Tata Tiago EV 2026: భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం Tata Motors తన అత్యంత చవకైన ఎలక్ట్రిక్ కారు Tata Tiago EV కొత్త ‘స్మార్ట్’ వేరియంట్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) పథకం కింద ఈ కారు ప్రారంభ ధర రూ.4.69 లక్షల (ఎక్స్‌షోరూమ్) నుంచి అందుబాటులోకి వచ్చింది. దీంతో దేశంలో అత్యంత అందుబాటు ధరలో లభించే ఎలక్ట్రిక్ కార్లలో ఇది ఒకటిగా నిలిచింది. ఈ కారు గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ప్రస్తుత కాలంలో ఎలక్ట్రిక్ కార్లు కొనేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో కొన్ని కంపెనీలు తక్కువ ధరకే విద్యుత్ కార్లను అందించాలని అనుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో టాటా మోటార్స్ నుంచి టియాగో ఫేస్ లిప్ట్ ఈవీని తీసుకొచ్చారు. ఈ కొత్త టియాగో EV స్మార్ట్ వేరియంట్లో భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఎంట్రీ-లెవల్ వేరియంట్ అయినప్పటికీ ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లను ఉంచడంతో స్టాండర్డ్‌గా అందిస్తోంది. సాధారణంగా ఈ ఫీచర్ అధిక ధర కలిగిన కార్లలో మాత్రమే కనిపిస్తుంది. దీంతో తక్కువ బడ్జెట్లో ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి ఇది ఆకర్షణీయమైన ఎంపికగా మారింది.
టియాగో EV స్మార్ట్ వేరియంట్లో 19.2 kWh బ్యాటరీ ప్యాక్‌ను అందించారు. ఈ బ్యాటరీతో పనిచేసే ఎలక్ట్రిక్ మోటార్ 60 bhp శక్తి, 110 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 226 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ ప్రకటించింది. రోజువారీ నగర ప్రయాణాలకు ఈ రేంజ్ సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
2026 టియాగో EVకు టాటా కొత్త రూపాన్ని ఇచ్చింది. కొత్త ఫ్రంట్ బంపర్, బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్, LED హెడ్‌ల్యాంప్స్, LED టెయిల్‌ల్యాంప్స్, కొత్త వీల్ డిజైన్‌తో మరింత ఆధునికంగా కనిపిస్తోంది. బయట నుంచి చూస్తే ఇది ప్రీమియం ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లా అనిపించేలా డిజైన్ చేశారు. క్యాబిన్లో కూడా గణనీయమైన మార్పులు చేశారు. కొత్త డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, రీడిజైన్ చేసిన డ్యాష్‌బోర్డ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. హయ్యర్ వేరియంట్లలో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా వంటి అదనపు సదుపాయాలు కూడా లభిస్తాయి.
ఈ కారు తక్కువ ధరలో లభించడానికి ప్రధాన కారణం బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్ (BaaS) విధానం. ఇందులో కారు ధర నుంచి బ్యాటరీ ఖర్చును వేరు చేస్తారు. కస్టమర్ కారు కోసం తక్కువ మొత్తాన్ని చెల్లించి, బ్యాటరీ వినియోగానికి ప్రత్యేకంగా చెల్లించాల్సి ఉంటుంది. పూర్తి బ్యాటరీతో కొనుగోలు చేయాలనుకునేవారికి టియాగో EV స్మార్ట్ ధర రూ.6.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.
రోజూ నగరంలో ప్రయాణించే ఉద్యోగులు, మొదటిసారి ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునేవారు, తక్కువ బడ్జెట్లో సురక్షితమైన EV కోరుకునే కుటుంబాలకు టాటా టియాగో EV స్మార్ట్ మంచి ఎంపికగా భావిస్తున్నారు. తక్కువ ప్రారంభ ధర, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, సరిపడే రేంజ్, ఆధునిక ఫీచర్ల కలయికతో ఈ కారు భారత EV మార్కెట్లో కొత్త పోటీకి తెరలేపనుంది.
