Reliance jio space fibre : వెనుకటికి.. ఎవరికైనా టీవీ ఉంటే ఇంటి పైన డిష్ యాంటినా ఉండేది.. వాతావరణంలో ఏవైనా మార్పులు చోటు చేసుకుంటే.. టీవీలో ప్రసారాలు వచ్చేవి కావు. ఆ యాంటినా ను అటూ ఇటూ సరి చేస్తే అప్పుడు టీవీలో ప్రోగ్రాములు వచ్చేవి. అప్పట్లో సమాచార వ్యవస్థ ఇంత బలంగా లేదు, టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందలేదు. అందువల్లే శాటిలైట్ ప్రసారాలలో అంతరాయాలు ఏర్పడేవి. తర్వాత టెక్నాలజీ పెరిగింది.. డిష్ యాంటినా కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు డిజిటల్ సెట్ అప్ బాక్స్ దాకా సాంకేతిక పరిజ్ఞానం ఎదిగింది. ఫలితంగా ఎలాంటి వాతావరణంలో నైనా సరే అద్భుతమైన టీవీ ప్రసారాలు చూసే అవకాశం కలిగింది. దీనంతటికి కారణం అద్భుతమైన శాటిలైట్ వ్యవస్థ. ఇప్పుడు అలాంటి అధునాతన సాంకేతిక వ్యవస్థ ఇంటర్నెట్ సేవలను అందించనుంది. అదేంటి ఇప్పుడు మనం వాడుతున్న ఇంటర్నెట్ శాటిలైట్ నుంచే కదా.. అనే సందేహం మీకు రావచ్చు.. కాకపోతే మీకు త్వరలో అందుబాటులోకి వచ్చే శాటిలైట్ ఇంటర్నెట్ మీ ఇంటి పక్కనే ఉంటుంది. స్థూలంగా చెప్పాలంటే మీ ఇంటికి సమీపంలో ఇన్ స్టాల్ చేస్తారు.. దీనివల్ల అపరిమితమైన డాటా పొందవచ్చు.. పైగా విపరీతమైన వేగంతో సేవలు అందుకోవచ్చు.
ఉపగ్రహాల నుంచి డేటా
మనదేశంలో ఇలా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించేందుకు జియో అనుమతి పొందింది. ఈ సేవలను Jio space fiber ద్వారా అందిస్తోంది.. ఇది భూమి చుట్టూ తిరిగే ఉపగ్రహాల నుంచి డేటా సేకరించి పంపుతుంది. ఇప్పటికే జియో కంపెనీ గుజరాత్ లోని గిర్, చత్తీస్ గడ్ రాష్ట్రంలోని కోర్బా, అస్సాంలోని జోర్హాట్ లోని ఓఎన్జీసీ, ఒడిశాలోని నాబ్రంగ్ పూర్ లో జియో స్పేస్ ఫైబర్ సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ సేవలను లక్సెం బర్గ్ ప్రాంతానికి చెందిన కంపెనీ SES తో కలిసి అందిస్తోంది.. మనదేశంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ ల్యాండ్ స్కేప్ కు అంతరాయం కలిగించకుండా ఉండేందుకు జియో ఈ సేవలను లక్ష్యంగా పెట్టుకుంది.. జియో స్పేస్ ఫైబర్ ను ఇటీవల జరిగిన జాతీయ మొబైల్ కాంగ్రెస్ లో రిలయన్స్ కంపెనీ ఆవిష్కరించింది.
ఉపగ్రహ ఆధారిత బ్రాడ్ బ్యాండ్ సేవ
జియో స్పేస్ ఫైబర్ అనేది ఉపగ్రహ ఆధారిత బ్రాడ్ బ్యాండ్ సేవ. హై స్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు కేబుల్స్ లేదా ఫైబర్ ఉపయోగించే ప్రామాణిక బ్రాడ్ బ్యాండ్ కాకుండా.. కమ్యూనికేషన్ ఉపగ్రహాల ద్వారా అందిస్తుంది.. జియో ఎయిర్ ఫైబర్, జియో ఫైబర్ తో పోల్చితే.. జియో స్పేస్ ఫైబర్ చాలా భిన్నంగా ఉంటుంది.. మీ ఇంటికి సమీపంలో ఇన్ స్టాల్ చేసిన శాటిలైట్ డిష్ భూమి చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాల నుంచి డేటాను పంపుతుంది.. తిరిగి స్వీకరిస్తుంది.. ఈ సాంకేతికత గ్రామీణ ప్రాంతాలలో సంప్రదాయ కేబుల్ లేదా ఫైబర్ కనెక్షన్లు అందుబాటులో లేని ప్రాంతాలలో ఇంటర్నెట్ కవరేజీ అందిస్తుంది.
తేడా అదే..
ఉపయోగించిన వైర్ల ఆధారంగా బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ వేగం మారుతుంది.. ఫైబర్ లో ఇంటర్నెట్ వేగం 1000 Mbps కంటే ఎక్కువ ఉంటుంది. శాటిలైట్ ఇంటర్నెట్ వేగం కూడా అదే స్థాయిలో ఉంటుంది. అయితే కేబుల్ ఇంటర్నెట్ వేగం పరంగా నమ్మదగినది. అంతరిక్షం నుంచి సిగ్నల్ వస్తుంది కాబట్టి, ఉపగ్రహ ఇంటర్నెట్ కూడా అందుబాటులో ఉండడం మంచిదే. కేబుల్ లేదా ఫైబర్ కనెక్షన్ లేని గ్రామీణ ప్రాంతాలలో శాటిలైట్ ఇంటర్నెట్ అనేది ఉపయుక్తంగా ఉంటుంది.. ఫైబర్ లేదా కేబుల్ వంటి బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సౌకర్యం మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందిన ప్రాంతాలలో మాత్రమే లభిస్తుంది..
ఈ ఉపగ్రహాల ఆధారంగా .
మనదేశంలో జియో త్వరలో అందించే శాటిలైట్ ఇంటర్నెట్ ఈ మూడు ఉపగ్రహాల మీద ఆధారపడి. అందులో ఒకటి జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్ (GEO), మీడియం ఎర్త్ ఆర్బిట్(MEO), ఎర్త్ ఆర్బిట్(LEO).
జియో స్టేషనరీ ఎర్త్ ఆర్బిట్
ఇందులో ఉపగ్రహాలు భూమి ఉపరితలం నుంచి 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో తిరుగుతుంటాయి. అవి ప్రయాణించే వేగం భూమి భ్రమణానికి సరిపోతుంది. భూమిపై అదే పాయింట్ పై అవి ఉంటాయి. వాటి పరిమాణం, ఎత్తు కారణంగా భూమి మొత్తం ఉపరితలాన్ని కవర్ చేసేందుకు మూడు ఉపగ్రహాలు మాత్రమే జియోకు అవసరం.
మీడియం ఎర్త్ ఆర్బిట్
ఇందులో ఉపగ్రహాలు భూమిపైన 5000 నుంచి 12 వేల కిలోమీటర్ల మధ్య ఎత్తులో ఉంటాయి. ఇందులో పూర్తి ఇంటర్నెట్ కవరేజ్ కోసం 8 నుంచి 20 మధ్య స్పే క్రాఫ్ట్ లు అవసరం.
లో ఎర్త్ ఆర్బిట్
ఇందులో ఉపగ్రహాలు 850 నుంచి 2000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. ఇందులో ఉపగ్రహాలు మూడు కక్ష్యలలో తిరుగుతుంటాయి.. దీని పరిధిలో ఇంటర్నెట్ కవరేజ్ కోసం విపరీతమైన ఉపగ్రహాలు అవసరమవుతాయి. వాతావరణంలో చోటు చేసుకునే మార్పులు ఈ ఉపగ్రహాల జీవితకాలాన్ని ప్రభావితం చేస్తాయి.