Ratan Tata : రతన్ టాటా రెండు దశాబ్దాల పాటు టాటా సంస్థల అధిపతిగా కొనసాగారు. అనేక వ్యాపారాలలో టాటా సంస్థలను ప్రవేశపెట్టి.. అద్భుతమైన విజయాలు సాధించారు. ఆటోమొబైల్, పవర్, స్టీల్, బెవరేజేస్, అగ్రికల్చర్.. ఇలా విభిన్నమైన రంగాలలో టాటా సంస్థలను విస్తరించి లక్షల మందికి ఉపాధి కల్పించారు. అయితే ఒక సందర్భంలో మాత్రం రతన్ టాటా అవమానాలు ఎదుర్కొన్నారు. చివరికి తనను అవమానించిన వ్యక్తికి కొన్ని సంవత్సరాల అనంతరం అండగా నిలిచారు. దయాగుణంలో, క్షమాగుణంలో రతన్ టాటా ఎవరెస్టు శిఖరం అంత ఎత్తుకు ఎదిగారు. సహజంగానే మనల్ని ఎవరైనా అవమానిస్తే కోపంతో రెచ్చిపోతాం. వారిపై అంతకంతకు బదులు తీర్చుకోవాలని చూస్తుంటాం. దానికి తగ్గ సమయం కోసం ఎదురు చూస్తుంటాం. రతన్ టాటాకు అలాంటి సందర్భం ఎదురైనప్పటికీ.. ఆయన ప్రతీకారం తీర్చుకోలేదు. పైగా ఆపద సమయంలో తనను అవమానించిన వారికి సహాయం అందించారు..
1998లో..
టాటా కంపెనీ 1998లో ఇండికా పేరుతో తొలి హ్యాచ్ బ్యాక్ కారును తెరపైకి తీసుకొచ్చింది. డీజిల్ తో నడిచే ఆ కారు టాటా కంపెనీ అనుకున్న స్థాయిలో విజయాన్ని దక్కించుకోలేదు. అమ్మకాలు కూడా ఆ స్థాయిలో లేవు. దీంతో తన కార్లు తయారీ వ్యాపారాన్ని విక్రయించాలని టాటా నిర్ణయించారు. అదే సమయంలో అమెరికాకు చెందిన ఫోర్డ్ కంపెనీ టాటా కార్ల తయారీ పరిశ్రమను కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది. 1999లో ఫోర్డ్, టాటా కంపెనీల ప్రతినిధులు సమావేశం అయ్యారు. ప్రఖ్యాత బాంబే హౌస్ లో ఈ సమావేశం జరిగింది. టాటా గ్రూప్ నుంచి రతన్ టాటా, మరికొందరు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆ సమావేశంలో ఫోర్డ్ కంపెనీ చైర్మన్ బిల్ ఫోర్డ్ కూడా పాల్గొన్నారు. మూడు గంటలపాటు సమావేశం జరిగినప్పటికీ… కార్ల కంపెనీ కొనుగోలు సంబంధించి ఒక అడుగు కూడా ముందుకు పడలేదు.
అవమానించారు.. అయినప్పటికీ..
ఫోర్డ్ కంపెనీ ప్రతినిధులు రతన్ టాటా ను అవమానించారు..” మీకు కార్లు తయారీలో అనుభవం లేనప్పుడు.. పరిశ్రమ ఎందుకు ప్రారంభించారంటూ” బిల్ ఫోర్డ్ టాటా ను నిలదీశారు. ఆయన అన్న మాటలకు రతన్ చాలా ఇబ్బంది పడ్డారు. ఫోర్డ్ చేతిలో ఎదురైన అవమానం రతన్ టాటా లో కసిని పెంచింది.. ఇక నాటి నుంచి రతన్ కార్ల తయారీపై ప్రధానంగా దృష్టి సారించారు. టాటా కంపెనీని ఆటోమొబైల్ రంగంలో తిరుగులేని స్థాయిలో నిలిపారు. ఈలోగానే 2008లో ఆర్థిక మాంద్యం దెబ్బకు ఫోర్డ్ కంపెనీ సర్వనాశనమైంది. దీంతో ఆ కంపెనీకి చెందిన జాగ్వార్, ల్యాండ్ రోవర్ బ్రాండ్లను టాటా కంపెనీ 2.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ సమయంలో ఫోర్డ్ రతన్ టాటాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే ఈ రెండు సందర్భాలను రతన్ టాటాకు అత్యంత సన్నిహితుడు ప్రవీణ్ కండ్లే దగ్గరుండి చూశారు. 2015లో ఈ విషయాన్ని బయటి సమాజానికి తెలియజేశారు. ప్రస్తుతం ల్యాండ్ రోవర్, జాగ్వార్ బ్రాండ్లు టాటా కంపెనీకి విశేషమైన లాభాలను తెచ్చిపెడుతున్నాయి.