Tata Sierra EV: భారతీయ ఆటోమోబైల్ రంగంలో Tata Motors సరికొత్త విప్లవానికి తెరతీస్తూ ఉంటుంది. ఇందులో భాగంగా 90ల కాలంలో యువతను ఎంతగానో ఆకట్టుకున్న లెజెండరీ కారు ‘సియెర్రా’ ను మళ్లీ మన ముందుకు తీసుకురాబోతోంది. అయితే, ఈసారి దీనిని సాంప్రదాయ ఇంధన ఇంజిన్‌తో కాకుండా సరికొత్త ఎలక్ట్రిక్ రూపంలో టాటా సియెర్రా ఈవీ (Tata Sierra EV) గా రూపాంతరం చెందించింది. ఈ కారును అధికారికంగా జూన్ 30, 2026 న ముంబై వేదికగా ప్రపంచానికి పరిచయం చేయనున్నట్లు ప్రకటించింది. పాత జ్ఞాపకాలను గుర్తుచేస్తూనే నయా జెనరేషన్ టెక్నాలజీతో రాబోతున్న ఈ కారు విశేషాల్లోకి వెళితె..
ఒరిజినల్ సియెర్రా కారులో అందరినీ ఆకట్టుకున్న ప్రత్యేకమైన బాక్సీ డిజైన్, వెనుక భాగంలో ఉండే పెద్ద ‘ఆల్పైన్ విండో’ గ్లాస్ రూఫ్‌ను ఈ సరికొత్త ఈవీ మోడల్‌లోనూ టాటా కొనసాగించింది. కాకపోతే, దీనికి ఫ్యూచరిస్టిక్ టచ్ ఇస్తూ ముందు భాగంలో ఎండ్-టు-ఎండ్ కనెక్టెడ్ LED DRL లైట్లు, బంపర్ కింద అమర్చిన మెయిన్ హెడ్‌ల్యాంప్‌లు, ఎలక్ట్రిక్ వాహనాలకు ఉండేలా క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్‌ను అందించారు. దీనితో పాటు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, 19 అంగుళాల ఏరో ఆప్టిమైజ్డ్ అలాయ్ వీల్స్ ఈ ఎస్‌యూవీ కి మరింత స్పోర్టీ లుక్‌ను తీసుకువచ్చాయి.
టాటా సియెర్రా ఈవీని కంపెనీ సరికొత్త Acti.ev ప్లస్ ఆర్కిటెక్చర్‌పై నిర్మించింది. ఇది 65 kWhతో పాటు 75 kWh సామర్థ్యం గల రెండు పెద్ద బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో రానుంది. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 500 నుండి 600 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని అంచనా. అంతేకాకుండా, ఈ విభాగంలోనే మొదటిసారిగా దీని టాప్ వేరియంట్లలో QWD డ్యూయల్-మోటార్ ఆల్-వీల్ డ్రైవ్ సాంకేతికతను ఇస్తున్నారు.
ఈ కారు క్యాబిన్ లోపలికి అడుగుపెడితే ఒక సరికొత్త లగ్జరీ ప్రపంచం కనిపిస్తుంది. ఐవరీ మరియు టాన్ కలర్ కాంబినేషన్‌లో ప్రీమియం డ్యూయల్-టోన్ లెథరెట్ సీట్లను ఇందులో అందించారు. డ్యాష్‌బోర్డ్‌పై ప్రధాన ఆకర్షణగా ట్రిపుల్-స్క్రీన్ సెటప్ ఉంటుంది. ఇందులో డ్రైవర్ డిస్‌ప్లే, మెయిన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో పాటు సహ-ప్రయాణికుడి కోసం ప్రత్యేకంగా మరో స్క్రీన్‌ను అమర్చారు.
ప్రయాణికుల భద్రత, సౌకర్యం కోసం ఇందులో లెవెల్-2 ADAS , 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, 12-స్పీకర్ల JBL ఆడియో సిస్టమ్, మరియు వెంటిలేటెడ్ సీట్లను ఉంచారు. మార్కెట్లో దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 20 లక్షల నుండి రూ. 25 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. జూలై 2026 నాటికి రోడ్లపైకి రానున్న ఈ సియెర్రా ఈవీ.. హ్యుందాయ్ క్రెటా ఈవీ, మహీంద్రా BE 6 మరియు మారుతి సుజుకి ఇ-విటారాలకు గట్టి పోటీ ఇవ్వనుంది.
