Elon Musk : ప్రపంచ కుబేరుడు గా పేరుగాంచిన ఎలాన్ మస్క్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. గత ఏడాది ట్విట్టర్ పేరును ఎక్స్ గా మార్చిన అతడు.. ఈసారి ఆ ఎక్స్ తోనే వీడియో ప్లాట్ ఫారం యాప్ యూ ట్యూబ్ ను ఢీకొట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఈ యాప్ వివరాలను అతడు ట్విట్టర్ ఎక్స్ ద్వారా ప్రకటించాడు. త్వరలో ఎక్స్ టీవీ యాప్ ను ప్రారంభించనున్నట్టు మస్క్ వివరించాడు. అమెజాన్, సాంసంగ్ యూజర్ లను దృష్టిలో పెట్టుకొని తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు.. కొత్త యాప్ ద్వారా యూజర్లు ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను చూసే అవకాశం ఉంటుందని ప్రకటించాడు. అందుకు అనుగుణంగా ఎక్స్ యాప్ రూపొందిస్తున్నట్టు వెల్లడించాడు.
రెండు కంపెనీలతో భాగస్వామ్యం
మస్క్ త్వరలో తీసుకురాబోయే టీవీ యాప్ రెండు కంపెనీలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఈ ఎక్స్ యాప్ తో యూట్యూబ్ ను ఢీకొట్టేందుకు మస్క్ తీసుకొస్తున్నారని ప్రచారం జరుగుతోంది. వచ్చేవారం దీనిని విడుదల చేస్తారని తెలుస్తోంది. ట్విట్టర్ ఎక్స్ లో పోస్ట్ అయ్యే వీడియోలను టీవీ యాప్ ద్వారా నేరుగా టీవీకి పంపాలని మస్క్ ఆలోచిస్తున్నారు. మస్క్ మదిలో ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయని.. వాటిని క్రమక్రమంగా అమల్లో పెడతారని ఎక్స్ ఉద్యోగులు అంటున్నారు. మరోవైపు ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత మస్క్ అందులో వినూత్నమైన మార్పులు చేశారు. ముందుగా ట్విట్టర్ ను ఎక్స్ గా మార్చారు.. త్వరలో తీసుకొచ్చే ఎక్స్ యాప్ పేరు ఎవ్రీథింగ్ లాగా మార్చనున్నారు. ఇటీవల ఫోన్ నెంబర్ తో ఎటువంటి సంబంధం లేకుండా ఎక్స్ నుంచి వీడియో, ఆడియో ఫోన్ కాల్స్ చేసుకునే అవకాశాన్ని యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
ప్రముఖ యాంకర్ తో ఒప్పందం
ఇక ఇటీవల మస్క్ ఒక న్యూస్ ఛానల్ కు చెందిన ప్రముఖ యాంకర్ తో ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తోంది. యూట్యూబ్ కు పోటీగా మస్క్ ఎక్స్ టీవీ యాప్ ఆవిష్కరించనున్నారు. దీనిని ఆవిష్కరించినంత మాత్రానా మస్క్ కు వెంటనే లాభాలు రావని.. తీవ్ర పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రపంచంలో ప్రతి స్మార్ట్ ఫోన్ లో యూట్యూబ్ అనేది బై డిఫాల్ట్ గా ఉంటోందని, ఇప్పటివరకు గూగుల్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ ఎన్నో యాప్స్ వచ్చాయని, కానీ అవి నిలబడలేకపోయాయని వారు గుర్తు చేస్తున్నారు. అలాంటప్పుడు మస్క్ తీవ్రంగా డబ్బు వెచ్చించాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. మరి మస్క్ మదిలో ఎలాంటి ఆలోచన ఉందో?