https://oktelugu.com/

Tata Group : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఐదు లక్షల ఉద్యోగాలకు టాటా గ్రూప్ గ్రీన్ సిగ్నల్

టాటా గ్రూప్ తన ఐదు సంవత్సరాల వ్యూహాన్ని నిర్ణయించుకుంది. దీని కింద టాటా గ్రూప్ తయారీ రంగంలో దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించనుంది.

Written By:
  • Mahi
  • , Updated On : October 15, 2024 / 08:00 PM IST

    Tata Group

    Follow us on

    Tata Group : భారత పారిశ్రామిక దిగ్గజాలలో ఒకరైన రతన్ టాటా (86) కన్నుమూశారు. ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గత బుధవారం తుదిశ్వాస విడిచారు. రతన్ టాటా మరణాన్ని ధృవీకరిస్తూ టాటా గ్రూప్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఓ ప్రకటన విడుదల చేశారు. అక్టోబరు 7న రతన్ టాటా తాను సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్తున్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. అయితే ఐసీయూలో చికిత్స పొందుతూ అక్టోబర్ 9న తుదిశ్వాస విడిచారు. ఆయన దేశం కోసం ఎంతో కృషి చేశారు. అభివృద్ధి చెందిన భారత్ చూడాలని ఎన్నో కలలు కన్నారు. తన కంపెనీల్లో ఎన్నో లక్షల మందికి జీవనోపాధిని కల్పించారు. ఆయన వెళ్లిన తర్వాత కూడా తన కంపెనీ మళ్లీ కొన్ని లక్షల మందికి ఉద్యోగావశాలు కల్పించనుంది. ఈ క్రమంలోనే టాటా గ్రూప్ తన ఐదు సంవత్సరాల వ్యూహాన్ని నిర్ణయించుకుంది. దీని కింద టాటా గ్రూప్ తయారీ రంగంలో దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించనుంది. దేశంలో తయారీ రంగం 7.4 శాతం వృద్ధిని నమోదు చేస్తోందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు. ఇందులో దాదాపు 13 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయబడ్డాయి. సెమీకండక్టర్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలు, సంబంధిత పరిశ్రమల్లో దాదాపు ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించాలని టాటా గ్రూప్ నిర్ణయించింది.

    అభివృద్ధి చెందిన భారత్ కల సాకారం
    టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ మంగళవారం ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలని కలలు కంటున్నామని అన్నారు. దీన్ని సాధించడంలో తయారీ రంగం కీలక పాత్ర పోషించనుంది. ఈ రంగంలో ఉద్యోగాలు కల్పించకుండా అభివృద్ధి చెందిన భారతదేశ లక్ష్యాన్ని సాధించలేమన్నారు. ప్రతి నెలా దాదాపు 10 లక్షల మంది భారతదేశ శ్రామిక శక్తిలో భాగమవుతున్నారు. అందువల్ల, దేశ భవిష్యత్తు కోసం మనం మరింత ఎక్కువ ఉద్యోగాలను సృష్టించాలి.

    సెమీకండక్టర్‌లో పెట్టుబడులు పెడుతున్న టాటా గ్రూప్
    సెమీకండక్టర్ రంగంలో టాటా గ్రూప్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. దీనికి సంబంధించిన ఇతర రంగాల్లో కూడా పెట్టుబడులు పెంచుతామన్నారు. వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించడమే మా లక్ష్యమన్నారు. టాటా గ్రూప్ అస్సాంలో పెద్ద సెమీకండక్టర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. ఇది కాకుండా, ఈవీ బ్యాటరీ తయారీలో కూడా పని చేస్తున్నామని చంద్రశేఖరన్ తెలిపారు. ప్రస్తుతం, రాబోయే ఐదు సంవత్సరాల ప్రణాళికను ఖరారు చేసే పని జరుగుతోందన్నారు. దాని వివరాలు తరువాత చెబుతామని చంద్రశేఖరన్ అన్నారు. అయితే, మరిన్ని ఉద్యోగాల కల్పనపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, తయారీ రంగంలో దాదాపు 5 లక్షల ఎస్ ఎంఈలు కూడా సృష్టించబడతాయని చెప్పారు.

    10 కోట్ల ఉద్యోగాలు
    10 కోట్ల ఉద్యోగాలు కల్పించాల్సి ఉందని ఎన్ చంద్రశేఖరన్ అన్నారు. మనం ఐదు లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టిస్తే, వారి సహాయంతో అనేక రెట్లు పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయి. నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ (NSO) నివేదిక ప్రకారం.. 2022 ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగంలో 11 లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. ఇది 2023 ఆర్థిక సంవత్సరంలో 13 లక్షలకు పెరిగింది. తయారీ రంగంలో అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. దీని తర్వాత గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్‌లు ఉన్నాయి.