Byjus : ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని స్థితికి బైజూస్ ఎందుకు చేరింది? కారణమేంటి

విద్యాసంబంధిత సేవలందించే బైజూస్ తమ ఉద్యోగులకు జులై వేతనాలు ఇంకా చెల్లించలేదు. దీనికి కారణం సుప్రీం ఉత్వర్వులేనని సంస్థ ప్రకటించింది.

Written By: Raj Shekar, Updated On : August 21, 2024 9:05 pm

byjus ravindran

Follow us on

Byjus : బైజూస్ ఆధ్వర్యంలో ఎడ్ టెక్ సేవలు అందించే థింక్ అండ్ లర్న్ తన ఉద్యోగులకు గత నెల వేతనాలు చెల్లించలేదు. ఇక ఎన్సీఎల్ఏటీ తీసుకున్న నిర్ణయంపై సుప్రీం కోర్టు తాత్కాలిక స్టే ఇవ్వడంతో ఇబ్బందికర పరిస్థితి తలెత్తిందని పేర్కొంది. ప్రస్తుతం కంపెనీ ఖాతాలను యాక్సెస్ చేయలేకపోతున్నామని, దీంతో ఉద్యోగుల జులై వేతనాలు అందించలేకపోయామని కంపెనీ సీఈవో, వ్యవస్థాపకుడు బైజూ రవీంద్రన్ బుధవారం వెల్లడించాడు బీసీసీఐతో రూ 158 కోట్ల బకాయిల సెటిల్ మెంట్ ను ఎన్సీఎల్ ఏటీ ఆగస్ట్ 2న ఆమోదించింది. బైజూస్ దివాలా ప్రొసీడింగ్స్ ను పక్కన పెట్టాలని ఆదేశించింది. అయితే ఈ నిర్ణయంపై అమెరికాకు చెందిన రుణదాత గ్లాస్ ట్రస్ట్ కంపెనీ అయిన ఎల్ఎల్ సీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ తీర్పుపై సుప్రీం కోర్టు ఈ నెల 14న తాత్కాలిక స్టే ఇస్తూ తీర్పు ఇచ్చింది. యూఎస్ లో తమ నుంచి సేకరించిన నిధులను బైజూస్ సంస్థ ఒప్పందాన్ని ఉల్లంఘించి వినియోగించిందని విదేశీ రుణదాతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాదం తీవ్రమైంది. ఈ నిధులను బీసీసీఐ తో సెటిల్ మెంట్ కోసం వినియోగించలేదని బైజూస్ వాదిస్తున్నది. అయితే ఉద్యోగులకు వేతనాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో రవీంద్రన్ స్పందించారు. ఉద్యోగులు తనను మన్నించాలని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో బైజూ రవీంద్రన్ తమ కంపెనీ ఉద్యోగులకు ఈ మెయిల్ ద్వారా లేఖ పంపారు. నేను మీకు అత్యంత ఆందోళన కలిగించే అంశాన్ని చెప్పాలనకుంటున్నాను. ఈ ఏడాది జులై నెల వేతనాలు ఇప్పటివరకు జమ కాలేదని మీకు తెలుసు.

ప్రస్తుతం కంపెనీ తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్నది. భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డు తో వివాదాల కారణంగా మన సంస్థ దివాళా ప్రక్రియ వరకు వెళ్లింది. అయితే ఈ కేసును సెటిల్ చేసుకున్నాం. అంతా బాగుందనుకున్న సందర్భంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఇబ్బందికరంగా మారింది. కంపెనీ ఖాతాలను యాక్సెస్ చేయలేకపోతున్నాం. ఇప్పటివరకు పూర్తి యాక్సెస్ ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక నియంత్రణ కారణంగా జీతాలు చెల్లించలేకపోతున్నామంటూ వెల్లడించారు. త్వరలోనే వేతనాలు చెల్లించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, గతంలోలాగే ఈ వేతనాలు చెల్లిస్తామని స్పష్టం చేశారు.

బైజూస్ దివాళా ప్రక్రియలో రుణదాతల కమిటీ లేకుండా ఐఆర్పీని నిరోధించేందుకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు మంగళవారం నిరాకరించింది. బైజూస్ తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వి తన వాదనలు వినిపించారు. సీవోసీని ఏర్పాటు చేయకుండా ఐఆర్పీని నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని చీఫ్ జస్టిస్ డీవై చంద్ర చూడ్ నేతృత్వంలోని మరో ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసానాన్ని సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వి కోరారు. దీనిపై గురువారం మరోసారి వాదనలు వింటామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది ఇప్పటికిప్పుడు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పింది.

ఇక బైజూస్ ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద ఎడ్ టెక్ ఫ్లాట్ ఫారమ్ గా ఉందని, ప్రతి నెలా 150 మిలియన్ విద్యార్థులు కంపెనీ సేవలను వినియోగించుకుంటున్నారని యాజమాన్యం ప్రకటించింది. సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ, తమ సేవలు వినియోగించుకునేవారి సంఖ్య మరింత పెరుగుతూ వస్తున్నదని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగానే కాకుండా దేశమంతటా ఎంతో మందికి సేవలందిస్తూనే మరెంతో మందికి ఉపాధి కల్పిస్తున్న తమ కంపెనీ మారిందని ఈ సందర్భంగా రవీంద్రన్ గుర్తు చేశారు.