
గత కొన్ని నెలల నుంచి అంతకంతకూ తగ్గుతున్న బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నెల 1వ తేదీ నుంచి బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కరోనా కేసులు భారీగా పెరగడం వల్లే బంగారం ధరలు పెరుగుతున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గతేడాది కరోనా కేసులు ఎక్కువైన సమయంలోనే ధరలు పెరగగా ఈ ఏడాది కూడా కేసులు పెరుగుతున్న సమయంలోనే పసిడి ధరలు పెరుగుతున్నాయి.
కరోనా కేసులు పెరుగుతుండటంతో రాబోయే రోజుల్లో స్టాక్ మార్కెట్లు పడిపోయే అవకాశాలు ఉండటంతో స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టిన వాళ్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నారు. అలాంటి వాళ్లు బంగారంపై ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. ఈరోజు కూడా బంగారం ధరలు పెరగడం గమనార్హం.
న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.46,152 నుంచి రూ.46,554కు పెరగగా 22 క్యారెట్ల బంగారం ధర రూ.42,275 నుంచి 42,643కు పెరగడం గమనార్హం.హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల బంగారం ధర ఒక్కరోజులో 500 రూపాయలు పెరిగింది. ఒకవైపు బంగారం ధరలు పెరుగుతుంటే మరోవైపు వెండి ధరలు కూడా పెరుగుతుండటం గమనార్హం.
కిలో వెండి ధర రూ.66,905 నుంచి రూ.67,175కు పెరిగింది. హైదరాబాద్ తో పాటు విజయవాడలో కూడా బంగారం ధరలు ఒకేలా ఉన్నాయి. బంగారంపై ఇన్వెస్ట్ చేసేవాళ్లకు ఇదే సరైన సమయమని చెప్పవచ్చు.