Women success story : అమెరికాలో ఉద్యోగం.. వారంలో రెండు రోజులు సెలవు.. నెల తిరగకముందే ఆరు అంకెల జీతం. ఖరీదైన ఇల్లు.. విలాసవంతమైన కారు.. ఎటువంటి ఇబ్బందులు లేని జీవితం.. ఇలాంటి వాటిని ఎవరైనా కాదనుకుంటారా? ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి అవకాశం ఎవరికైనా వస్తే కళ్లకు అద్దుకుంటారు. అవకాశం ఇచ్చిన వారి కాళ్లను చేతులతో మొక్కుతారు. కానీ ఆ యువతి దీన్ని పట్టించుకోలేదు. పైగా రిస్క్ లేని జీవితం బోర్ అని భావించింది. అమెరికాలోని ఉద్యోగాన్ని పక్కనపెట్టి ఇండియాకు వచ్చింది.. తినబోతూ రుచి ఎందుకు? ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చదివేయండి..
ఆ యువతి పేరు ఆహానా.. రాజస్థాన్ లోని భరత్ పూర్ ఆమె సొంత గ్రామం. బాంబే ఐఐటీ నుంచి కెమికల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆ తర్వాత 2014-16 లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ పూర్తి చేసింది. ఆమె విద్యార్హతకు అమెరికాలోని ఒక పేరు పొందిన కంపెనీ కీలకమైన ఉద్యోగం ఇచ్చింది.. ఆమె కోరుకున్నట్టుగానే జీతభత్యాలు అందించింది. కానీ ఆ జీవితం ఆమెకు నచ్చలేదు. పైగా అమెరికాలో హోటల్ కు వెళ్ళినప్పుడు ఆమెకు ఎదురైన అనుభవం ఇండియా వైపు మళ్ళించింది.. అలా ₹100 కోట్ల కంపెనీకి బాస్ ను చేసింది.
అహానా అమెరికాలో ఉన్నప్పుడు ఓ హోటల్ కు వెళ్ళింది. ఇక్కడ తాను ఆర్డర్ చేసిన ఆహార పదార్థాలలో అధిక కొవ్వు, క్రీము ఉండడం చూసి ఆందోళన చెందింది. అలా ఆహారాన్ని తింటే ఆరోగ్యాలు ఏమవుతాయనే ప్రశ్న ఆమె మెదడును తొలిచింది. “ఆరోగ్యకరమైన ఆహారాలు ప్రజలకు అందించాలి”అనే భావన ఆమెలో కలిగింది. ఆ ఆలోచనతోనే “ఓపెన్ సీక్రెట్ (open secret)” పేరుతో రుచికరమైన పోషకాలతో కూడిన చిరుతిళ్ళను తయారుచేసే కంపెనీ ప్రారంభించింది. బయట దొరుకుతున్న జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలనుకునే ప్రజలకు “ఓపెన్ సీక్రెట్(open secret)” ఉత్పత్తులను ఆహానా చేరువ చేసింది. పైగా ఆ చిరుతిళ్ళల్లో పోషకాలు ఎక్కువగా ఉండటంతో ప్రజల నుంచి విపరీతమైన ఆదరణ లభించడం ప్రారంభమైంది. ఫలితంగా వ్యాపారం ఆహానా అనుకున్న దానికంటే పెరిగింది. తనకు 30 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆహానా ఈ వ్యాపారం ప్రారంభించారు. ప్రస్తుతం ఆమె open secret కంపెనీకి సీఈవోగా కొనసాగుతున్నారు. ఈ కంపెనీ విలువ ప్రస్తుతం 100 కోట్లకు చేరింది. ఈ కంపెనీని ప్రారంభించినప్పుడు 2019లో తన తల్లి ద్వారా ఆహానా నిధులు సేకరించింది. అన్నట్టు ఆహానా open secret కంపెనీకి సీఈవో మాత్రమే కాదు.. గోద్రెజ్ టైసన్ ఫుడ్స్ లిమిటెడ్ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్ కూడా. అంతకుముందు ఆమె ప్రోక్టర్ అండ్ గాంబుల్ సంస్థలో పనిచేశారు. ఆ అనుభవంతోనే ఆమె open secret కంపెనీని ప్రారంభించారు. “కృత్రిమ రంగులు వాడొద్దు. అధిక కొవ్వు, క్రీమ్ వినియోగించొద్దు. నాణ్యమైన ఆహార పదార్థాలను వినియోగదారులకు అందించాలి” ఈ లక్ష్యాలతోనే తన వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తానని ఆహానా చెబుతున్నారు.