500 Notes : మన ఇంట్లో ఒక్క రూపాయి పక్కదారి పట్టినా వెంటనే తెలిసిపోతుంది. పోనీ ఎక్కడ దాచామో ఇట్టే గుర్తుకు వస్తుంది. పోనీ ఆ క్షణంలో మర్చిపోయినప్పటికీ, తర్వాత ఎక్కడ దాచామో కొద్ది రోజులకు తెలుస్తుంది. అలాంటిది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 88,032.5 కోట్లు, అన్నీ కూడా 500 నోట్ల కట్టలు.. ఇవి ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చేరలేదు. ఇంతకీ ఈ నోట్లు ఏమయ్యాయి? మనోరంజన్ రాయ్ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన ఈ గణాంకాలు ఈ వ్యత్యాసాన్ని బయటపెట్టాయి.
మూడు యూనిట్లు
దేశవ్యాప్తంగా కరెన్సీ నోట్లను మూడు యూనిట్లు ముద్రిస్తాయి. అవి బెంగళూరులోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోటు ముద్రన్ లిమిటెడ్, నాసిక్ లోని కరెన్సీ నోట్ ప్రెస్, మధ్యప్రదేశ్ లోని దేవాస్ లో ఉన్న బ్యాంక్ నోట్ ప్రెస్. దేశంలోని ఈ మూడు కరెన్సీ నోటు ముద్రణాలయాలు కొత్తగా డిజైన్ చేసిన 500 నోట్లను 8,810.65 మిలియన్ నోట్లను ముద్రించి సరఫరా చేశాయి. అయితే వీటిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చేరినవి 7,260 మిలియన్ నోట్లు మాత్రమేనని మనోరంజన్ రాయ్ సమాచార హక్కు చట్టం కింద పొందిన గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఈ లెక్కన రూ. 88,032.50 కోట్ల విలువైన 1,760.65 మిలియన్ల 500 నోట్లు గల్లంతయాయని తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం 2016-17 లో నాసిక్ మింట్ 1,662 మిలియన్ నోట్లు, బెంగళూరు మింట్ 5,195.65 మిలియన్ నోట్లు, దేవాస్ మింట్ 1,953 మిలియన్ నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సరఫరా చేసింది. మూడు మింట్ ల నుంచి సరఫరా అయిన మొత్తం నోట్లు 8,810.65 మిలియన్లు. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అందే మాత్రం 7,620 మిలియన్ నోట్లు మాత్రమే.

రఘురాం రాజన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా ఉన్నప్పుడు..
మనోరంజన్ రాయ్ చెప్పిన దాని ప్రకారం గల్లంతైన 1760.65 మిలియన్ నోట్లలో 210 మిలియన్ నోట్లు నాసిక్ మింట్ లో 2015 ఏప్రిల్_ 2016 మార్చి నెలలో ముద్రితమయ్యాయి.. సమాచార హక్కు చట్టం ప్రకారం రఘురాం రాజన్ గవర్నర్ గా ఉన్నప్పుడు ఈ నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సరఫరా అయ్యాయి. కరెన్సీ నోట్ ప్రెస్ లలో ప్రింట్ అయిన నోట్లు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చేరిన నోట్లకు మధ్య వ్యత్యాసం పై విచారణ చేపట్టాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి. సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లకు మనోరంజన్ లేఖలు రాశారు. అయితే కరెన్సీ నోట్ల ముద్రణ, సరఫరా లో భారీ లాజిస్టిక్స్ ప్రమేయం ఉన్నందున ఈ అసమతుల్యం సాధారణమే అని కొందరు సీనియర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు చెబుతున్నారు. వారు చెప్పిన మాటలను జాతీయ మీడియా ఉటంకిస్తోంది. పెద్ద నోట్ల రద్దు, 2000 నోటు ఉపసంహరణ తర్వాత.. ఇంతటి భారీ స్థాయిలో నోట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చేరకపోవడం పట్ల మరి కొంతమంది ఆర్థిక నిపుణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీటి వెనుక ఏమున్నప్పటికీ కేంద్ర దర్యాప్తు సంస్థలు నిగ్గు తేల్చాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, మనో రంజన్ రాయ్ రాసిన లేఖల ఆధారంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.