Donkey Milk: “గంగిగోవు పాలు గరిటడైన చాలు. కడివెడైన నేమీ ఖరము పాలు” వెనకటికి ఎప్పుడో సుమతీ శతకారుడు చెప్పాడు గాని.. ఇప్పుడు దానిని మార్చుకోవాలేమో.. ఎందుకంటే అంత స్థాయిలో గాడిద పాలకు డిమాండ్ పెరిగింది మరి. గేదె, మేక, ఆవు పాల వ్యాపారం చేసిన వాళ్లను చూసాం. కానీ గాడిద పాలకు డిమాండ్ భారీగా పెరుగుతుండడంతో చాలామంది ఈ వ్యాపారంలోకి అడుగు పెడుతున్నారు. నిన్న మొన్నటిదాకా గాడిదలను ఎందుకు పనికిరాని జంతువులా చూసినవారే.. ఇప్పుడు వాటి కోసం ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేసి సాకుతున్నారు. గోదావరి జిల్లా చెందిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ విదేశాల్లో చదివాడు. జీతం లక్షల్లోనే ఉంటుంది. కానీ ఆ కంప్యూటర్ కొలువుకు ఉన్నఫలంగా రాజీనామా చేశాడు. బంధువులు వారిస్తున్న లెక్కచేయకుండా తన మిత్రులతో కలిసి గాడిదల ఫామ్ మొదలుపెట్టాడు. తర్వాత ఏమైందో మీరే చదవండి.
_ రొటీన్ కి భిన్నంగా ఆలోచించాడు
ఆవులను, గేదెలను, మేకలను పెంచడం నిత్యజీవితంలో మనం చూస్తూనే ఉంటాం. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా కనిపించని గాడిదల ఫామ్ ను తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం మల్లంపూడి గ్రామంలో అక్షయ డాంకీ ఫామ్ పేరుతో సుమారు 115 విభిన్న జాతుల గాడిదలతో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్, తన మిత్రులతో కలిసి ప్రారంభించాడు. ఏకంగా సుమారు 10 ఎకరాల భూమిని తీసుకొని వాటికి అనువుగా దాణా, ఆరోగ్యానికి సంబంధించిన మందులతో తన మిత్రులతో కలిసి గాడిదల ఫామ్ ను నిర్వహిస్తున్నారు. రాజమండ్రి కి నరాల వీర వెంకట కిరణ్ కుమార్ కోవిడ్ సమయంలో అనారోగ్యానికి గురయ్యాడు. తన శరీరంలో రోగ నిరోధక శక్తి తక్కువైందని, వెంటనే గాడిద పాలు తీసుకోమని డాక్టర్లు సూచించారు. అయితే వాటికోసం కిరణ్ తీవ్రంగా శ్రమించాడు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 7000 పెట్టి లీటర్ పాలను కొనుగోలు చేశాడు. గాడిద పాలకు 7000 ఖర్చు చేయాలా అని ఆశ్చర్యపోయాడు. గాడిద పాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో సాఫ్ట్వేర్ కొలువుకు రాజీనామా చేశాడు. ఇదే విషయాన్ని తన నలుగురు ఆప్త మిత్రులతో పంచుకొన్నాడు. వారు కూడా కిరణ్ ఆలోచనకు జై కొట్టారు. అందరూ కలిసి ఆరు నెలల పాటు గాడిదల జీవన విధానం, వాటి ఆరోగ్యం, ఎలాంటి ఆహారం ఇవ్వాలి అనే అంశాలపై కర్ణాటక రాష్ట్రంలో ఆరు నెలల పాటు శిక్షణ పొందారు. అనంతరం ఈ ఫామ్ ఏర్పాటు చేశామని నిర్వాహకుల్లో ఒకరైన వెంకట్ అన్నారు. వాస్తవానికి గాడిదల పెంపకానికి సంబంధించి అంతగా కష్టపడాల్సిన అవసరం లేదని అందరూ అనుకుంటారు. కానీ నాణ్యమైన పాలను వినియోగదారులకు అందించాలంటే ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలని వెంకట్ చెప్తున్నారు. ఇందులో భాగంగానే టోక్యో బిట్స్, గుజరాత్ హలారీ బిడ్స్, మహారాష్ట్ర కాత్వాడీ బ్రీడ్స్, ఇథియోపియా ఫారిన్ కంట్రీ బ్రీడ్స్ ను ఎంచుకున్నారు. ఈ రకాలకు చెందిన గాడిదల విలువ సుమారు 50,000 నుంచి 3 లక్షల వరకు ఉంటుందని వెంకట్ వివరించారు. అయితే గాడిద పాల వినియోగం మనదేశంలో కంటే ఇతర దేశాల్లో అధికంగా ఉంది. అందుకే గాడిద పాలు లీటర్ 7000 వరకు పలుకుతుంది. అయితే ఈ స్నేహితులు తమ కొలువుల్లో కంటే గాడిద పాల వ్యాపారంలో మూడింతలు అధికంగా సంపాదిస్తున్నారు. ఈ గాడిద పాలను కంటైనర్ ద్వారా రోజు హైదరాబాద్ బెంగళూరు ప్రాంతాలకు 25 లీటర్ల వరకు ఎగుమతి చేస్తున్నారు.
ఫామ్ ఎందుకు ఏర్పాటు చేశారు అంటే
గాడిద పాలకు డిమాండ్ అంతకంతకు పెరిగిపోతున్నడంతో అందరికీ తక్కువ ధరకే అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో వీరు గాడిదల ఫామ్ ఏర్పాటు చేశారు. గాడిద పాలు తాగితే ఆరోగ్యానికి మంచిదని, ముఖ్యంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు దరిచేరవని వైద్యులు అంటున్నారు. గాడిద పాలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల ముసలితనం ఛాయలు దరిచేరవని చెబుతున్నారు. ఇక మెట్రో నగరాల్లో గాడిద పాలతో స్నానం చేయించే బ్యూటీ పార్లర్ లు పుట్టుకొచ్చాయి. ఒకసారి గాడిదపాలతో స్నానం చేయిస్తే 30 వేలకు పైగా తీసుకుంటున్నారు. ప్రస్తుతం అక్షయ డాంకీ ఫామ్ తో 20కి పైగా కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గాడిద పాలతో రకరకాల సబ్బులు, క్రీమ్స్ తయారు చేసే సంస్థలు కూడా అక్షయ డాంకీ ఫామ్ తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. వెనుకటికి ఎవరైనా చదువుకోకుంటే గాడిదలు కాసి బతుకుతావా అన్ని పెద్దలు తిట్టేవారు. కానీ ఇప్పుడు ఆ గాడిదలను పెంచితే సాఫ్ట్ వేర్ కొలువు కంటే ఎక్కువ పైసలు వస్తున్నాయి. అందుకే అంటారు దేన్ని చిన్నచూపు చూడొద్దని.