Numaish Exhibition: పాడు కరోనా అందరి జీవితాలను రోడ్డున పడేస్తోంది. సామాన్యుడి నుంచి వ్యాపారుల దాకా అతాలాకుతలం చేస్తోంది. ప్రతీ ఏడు వచ్చిపోతూ వ్యాపారాలను చిన్నాభిన్నం చేస్తోంది. లక్షలు అప్పులు చేసి ఉత్పత్తులతో హైదరాబాద్ వచ్చిన నుమాయిష్ వ్యాపారులు ఇప్పుడు కరోనాతో ఎగ్జిబిషన్ రద్దు కావడంతో ఆకలి అప్పుల బాధలతో అలమటిస్తున్న దుస్థితి నెలకొంది. అటు ప్రభుత్వం ఆదుకోక.. ఇటు తిరిగి పోవడానికి డబ్బుల్లేక దిక్కులేని జీవుల్లా హైదరాబాద్ లో పడి ఉన్నారు.
నుమాయిష్ ఎగ్జిబిషన్..హైదరాబాద్ లో నిర్వహించే ఈ ప్రఖ్యాత కార్యక్రమానికి దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి వ్యాపారులు తరలివస్తారు. హైదరాబాద్ లో చాలాకాలంగా నడుస్తున్న ఈ వార్షిక వాణిజ్య ప్రదర్శన ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈ వేడుకపై ఈసారి కరోనా పిడుగు పడింది. దీంతో హైదరాబాదీలకు షాక్ తగిలింది. ఇక్కడికొచ్చి వ్యాపారులకు భారీ నష్టం వాటిల్లింది. ఇక్కడికి డ్రైఫూట్స్ తీసుకొచ్చి వ్యాపారి రవాణా, ఇతర ఛార్జీల కోసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. ఇప్పుడా పెట్టుబడి రాక.. పోవడానికి కనీసం డబ్బులు లేక ఇక్కడే హైదరాబాద్ లో దిగాలుగా కూర్చున్న పరిస్థితి నెలకొంది. నూతన సంవత్సరంనాడు ఎంతో ఆర్భాటంగా ప్రారంభమైన నుమాయిష్ ఎగ్జిబిషన్ రెండోరోజునే మూతపడడంతో ఇప్పుడు వ్యాపారులు నిండా మునిగి నెత్తినోరు బాదుకుంటున్నారు. తిరిగి పోవడానికి డబ్బుల్లేక అగచాట్లు పడుతున్నారు.
81వ నుమాయిష్ ఎగ్జిబిషన్ ను జనవరి 1న గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ మన హోంమంత్రి మహబూద్ అలీతో కలిసి ప్రారంభించారు. తొలిరోజున అంతంత మాత్రంగానే సందర్శకులు వచ్చారు. రెండోరోజైన ఆదివారం పోటెత్తారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకూ సుమారు 10వేల మందికి పైగా సందర్శకులు పోటెత్తారు.
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కోవిడ్ ఆంక్షలను ఈనెల 10వరకూ పొడిగించింది. దీంతో పోలీసులు ఎగ్జిబిషన్ ను నిలిపివేయించారు. నుమాయిష్ ను 10వతేదీ వరకూ మూసివేసి ఉంచుతామని.. అప్పటివరకూ సందర్శకులు ఎవరూ రావొద్దని నిర్వాహకులు ప్రకటించారు.
ఈ ఎగ్జిబిషన్ కోసం వ్యాపారులు, చేతివృత్తుల వారు చాలా ఆశలతో సూదూర ప్రాంతాల నుంచి వచ్చారు. శ్రీనగర్ కు చెందిన నిషాద్ అనే డ్రై ఫ్రూట్స్ వ్యాపారి నుమాయిష్ కోసం వచ్చి ఇప్పుడు చేతిలో చిల్లిగవ్వ లేక అగచాట్లు పడుతున్నాడు. దాదాపు రూ.15 లక్షల విలువైన డ్రైఫ్రూట్స్ ను విక్రయించాలని రవాణా, పన్నులు, స్టాల్ అద్దె, కరెంట్, వేతనాలు, ఆహారం, వసతి కోసం అన్నింటిని కట్టేసి ఇక్కడ షాప్ పెట్టాడు. కానీ ఇప్పుడు కరోనాతో మూతపడడంతో ఇప్పుడు అతడు.. నలుగురు సిబ్బంది, నలుగురు కుటుంబ సభ్యులు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది. గత 30 ఏళ్లుగా నుమాయిష్ కు వస్తున్నానని.. ఇంతటి దారుణమైన దుస్థితి ఎప్పుడూ కలగలేదని కశ్మీరీ వ్యాపారి నిషాద్ వాపోయారు.
ఇతడే కాదు.. మరో కశ్మీరీ డ్రైఫూట్ వ్యాపారి సల్మాన్ అలీదీ ఇదే వ్యథ. ప్రభుత్వం మా కష్టాలను గుర్తించి ఆదుకోవాలని.. హైదరాబాద్ లో అన్ని వ్యాపారాలు కొనసాగుతున్నప్పుడు నుమాయిష్ ను ఎందుకు రద్దు చేశారో చెప్పాలని వారంతా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
కశ్మీరీ వ్యాపారులే కాదు.. దేశం నలుమూలల నుంచి వచ్చిన వ్యాపారులు, వారి కుటుంబాలు ఇప్పుడు పెట్టుబడి పెట్టి అవన్నీ అలాగే ఉండి అప్పుల కుప్పలతో చేతిలో చిల్లిగవ్వ లేక తిరిగి పోలేని దుస్థితిలో ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఖాళీగా కూర్చుంటే తిండికి కూడా డబ్బు లేదని వాపోతున్నారు.
ఒక కశ్మీర్ నుంచే 220 మందికి పైగా వ్యాపారులు, కళాకారులు ఇప్పటికే స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. వారి జీవితాలు ఇప్పుడు ఫణంగా మారాయని వారంతా వాపోతున్నారు. థియేటర్లు, మాల్స్ వంటివి తెరిచి నుమాయిష్ ను మూయడం ఎంత వరకూ కరెక్ట్ అని.. ఎగ్జిబిషన్ తిరిగి తెరవాలని వారు కోరుతున్నారు.
నుమాయిష్ కోసం వివిధ ప్రభుత్వ శాఖలకు సొసైటీ రూ.1.74 కోట్లు, వివిధ కాంట్రాక్టర్లకు అడ్వాన్స్ చెల్లింపులుగా మరో రూ.80 లక్షలు చెల్లించినట్లు తెలిపారు. ఇప్పుడు అవి కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొందని..నిండా మునిగామని సొసైటీ నిర్వాహకులు వాపోతున్నారు. రుణాలు తీసుకున్నామని.. ఈఎంఐ చెల్లింపులు ఉన్నాయని.. ఎగ్జి బిషన్ జరగకపోతే చావే శరణ్యం అని వ్యాపారులు సొసైటీ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సొసైటీ డేటా ప్రకారం, మొత్తం 1600 స్టాల్స్ దేశంలోని కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ వచ్చిన వ్యాపారులకు కేటాయించబడ్డాయి, అయితే ఇప్పటి వరకు 800 మాత్రమే స్వాధీనం చేసుకోబడ్డాయి. వాటిలో 200 మాత్రమే కార్యకలాపాలు ప్రారంభించాయి. “నుమాయిష్ జరగాలని మేము కోరుకుంటున్నాము. మేము పని గంటలను పరిమితం చేయవచ్చు కానీ ప్రజలను పరిమితం చేయలేము. కాబట్టి సామాజిక.. ప్రవర్తనా క్రమశిక్షణతో ప్రజల్లో కొంత స్థాయి పరిపక్వత ఉంటే ఈ ఎగ్జిబిషన్ నిర్వహించగలమని అధికారులు చెబుతున్నారు.