Tata Sumo New Model: టాటా సుమో.. ఈ పేరు చెప్తే వివి వినాయక్ సినిమాల్లో గాల్లోకి లేచే వాహనాలు గుర్తుకొస్తాయి కదా.. ఆ వాహనానికి ఉన్న క్రేజ్ వల్లే తన సినిమాల్లో విరివిగా ఉపయోగించానని వినాయక్ పలుమార్లు చెప్పాడు కూడా. టాటా సుమో అంటే తెలియని వారు ఉండరు. అప్పట్లో పెద్దపెద్ద నాయకులు టాటా సుమోలోనే తిరిగేవారు. టాటా సుమోలో ప్రయాణించడానికి తమ రాజసానికి ప్రతీకలాగా భావించేవారు. టాటా కంపెనీ తయారుచేసిన ఉత్పత్తుల్లో సుమో మొదటి ఐదు స్థానాల్లో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి సుమో అనేది మన దేశానికి సంబంధించింది కాకపోయినప్పటికీ.. అది జపాన్ దేశానికి చెందిన ఆటోమొబైల్ ఉత్పత్తి అయినప్పటికీ.. టాటా కంపెనీ దానిని భారతీయులకు పరిచయం చేసింది. సరికొత్త వాహన అనుభూతిని అందించింది. ఇప్పుడంటే ఫార్చునర్, ఇంకా కొత్త కొత్త కార్లు రోడ్లమీద సవారి చేస్తున్నాయి గాని.. ఒకప్పుడు టాటా సుమో అంటే రాజసానికి నిదర్శనంగా ఉండేది. అయితే కాలాను క్రమంలో సుమో మరుగున పడిపోయింది. అప్పట్లో టాటా కంపెనీ నానో అనే కారణం తెరపైకి తీసుకువచ్చినప్పుడు.. దాని తయారీలో భాగంగా సుమోను పక్కన పెట్టిందని వార్తలు వినిపించాయి. ఇన్నాళ్లకు టాటా కంపెనీ వాహనదారులకు శుభవార్త చెప్పింది. మారిన పరిస్థితులకు అనుగుణంగా సుమోను మార్కెట్లోకి తీసుకొస్తున్నట్టు వివరించింది.
7 సీటర్ కెపాసిటీతో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ SUV గా దీనిని టాటా కంపెనీ మార్చినట్టు తెలుస్తోంది. పూర్తి అధునాతన వాహనంగా టాటా కంపెనీ దీనిని రూపొందించింది. ఫ్రంట్ గ్రిల్, ఎక్కువ కాంతిని వెదజల్లే ఎల్ఈడి హెడ్ లాంప్ లు, పగటిపూట కూడా వెలిగే ఇంటిగ్రేటెడ్ రన్నింగ్ లైట్లను ఏర్పాటు చేసింది. స్టైలిష్ టెయిల్ లైట్ తో వాహనం వెనుక భాగాన్ని రూపొందించింది.
క్యాబిన్ ను అత్యంత సౌకర్యవంతంగా రూపొందించింది. డ్రైవర్ కాక్ పిట్ లో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే కు సపోర్ట్ చేసే పెద్ద టచ్ స్క్రీన్ ఏర్పాటు చేసింది. ఈ వాహనంలో మూడు వరుసల్లో ప్రయాణికులు కూర్చునే విధంగా సీట్లు ఉన్నాయి. లెగ్ రూమ్ కూడా విస్తారంగా ఉంది. హెడ్ రూమ్ అధునాతనంగా ఉంది. ఎంత దూరం వెళ్లినా సౌకర్యవంతమైన ప్రయాణాన్ని ఆస్వాదించేలా టాటా కంపెనీ దీనిని రూపొందించింది. ప్రస్తుత మార్కెట్ అవసరాల దృష్ట్యా దీనిని స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ లాగా టాటా కంపెనీ మార్చింది. కొత్త నమూనాలో 176 బీ హెచ్ పీ పవర్, 350 ఎన్ఎం గరిష్ట టార్క్ విడుదల చేసే 2.0 సామర్థ్యం ఉన్న ఇంజన్ ఏర్పాటు చేసింది. మృదువైన సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ విధానం ఈ వాహనానికి ప్రత్యేక ఆకర్షణ. ఆటోమెటిక్ ట్రాన్స్ మిషన్ వల్ల వాహనాన్ని అత్యంత సులువుగా డ్రైవింగ్ చేయవచ్చు.
దీనికి సంబంధించి అధికారికంగా టాటా కంపెనీ ధర ప్రకటించకపోయినప్పటికీ ఆటోమొబైల్ పరిశ్రమల అంచనా ప్రకారం 11 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. సెవెన్ సీటర్ కెపాసిటీతో స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ సౌకర్యాన్ని కోరుకునే ప్రయాణికులకు టాటా సుమో వాహనం మంచి ఎంపిక అని ఆటోమొబైల్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వాహనాన్ని ఎప్పుడు మార్కెట్లోకి తీసుకొస్తుందో టాటా కంపెనీ వెల్లడించకపోయినప్పటికీ ఈ ఏడాది చివరి నాటికి విడుదల కావచ్చని తెలుస్తోంది.
ఇవీ ప్రత్యేకతలు
ఇంజన్: 2.0 లీటర్
కెపాసిటీ 176 BHP
టార్క్ 350 Km
6 – స్పీడ్ మాన్యువల్/ ఆటోమేటిక్
సీటింగ్ కెపాసిటీ 7 లేదా 8 మంది.
ప్రారంభ ధర 11 లక్షలు (మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం)