Royal Enfield : మనదేశంలో అందరినీ ఆకట్టుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మన పొరుగు దేశాన్ని కూడా తనవైపు తిప్పుకుంది. నేపాల్‌లో విడుదలైన ఈ ఐకానిక్ బైక్ అక్కడి మార్కెట్‌లో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్‌ను ఇకపై నేపాల్‌లో కూడా విక్రయించనున్నారు. ఇటీవల కంపెనీ ఈ బైక్‌ను నేపాల్‌లో విడుదల చేసింది. కంపెనీ ఈ బైక్‌ను నేపాల్‌కు CKD (కంప్లీట్లీ నాక్డ్ డౌన్) విధానం ద్వారా పంపనుంది. అంటే, విడిభాగాలుగా పంపి అక్కడ అసెంబ్లీ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఈ బైక్ తన స్ట్రాంగ్ డిజైన్, అద్భుతమైన పర్ఫామెన్స్ తో వినియోగదారులను ఆకట్టుకుంది.
Also Read : హోండా దూకుడు: యమహాకు పోటీగా సరికొత్త స్కూటర్!
నేపాల్‌లో ఈ బైక్ 5 వేర్వేరు వేరియంట్‌లు, 7 కలర్ ఆప్షన్లలో విక్రయానికి ఉంది. హెరిటేజ్, ప్రీమియం, సిగ్నల్స్, క్లాసిక్ డార్క్, క్రోమ్ వంటి ఆఫ్షన్లు ఇందులో ఉన్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. నేపాల్‌లో ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర 5,55,000 నేపాలి రూపాయల నుండి 5,79,900 నేపాలి రూపాయల వరకు ఉంటుంది.
నేపాల్‌లోని కంప్లీట్లీ నాక్డ్ డౌన్ (CKD) అసెంబ్లీ ప్లాంట్, భారతదేశం వెలుపల రాయల్ ఎన్‌ఫీల్డ్ ఐదవ అసెంబ్లీ ప్లాంట్. మోటార్‌సైకిల్ తయారీదారు నేపాల్‌లో త్రివేణి గ్రూప్‌తో చేతులు కలిపింది. SAARC ప్రాంతంలో తమ ఉనికిని గణనీయంగా పెంచుకోవడమే దీని లక్ష్యం. కొత్త CKD ప్లాంట్ నేపాల్‌లోని బీర్‌గంజ్‌లో ఉంది. ఇది ఇప్పటికే బ్రెజిల్, థాయ్‌లాండ్, కొలంబియా, అర్జెంటీనాలో ఉన్న ఇతర ప్లాంట్‌లలో చేరింది.
భారతదేశంలో క్లాసిక్ 350 ధర
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ఒక క్రూజర్ బైక్. ఇది భారతదేశంలో 7 వేరియంట్‌లు, 11 రంగులలో లభిస్తుంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350లో 349 cc BS6 ఇంజన్ ఉంది. ఇది 20.2 bhp శక్తిని, 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లతో పాటు రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 యాంటీ-లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ క్లాసిక్ 350 బైక్ బరువు 195 కిలోగ్రాములు, దీని ఫ్యూయోల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు. భారతదేశంలో ఈ బైక్ ధర రూ.1,93,500 ఎక్స్-షోరూమ్ నుండి ప్రారంభమై రూ.2,30,000 ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. క్లాసిక్ 350 జావా 350, హోండా Hness CB350తో పోటీపడుతుంది. ఈ బైక్ లీటరుకు 20-30 కిమీల మైలేజీని ఇస్తుంది.
Also Read : టీసీఎస్‌పై వివక్ష ఆరోపణలు.. అమెరికా ఉద్యోగుల ఫిర్యాదుతో దర్యాప్తు