Air India-Vistara: ఎయిర్ ఇండియా-విస్తారా విలీనానికి కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. సింగపూర్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ క్యారియర్ సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్‌ఐఏ) విస్తారా ఎయిర్‌లైన్స్‌లో 49 శాతం, టాటా సన్స్ 51 శాతం కలిగి ఉన్నాయి. నవంబర్ 2022లో టాటా సన్స్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాతో విస్తారా ఎయిర్‌లైన్స్ తన విలీనాన్ని ప్రకటించింది. విస్తారా ఎయిర్‌లైన్స్‌లో సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్‌ఐఏ) వాటా (ఎఫ్‌డిఐ)ని ఎయిరిండియాతో విలీనం చేయడానికి కేంద్రం అనుమతి అవసరం. టాటా సన్స్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియాలో విస్తారా ఎయిర్‌లైన్స్ విలీనం తర్వాత, ఎయిర్ ఇండియాలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ (ఎస్‌ఐఏ)కి దాదాపు 25.1 శాతం వాటాను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ ఇండియాలో విస్తారా విలీనం తర్వాత టాటా-సాయ్ జాయింట్ వెంచర్‌ను మూసివేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది ఎయిర్ ఇండియాతో విస్తారా ఎయిర్‌లైన్స్ విలీనం ఈ ఏడాది చివరి నాటికి పూర్తి కానుంది. అలా నవంబర్ 12 నుంచి విస్తారా ఎయిర్‌లైన్స్ నిలిచిపోనుంది. ఎయిర్ ఇండియాతో విలీనం అయిన తర్వాత, అది AI2 ఫ్లైట్ నంబర్‌ను పొందుతుంది. విస్తారా విమానాలు మాత్రం మార్చి వరకు వాటి ఒరిజినల్ ఫ్లైట్ నంబర్లతో పనిచేస్తాయి. విలీన ప్రక్రియను సజావుగా చేసేందుకు విస్తారా, ఎయిర్ ఇండియా బృందాలు గత ఏడాది కాలంగా కృషి చేస్తున్నాయని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. విలీనం తర్వాత, విస్తారా విమానం, సిబ్బంది సేవలు అలాగే ఉంటాయి. ఎయిర్ ఇండియా నారోబాడీ ఫ్లీట్ కొత్త విమానాల సరఫరాతో అప్‌గ్రేడ్ చేయబడుతోంది. పాత విమానాలు పూర్తిగా కొత్త ఇంటీరియర్స్‌తో నడవనున్నాయి.
నవంబర్ 12 తర్వాత విస్తారా ఎయిర్‌లైన్స్ ఎయిర్ ఇండియాలో విలీనం తర్వాత విమానాలను బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఐదు కీలక సూచలను కంపెనీ జారీచేసింది. ఎయిర్ ఇండియాలో విలీనం చేయడం ద్వారా విస్తారా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉంది. నవంబర్ 12 తర్వాత విస్తారా విమానాన్ని బుక్ చేసుకునే ప్రయాణికులు ఎయిర్ ఇండియా వెబ్‌సైట్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది. విలీనం తేదీ కంటే ముందే విస్తారా విమానాన్ని బుక్ చేసిన అనేక మంది కస్టమర్‌లు అలాగే వారి ప్రయాణాన్ని కొనసాగించవచ్చు. వారి ప్రయాణం సాఫీగా సాగాలంటే కొన్ని సులభమైన, కానీ అవసరమైన చర్యలు తీసుకోవాలి.
1. బుకింగ్ వివరాలను ధృవీకంరించాలి
విలీనం అంటే నవంబర్ 12 తర్వాత షెడ్యూల్ చేయబడిన అన్ని విస్తారా విమానాలు ఎయిర్ ఇండియా ద్వారా నిర్వహించబడతాయి. కాబట్టి, తాము బుక్ చేసుకున్న టికెట్లలో ఏవైనా మార్పులు సంభవించాయో తెలుసుకునేందుకు బుకింగ్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. వినియోగదారులు ఎయిర్ ఇండియా వెబ్‌సైట్‌లో లేదా మొబైల్ యాప్ ద్వారా తమ పీఎన్ఆర్ నంబర్, ఇంటిపేరును నమోదు చేయడం ద్వారా తమ బుకింగ్ కన్ఫాం చేసుకోవచ్చు.
ఈ దశ వారి విమాన స్థితి, ఏదైనా షెడ్యూల్ లేదా ఎయిర్‌క్రాఫ్ట్ సర్దుబాట్ల గురించి వారికి తెలియజేస్తుంది. ప్రయాణ రోజున, వినియోగదారులు సంబంధిత విమానాశ్రయాల్లోని ఎయిర్ ఇండియా కౌంటర్‌లో చెక్-ఇన్ చేయాల్సి ఉంటుంది. చివరగా, ట్రావెల్ ఏజెంట్ ద్వారా చేసిన బుకింగ్‌ల కోసం, వినియోగదారులు ఎయిర్ ఇండియా కాల్ సెంటర్‌ను సంప్రదించవచ్చు లేదా ఎయిర్ ఇండియా వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా తమ బుకింగ్‌లను నిర్వహించవచ్చు.
2. పీఎన్ఆర్, ఇ-టికెట్ మార్పులు
మైగ్రేషన్ తర్వాత అన్ని పీఎన్ఆర్ లు అలాగే ఉంటాయి. కాకాపోతే విస్తారా టిక్కెట్‌ని ఎయిర్ ఇండియా జారీ చేసిన కొత్త టిక్కెట్‌తో భర్తీ చేస్తారు. ఇది వేరే ఇ-టికెట్ నంబర్‌ను కలిగి ఉంటుంది. ప్రయాణ సమయంలో ఏవైనా వ్యత్యాసాలను పరిష్కరించడానికి కస్టమర్‌లు పాత కొత్త టిక్కెట్ వివరాల రెండింటి రికార్డులను నిర్వహించాల్సి ఉంటుంది.
3. ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్ ఫర్మేషన్
విలీనం తర్వాత విమాన సమయాల్లో ఏమైనా మార్పులు సంభవించినట్లయితే, ఎయిర్ ఇండియా కస్టమర్ సర్వీస్ టీమ్ వినియోగదారులకు ఇమెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేస్తుంది. కస్టమర్లందరికీ మెరుగైన సౌకర్యాలను అందించేందుకు రెండు ఎయిర్‌లైన్స్ బృందాలు అన్ని ప్రయత్నాలు చేస్తాయి.ఎయిర్ ఇండియా వెబ్‌సైట్‌లో ఫ్లైట్ స్టేటస్‌ను కూడా చెక్ చేసుకోవాలని కస్టమర్‌లకు సూచించారు.
4. బ్యాగేజీ అలవెన్స్, కొనుగోళ్లు, లాంజ్ యాక్సెస్
విస్తారా బుకింగ్‌తో ఇప్పటికే అదనపు బ్యాగేజీని కొనుగోలు చేసిన కస్టమర్‌లు కొత్త ఎయిర్ ఇండియా విమానానికి (నవంబర్ 12 నుండి ప్రయాణానికి, నియంత్రణ ఆమోదాలకు లోబడి) బదిలీ చేయబడతారు. సౌకర్యవంతమైన విమానాశ్రయ అనుభవం కోసం, అదనపు సామాను కొనుగోళ్లకు సంబంధించిన ఏదైనా రసీదులు లేదా డాక్యుమెంటేషన్‌ను తమ వెంట ఉంచుకోవాలని కస్టమర్‌లకు సూచించారు. విస్తారా బుకింగ్‌తో కొనుగోలు చేసిన లాంజ్ యాక్సెస్, స్పెషల్ సర్వీసెస్ ఎయిర్ ఇండియా ద్వారా నిర్వహించబడుతున్నట్లయితే (నవంబర్ 12 నుండి ప్రయాణానికి) చెల్లుబాటు కాకపోవచ్చు. అయితే, ఈ అదనపు సేవలకు సంబంధించిన రీఫండ్‌ను విస్తారా అందజేస్తుంది.
5. రీషెడ్యూలింగ్, క్యాన్సిల్
కస్టమర్‌లు తమ విమానాన్ని రీషెడ్యూల్ చేయవలసి వస్తే లేదా రద్దు చేయవలసి వస్తే, సంబంధిత విధానాలు వర్తించే విమానాన్ని ఏ ఎయిర్‌లైన్ నడుపుతున్నారనే దానిపై ప్రాసెస్, ఫీజులు ఆధారపడి ఉంటాయి. కస్టమర్‌లు సహాయం కోసం సంబంధిత కస్టమర్ కేర్ బృందాలను సంప్రదించవచ్చు.