Tata Nano EV : కొత్త ఏడాదిలో కొత్త వస్తువులు కొనుగోలు చేయాలని చాలా మంది అనుకుంటారు. ముఖ్యంగా కొత్తగా కారు కొనాలనుకునేవారు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. కంపెనీలు సైతం కొత్త సంవత్సరంలో ప్రణాళిక ప్రకారంగా కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడంతా ఎలక్ట్రిక్ మయం అవుతోంది. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో విద్యుత్ కార్లను కొనుగోలు చేయడానికి వినియోగదారులు రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లోకి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. దేశంలో అతిపెద్ద కార్ల కంపెనీల్లో టాటా కంపెనీ ఒకటి. టాటా కంపెనీ అనగానే అతి తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చిన నానో కారు గుర్తుకు వస్తుంది. కానీ ఇది అంతలా ఆకట్టుకోలేదు. అయితే ఈసారి ఎలక్ట్రిక్ వేరియంట్ లో టాటా నుంచి కొత్త కారు రాబోతుంది. ఇది సక్సెస్ కావడానికి పకడ్బందీ ప్లాన్ వేస్తున్నారు. ఈ ఏడాదిలో ఇది ఎప్పుడు రిలీజ్ అంటే?
దేశంలో ఇప్పటికే చాలా వరకు ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్లోకి వచ్చాయి. అయితే కొన్ని కార్లు ప్రీమియం ధరలను కలిగి ఉన్నాయి. దీంతో సామాన్యులు ఈవీలు కొనాలంటే ఆసక్తి చూపడం లేదు. టాటా కంపెనీ అతి తక్కువకే ఈవీని అందించేందుకు రెడీ అవుతోంది. ‘టాటా నానో’ పేరుతో మార్కెట్లోకి వస్తున్న ఈ కారు గురించిన వివరాలు ఇప్పటికే అందించారు. అయితే ఇది ఇప్పుడు మార్కెట్లోకి వస్తుందా? అని వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే మిగతా ఎలక్ట్రిక్ కార్ల కంటే టాటా నానో కారు అతి తక్కువ ధరలో అందించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
సామాన్యుడు సైతం సొంతంగా కారు ఉండాలనే ఉద్దేశంతో గతంలో టాటా కంపెనీ నుంచి నానో కారును అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ ఇది అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఎలక్ట్రిక్ కారును వినియోగదారులను ఆకట్టుకునేవిధంగా తీర్చిదిద్దారు. టాటా కొత్త నానో కారులో 17 కిలో వాట్ బ్యాటరీని అమర్చారు. దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 400 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వనుంది. ఇందులో సేప్టీ కోసం డ్యూయెల్ ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ సిస్టమ్, వంటివి ఉన్నాయి.
గతంలో టాటా నానో కారును లక్ష రూపాయలకే అందించి సంచలనం సృష్టించారు. అయితే కొత్త నానో మాత్రం రూ.2.5 లక్షలకు విక్రయించనున్నట్లు సమాచారం. దీని టాప్ ఎండ్ వేరియంట్ రూ.7 లక్షల నుంచి 8 లక్షల వరకు విక్రయించే అవకాశం కనిపిస్తోంది. టాటా కొత్త నానో ధర తక్కువగా ఉన్న ఇప్పుడు మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ వేరియంట్లకు సమానంగా ఫీచర్లు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న చర్చ సాగుతోంది. దీంతో కొత్తగా ఎలక్ట్రిక్ కారు కొనాలని అనుకునేవారు కొత్త నానోవైపు ఎంత మంది వెళ్తారో చూడాలి. మరి ఈ కారు ఈ ఏడాదిలో వస్తుందా? లేదా? అనే సందేహాలు నెలకొన్నాయి. కంపెనీకి చెందిన కొన్ని వర్గాలు చెబుతున్న ప్రకారం.. ఈ ఏడాదిలో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటారు.