https://oktelugu.com/

YouTube: కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్: తాజా నిబంధనలతో ఇక డబ్బులే డబ్బులు

యూట్యూబ్ కు సంబంధించి వ్యూస్ విషయంలో నిబంధనలు సడలించింది. మానిటైజేషన్ పొందేందుకు గతంలో నాలుగు వేల గంటలతో పాటు, యూట్యూబ్ ఫ్లాట్ ఫామ్ లో ఉన్న కంటెంట్ కచ్చితంగా వీక్షకులు చూసి ఉండాలి అనే నిబంధన విధించింది.

Written By:
  • Rocky
  • , Updated On : June 15, 2023 12:19 pm
    YouTube

    YouTube

    Follow us on

    YouTube: డిజిటల్ మీడియా.. కంటెంట్ క్రియేటర్లకు కామధేనువు లాగా మారింది. డబ్బులు కూడా భారీగా వస్తుండటంతో కంటెంట్ క్రియేటర్లు పండగ చేసుకుంటున్నారు. కొత్త కొత్త క్రియేటర్లు పుట్టుకొస్తున్నారు. కొత్త కొత్త కాన్సెప్ట్ లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. రాత్రికి రాత్రే సెలబ్రిటీలు అయిపోతున్నారు. యూట్యూబ్ రకరకాల నిబంధనలు విధించినప్పటికీ వాటన్నింటికీ లోబడి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. దండిగా సంపాదిస్తున్నారు. ఇన్నాళ్లు రకరకాల షరతులు విధించిన యూట్యూబ్ ఇప్పుడు సడలింపు మార్గం కల్పిస్తోంది. కంటెంట్ క్రియేటర్లకు అనుగుణంగా నిబంధనలను మార్చుకుంటున్నది. దీనివల్ల వారికి చేతినిండా డబ్బులు కల్పించేలా సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే మొన్నటిదాకా బెట్టు వీడని యూట్యూబ్.. తాజాగా ఈ మార్గం పట్టడం పట్ల చాలామందిలో ఆశ్చర్యం కలుగుతున్నది. అయితే సమీప భవిష్యత్తులో మరే పోటీదారు లేకుండా ఉండేందుకు యూట్యూబ్ ఇలాంటి కార్యాచరణకు దిగిందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    నిబంధనల సడలింపు

    యూట్యూబ్ కు సంబంధించి వ్యూస్ విషయంలో నిబంధనలు సడలించింది. మానిటైజేషన్ పొందేందుకు గతంలో నాలుగు వేల గంటలతో పాటు, యూట్యూబ్ ఫ్లాట్ ఫామ్ లో ఉన్న కంటెంట్ కచ్చితంగా వీక్షకులు చూసి ఉండాలి అనే నిబంధన విధించింది. ఇప్పుడు దానిని 3000 గంటలకు తగ్గించింది.. అంటే క్రియేటర్లు మూడువేల వాచ్ అవర్స్ లేదా చివరి 90 రోజుల్లో 3 మిలియన్ షార్ట్స్ వ్యూస్ గానీ పొంది ఉండాలి.. గతంలో ఇది పది మిలియన్లు గా ఉండేది. ఈ నిబంధనలను రెవెన్యూ షేరింగ్ లో కొనసాగించేలా యూ ట్యూబ్ సడలించింది. ఇది ఒక రకంగా కంటెంట్ థియేటర్లకు ఆయాచిత వరం లాంటిది.

    కొత్త నిబంధనల ప్రకారం

    యూట్యూబ్ విధించిన కొత్త నిబంధనల ప్రకారం కంటెంట్ క్రియేటర్లకు 500 మంది సబ్స్క్రైబర్లు ఉంటే చాలు యూట్యూబ్ మానిటైజేషన్ కు అప్లయ్ చేసుకోవచ్చు. గతంలో మానుటైజేషన్ కు అప్లై చేసుకోవాలంటే వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అవసరం ఉండేది. ఇప్పుడు ఆ సంఖ్యను యూట్యూబ్ భారీగా తగ్గించింది. ఈ నిర్ణయంతో తక్కువ సబ్స్క్రైబర్లు ఉన్నవారు కూడా యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. అంతేకాకుండా నవ్యతతో కూడిన కంటెంట్ తయారు చేసే వారికి మరింత ప్రోత్సాహకం ఇచ్చేందుకు యూట్యూబ్ ఇంకా కొన్ని నిబంధనలను సడలించేందుకు సమాయత్తమవుతుంది.

    ఇండియాలో ఇప్పుడే కాదు

    ఇక ఈ నిబంధనలు అమెరికా, బ్రిటన్, కెనడా, తైవాన్, దక్షిణ కొరియా దేశాలలో అమలు కానున్నాయి. త్వరలో మిగిలిన దేశాలకు విస్తరిస్తామని యూట్యూబ్ చెబుతోంది. ఈ కొత్త విధానం భారత దేశంలో ఎప్పుడు అమలు అవుతుంది అనే దానిపై స్పష్టత లేదు. ఇక యూట్యూబ్ తీసుకొచ్చిన తాజా నిబంధనల వల్ల తమ డబ్బులు సంపాదించుకునేందుకు వీలు కలుగుతుందని కంటెంట్ క్రియేటర్లు చెబుతున్నారు. మన దేశంలో ఇది ఇంకా అమలు కాలేదు కానీ.. విదేశాల్లో ఉన్నవారైతే వెంటనే యూట్యూబ్ మానిటైజేషన్ ప్రోగ్రాంకు అప్లై చేసుకుంటే డబ్బులే డబ్బులు. పైగా అక్కడ కరెన్సీ డాలర్ లో ఉంటుంది కాబట్టి రెట్టింపు స్థాయిలో సంపాదించుకోవచ్చు. మెదడులో కొత్త కొత్త ఆలోచనలు ఉంటే.. వెంటనే వాటిని అమలు పెట్టగలిగితే ధనలక్ష్మి యూట్యూబ్ రూపంలో మీ పర్సులోకి రావచ్చు. మిమ్మల్ని ఓవర్ నైట్ లో సెలబ్రిటీ కూడా చేయవచ్చు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే మానిటైజేషన్ ప్రోగ్రాంకు అప్లై చేయడమే..