
ప్రతి నెలలో 1వ తేదీ నుంచి కొన్ని అంశాలలో, నిబంధనలలో మార్పులు వస్తుంటాయి. ఆ అంశాలు, నిబంధనల గురించి అవగాహనను కలిగి ఉంటే ఇబ్బందులు పడకుండా తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఈ నెలలో బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అంశాలతో పాటు సిలిండర్ కు సంబంధించిన నియమ నిబంధనలు కూడా మారనున్నాయి. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ ఈరోజు నుంచి ప్రాథమిక పొదుపు బ్యాంక్ డిపాజిట్ ఖాతాదారుల లావాదేవీల విషయంలో మార్పులు చేయనుంది.
ప్రాథమిక పొదుపు బ్యాంక్ డిపాజిట్ ఖాతాను కలిగి ఉన్నవాళ్లు ఇకపై బ్యాంకులు లేదా ఏటీఎంల నుంచి నెలకు కేవలం నాలుగుసార్లు మాత్రమే నగదు విత్ డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఉచిత లావాదేవీల తర్వాత ఒక్కో విత్ డ్రాకు జీఎస్టీతో 15 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి నెలా 1వ తేదీన గ్యాస్ సిలిండర్ కు సంబంధించిన అంశాల్లో మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి.
జూన్ నెలలో గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సిలిండర్ ధరలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. చెక్ బుక్ లిమిట్ విషయంలో ఎస్బీఐ కస్టమర్లకు భారీ షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతోంది. 10 చెక్కుల కొత్త చెక్కు పుస్తకం కోసం రూ.40, 25 చెక్కుల పుస్తకం కోసం రూ.75 అదనంగా జీఎస్టీతో చెల్లించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు మాత్రం మినహాయింపు ఉంటుంది.
సిండికేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్ విలీనం కావడంతో సిండికేట్ బ్యాంక్ ఖాతాదారులు కెనరా బ్యాంక్ కు చెందిన కొత్త ఐఎఫ్ఎసీ కోడ్ లు వినియోగిస్తే మాత్రమే లావాదేవీలు చేయగలుగుతారు. ఆంధ్రబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు యూనియన్ బ్యాంకులో విలీనం కాగా యూనియన్ బ్యాంకుల్లో కొత్త చెక్ బుక్కులను తీసుకోవాల్సి ఉంటుంది. గత రెండు సంవత్సరాల ఆదాయానికి సంబంధించి టీడీఎస్, టీసీఎస్ 50,000 రూపాయల కంటే ఎక్కువగా ఉంటే వారి నుంచి అధిక పన్ను వసూలు చేయాలని ఆదాయపు పన్ను విభాగం నిర్ణయం తీసుకుంది.
ప్రముఖ ద్విచక్ర వాహన కంపెనీ హీరో మోటోకార్ప్ టూవీలర్ ధరలను పెంచనుండగా నేటి నుంచి పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి.