SBI Amazing Scheme: భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఒక కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీని ద్వారా బ్యాంక్‌కు ఏకంగా రూ.25,000 కోట్ల నిధులు లభించనున్నాయి. ఈ పథకం పేరు క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్(క్యూఐపీ). దీని కింద బ్యాంకు అర్హత ఉన్న ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించనుంది. ఇది బ్యాంక్ ఆర్థిక స్థితిని మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్(క్యూఐపీ) ద్వారా ఎస్బీఐ రూ.811.05 కనీస ధరతో అర్హత ఉన్న సంస్థాగత పెట్టుబడిదారులకు ఈక్విటీ షేర్లను జారీ చేయడానికి తన బోర్డులో ఆమోదం పొందింది. ఈ ధర, ఎన్‌ఎస్‌ఈలో షేర్ ముగింపు ధర కంటే 2.3శాతం తక్కువగా ఉంది.
మే నెలలో బ్యాంక్ బోర్డు క్యూఐపీ, ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్(FPO) లేదా ఇతర మార్గాల ద్వారా ఆర్థిక సంవత్సరం 2025-26లో రూ.25,000 కోట్లను సమీకరించడానికి అనుమతిని అందించింది. ఈ మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా సేకరించనుంది. ఇదే కాకుండా, ఎస్బీఐ మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. బ్యాంక్ బోర్డు బాండ్ల ద్వారా రూ.20,000 కోట్ల నిధులు సేకరించడానికి ఆమోదం తెలిపింది. ఈ బాండ్లను దేశీయ పెట్టుబడిదారులకు జారీ చేస్తారు. ఈ నిధులు బ్యాంక్ అవసరాలను తీర్చడానికి ఉపయోగపడతాయి. ఇది బ్యాంక్ కార్యకలాపాలను విస్తరించడానికి, బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది.
ఈ ప్రకటనల ప్రభావం ఎస్బీఐ షేర్ల మీద స్పష్టంగా కనిపించింది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో ఎస్బీఐ షేర్లు దాదాపు 2శాతం మేర పెరిగి రూ.831.55 వద్ద ముగిశాయి. ట్రేడింగ్ సమయంలో షేర్ ధర రూ.834 గరిష్ట స్థాయికి కూడా చేరుకుంది. ప్రస్తుతం ఎస్బీఐ మార్కెట్ క్యాప్ రూ.7,42,126.78 కోట్లుగా ఉంది, ఇది దేశంలో టాప్ 10 విలువైన కంపెనీలలో ఒకటిగా నిలిచింది. బ్యాంక్ తీసుకున్న ఈ నిధుల సమీకరణ నిర్ణయాలు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని మరింత పెంచాయి. దాని ఫలితంగా షేర్ ధరలు అమాంతం పెరిగాయి.