీనిపై వైసీపీ నేతలు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఒకరిద్దరు కింది స్థాయి నేతలతో ప్రతివిమర్శలు చేసినా.. వైసీపీ కీలక నేతలు మాత్రం ఎప్పుడూ స్పందించిన దాఖలాలు లేవు. దీనికి బీజేపీ పెద్దలతో జగన్ కు ఉన్న సాన్నిహిత్యం, అవసరాలే కారణం.
జాతీయ ప్రయోజనాలకే..
వైసీపీ కేంద్ర ప్రభుత్వంలో అధికారికంగా చేరలేదు. కానీ కేంద్రానికి అవసరమైనప్పుడు మద్దతు ప్రకటిస్తోంది. కీలక బిల్లుల ఆమోదం సమయంలో సైతం అండగా నిలిచింది. సంఖ్యాబలం ఎక్కువ ఉన్న నేపథ్యంలో బీజేపీ కూడా వైసీపీ మద్దతు తీసుకుంటూ వస్తోంది. అందుకే కేంద్రంలో జగన్ కు ఎనలేని గౌరవం లభిస్తోంది. ఆయన అడిగిన వెంటనే ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలతో పాటు కేంద్ర మంత్రులను కలిసేందుకు ఇట్టే అపాయింట్ మెంట్ లభిస్తోంది. కానీ ఇన్నాళ్లూ ఇవేవీ పట్టించుకోని రాష్ట్ర బీజేపీ నాయకులు రాష్ట్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతూ వస్తున్నారు. కానీ ఇటీవల జరుగుతున్న పరిణామాలు మాత్రం మరింత కలవరపాటకు గురిచేస్తున్నాయి. ఎవరితో అయితే పోరాడుతున్నామో వారితోనే బీజేపీ పెద్దలు సఖ్యతగా ఉంటున్నారు. దగ్గర చేసుకుంటున్నారు. అదే సమయంలో జనసేన అధిపతి పవన్ తో కలిసి నడుస్తామన్న వారి ఆశలు సైతం దూరమయ్యాయి. వైసీపీ షరతు మేరకు తాత్కాలికంగా బీజేపీ పెద్దలు పవన్ ను పక్కన పడేశారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పవన్ తో కలిసి ఎన్నికల్లో పోటీచేసి గౌరవమైన స్థానాలు దక్కించుకునేందుకు బీజేపీ రాష్ట్ర నాయకులు పావులు కదిపారు. అయితే మిత్రపక్షమైన పవన్ కంటే తాము పోరాడుతున్న జగన్ కే ఎనలేని ప్రాధాన్యత ఇస్తుండడంతో రాష్ట్ర బీజేపీలోని ఒక వర్గానికి మింగుడుపడడం లేదు. ఒకవైపు తమకు రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడమని పురమాయిస్తూనే అటు వైసీపీతో అంటగాకడమేమిటని అంతర్మథనం పడుతున్నారు. ఇలాగైతే పార్టీని బలోపేతం చేయడం చాలా కష్టమని వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read: Monsoon Diet: వర్షాకాలంలో ఆరోగ్యం కోసం ఈ ఆహారాలే తీసుకోవాలా?
రాష్ట్ర నేతలను పట్టించుకోని బీజేపీ…
రాష్ట్ర బీజేపీ నాయకులను అసలు ఢిల్లీ పెద్దలు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ బలపరచిన అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వైసీపీ బహటంగా మద్దతు ప్రకటించింది. ఇలా కేంద్ర పెద్దల నుంచి పేరు వచ్చిందే తరువాయి వైసీపీ తన నిర్ణయాన్ని వెల్లడించింది. స్వయంగా ఆ పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి స్వయంగా వెళ్లి ద్రౌపది ముర్ము నామినేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఎన్డీఏ పెద్దలతో సమానంగా ఆయన్ను ముందు వరుసలో కూర్చొబెట్టారు. అయినా బీజేపీ రాష్ట్ర నాయకులకు మాత్రం ఇది అర్థం కాలేదు. ఇటీవల రాష్ట్రానికి చెందిన బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఒక ప్రకటన చేశారు. అసలు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి మద్దతు విషయంలో బీజేపీ నేతలెవరూ వైసీపీని సంప్రదించలేదన్నది దాని సారాంశం. అడగకుండానే వైసీపీ మద్దతు ప్రకటించిందని మరీ చెప్పుకొచ్చారు. దీనిపై ఢిల్లీ పెద్దలు సత్యకుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. సత్యకుమార్ ప్రకటన ఆయన వ్యక్తిగతమని.. దాంతో పార్టీకి ఎటువంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ స్వయంగా ప్రకటించారు. దీంతో వైసీపీతో బీజేపీ పెద్దల బంధం బయటపడింది. దీంతో రాష్ట్ర బీజేపీ నాయకులు మౌనాన్నే ఆశ్రయించారు. అధిష్టానం తీరుపై కీనుక వహించారు.
పదవుల పంపకంలో వివక్ష..
ఏపీ విషయంలో బీజేపీ పెద్దలు వ్యవహరిస్తున్న తీరుపై కొందరు రాష్ట్ర నాయకులు ఆగ్రహంతో ఉన్నారు. కేంద్రంలో బీజేపీ నేత్రుత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు దాడుతున్నా రాష్ట్రంలో పార్టీ బలోపేతం కాకపోవడాన్ని ఉదహరిస్తున్నారు. నాడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్న తరుణంలో ఐదారు అసెంబ్లీ స్థానాలు, రెండు మూడు ఎంపీ పదవులు వచ్చాయని గుర్తుచేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఎటువంటి ఎన్నికల్లో అయినా బరిలో దిగడం, కనీసం డిపాజిట్లు రాకపోవడం దారుణ అవమానంగా చెప్పుకొస్తున్నారు. ఇటువంటి సమయంలో పార్టీ బలోపేతానికి చర్యలు చేపట్టాల్సింది పోయి విపక్షానికి దన్నుగా నిలవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణతో పోల్చుకుంటే రాష్ట్ర బీజేపీ నాయకులకు ఎటువంటి ప్రాధాన్యం లేదు. కనీసం ప్రాతినిధ్యం లేదు. ఎన్డీఏ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత సీనియర్ నాయకుడు కంభంపాటి హరిబాబును గవర్నర్ పదవి తప్పించి.. పదవుల పంపకాల్లో ఏపీని పట్టించుకున్న దాఖలాలు లేవు. అలాంటప్పుడు తాము ఎందుకు పోరాటం చేయాలని చాలా మంది బీజేపీ నేతలు నైరాశ్యంలోకి వెళ్లిపోతున్నారు.
Also Read:CI Nageswara Rao Case: తెలంగాణ ఖాకీ వనంలో ఎందరో నాగేశ్వరరావులు
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Central governments support for ycp what is the situation of ap bjp
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com