https://oktelugu.com/

Swiggy CEO Sriharsha Majety: “వాయు” ఆరంభం తర్వాత “స్విగ్గి” అధినేత కీలక వ్యాఖ్యలు

వాస్తవానికి స్విగ్గి సంస్థను ప్రారంభించి 9 సంవత్సరాలు అవుతోంది. మొదట్లో ఈ కంపెనీ వినియోగదారులకు మంచి డిస్కౌంట్లు ప్రకటించినప్పటికీ.. తర్వాత తర్వాత తన ధోరణి మార్చుకుంది.

Written By:
  • Rocky
  • , Updated On : May 19, 2023 / 05:32 PM IST

    Swiggy CEO Sriharsha Majety

    Follow us on

    Swiggy CEO Sriharsha Majety: మొన్ననే మనం చెప్పుకున్నాం కదా.. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి, మరికొందరి ఆధ్వర్యంలో తెరపైకి వచ్చిన “వాయు” యాప్ గేమ్ చేంజర్ కాబోతోంది అని.. అది జొమాటో, స్విగ్గిని దెబ్బకొట్టబోతోంది అని.. అన్నట్టుగానే మెట్రో నగరాల్లో ఐదు శాతం వాటాను కైవసం చేసుకుంది. ఇన్ని రోజులపాటు డిస్కౌంట్ల పేరుతో వినియోగదారులను బురిడీ కొట్టించిన బడా బడా సంస్థలను కూడా అది పక్కకి నెట్టేసింది. ఈ నేపథ్యంలో తన కిందికి నీళ్లు రాకముందే స్విగ్గి జాగ్రత్త పడింది.. అంతేకాకుండా కనీ విని ఎరుగని స్థాయిలో ఆఫర్లను ప్రకటించింది. సంస్థ పుట్టి మునగకముందే దాని అధిపతి రంగంలోకి దిగాడు.

    మాకు తిరుగులేదు

    వాయు యాప్ చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలో స్విగ్గి అధినేత మాజేటి శ్రీహర్ష రంగంలోకి దిగాడు. మెట్రో నగరంలోని షైన్ హోటల్స్ తో సంప్రదింపులు జరుపుతున్నాడు. గతంలో ఉన్న ఒప్పందాలను మరొక్కసారి పున: సమీక్షించుకుని కొత్త తరహా ఆఫర్లు ప్రకటించేందుకు సిద్ధమయ్యాడు. అయితే ఇన్ని రోజులు కంపెనీ బ్యాలెన్స్ షీట్ విషయంలో లాభాలు చూపించని ఆయన.. ఇప్పుడు మాత్రం కంపెనీ లాభాల్లోకి వచ్చిందని ప్రకటించడం విశేషం.” కంపెనీ ఏర్పాటైన 9 సంవత్సరాల తర్వాత లాభాలు సాధించాం. అంతర్జాతీయంగా ఈ ఘనత సాధించిన కంపెనీలలో స్విగ్గి కూడా ఒకటిగా ఉంది. ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్లకు వెళ్లి తినడం పట్ల నేను బుల్లీష్ గా ఉన్నాను”అని శ్రీహర్ష మాజేటి తన బ్లాగ్ పోస్ట్ లో పేర్కొనడం విశేషం. అంతే కాదు ఈ వ్యాపారంలో మాకు తిరుగులేదని శ్రీహర్ష ప్రకటించడం విశేషం.

    పోటీ సంస్థ రాగానే మారిన స్వరం

    వాస్తవానికి స్విగ్గి సంస్థను ప్రారంభించి 9 సంవత్సరాలు అవుతోంది. మొదట్లో ఈ కంపెనీ వినియోగదారులకు మంచి డిస్కౌంట్లు ప్రకటించినప్పటికీ.. తర్వాత తర్వాత తన ధోరణి మార్చుకుంది. అయితే ఈ సంస్థ రెస్టారెంట్లతో ఒప్పందం కుదుర్చుకుని వినియోగదారులకు తక్కువ మొత్తంలో ఆహారం సరఫరా చేస్తోందని ఆరోపణలు ఉన్నాయి. మరొక సంస్థ జోమాటో కూడా ఇలానే వ్యవహరించడంతో వీటికి పోటీ సంస్థ లేక ఆడింది ఆట పాడింది పాటగా మారింది. అయితే ఇప్పుడు “వాయు” యాప్ తెరపైకి రావడంతో వ్యాపారం కిందకు నీళ్లు వస్తాయని భావించి స్విగ్గి సంస్థ మేల్కొంది. ఇన్నాళ్లపాటు మౌనంగా ఉన్న ఆ సంస్థ సీఈవో శ్రీహర్ష బ్లాగ్ స్పాట్లో స్పందించారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ” వచ్చే రెండు దశాబ్దాల కాలం నాటికి సామర్థ్యాల పట్ల స్విగ్గి ఎంతో ఆశావాహంగా ఉంది. ఫుడ్ డెలివరీ లో ఇక ముందు మేము వృద్ధిని సాగిస్తాం.. కొత్త కొత్త ఆవిష్కరణల వైపు అడుగులు వేస్తాం.. ఇంకా మేము సాధించాల్సిన మైలురాళ్లు చాలా ఉన్నాయి. 2023 మార్చినాటికి స్విగ్గి ఫుడ్ డెలివరీ వ్యాపారం లాభదాయకంగా మారింది” అని శ్రీ హర్ష బ్లాగ్ స్పాట్లో రాసుకొచ్చారు.

    అయితే మార్చిలో లాభాలు వస్తే మే నెలలో దానిని శ్రీహర్ష బ్లాగ్ స్పాట్ లో రాసుకురావడం విశేషం.. అంతేకాదు సంస్థ లాభాల్లో ఉందని చెబుతూనే.. చాలా వరకు ఉద్యోగాల్లో కోతలు విధించడం గమనార్హం.. ఒకటి మాత్రం సుస్పష్టం. ఫుడ్ డెలివరీ అనేది తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందించే వ్యాపారం.. అయితే ఇందులో జొమాటో పాతుకుపోగా.. ఆలస్యంగా వచ్చినప్పటికీ స్విగ్గి కూడా బలమైన సంస్థగా రూపుదిద్దుకుంది. అయితే మెజారిటీ మార్కెట్ వాటాను ఈ రెండు సంస్థలు సొంతం చేసుకున్నాయి.. అయితే ఇందులోకి ఇప్పుడు వాయు అప్ ఎంటర్ కావడంతో సీన్ మొత్తం మారింది.. ప్రస్తుతానికయితే స్విగ్గి అధినేత మాత్రమే తెరపైకి వచ్చి తన కంపెనీ వివరాలు చెప్పాడు. రేపో మాపో జొమాటో అధిపతి కూడా ఇలానే తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి.. ఒకటి మాత్రం సుస్పష్టం. ఏ రంగంలో అయినా పోటీ అనేది ఉండాలి.. పోటీ అనేది లేకుంటే ఏ వ్యవస్థ అంత పారదర్శకంగా పనిచేయదు. ఇందుకు స్విగ్గి, జొమాటో మినహాయింపు కాదు.