Reliance Lay Offs: ముకేశ్ అంబానీ.. మనదేశంలో ఆగర్భ శ్రీమంతుడు. అతిపెద్ద ధనవంతుడు.. భారత్ నుంచి ఇంగ్లాండ్ దాకా అతడికి ఆస్తులున్నాయి.. లక్షల కోట్ల సిరిసంపదలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి తన కొడుకు పెళ్లిని 1,500 కోట్లు ఖర్చుపెట్టి చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా అతిరథ మహారధులందరినీ పిలిపించాడు. అదిరిపోయే రేంజిలో ఆతిథ్యం ఇచ్చాడు. అయితే అలాంటి ముకేశ్ అంబానీ.. ఉద్యోగుల విషయంలో మాత్రం ఆ స్థాయి ఉదారత చూపించడు. కొసరి కొసరి వడ్డించినట్టు ప్రేమను ప్రదర్శించడు. తన దాకా వస్తే మెడపట్టి బయటికి గెంటేస్తాడు. ఎందుకంటే రిలయన్స్ లో జరుగుతున్న తాజా ఉదంతం పై ఆరోపణలకు బలం చేకూర్చుతోంది.. ఇంతకీ ముకేశ్ అంబానీ అంత త్వరగా.. ఇంతటి కఠిన నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటే..
ముంచుకొస్తోంది
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొంది. ఫలితంగా పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొనుగోళ్లు పడిపోవడంతో చాలా కంపెనీలు ఉత్పత్తులను తగ్గిస్తున్నాయి. అది అంతిమంగా ఆ కంపెనీల ఆధారంగా పనిచేసే ఉద్యోగులపై పడుతోంది. మన దేశంలోనే రిలయన్స్ కూడా ఇదే నిర్ణయం తీసుకుంది. రిలయన్స్ కంపెనీ ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో తన ఉద్యోగుల సంఖ్యను 40 రెండువేల వరకు తగ్గించుకుంది. వాస్తవానికి లే ఆప్స్ అమలు చేస్తున్నామని రిలయన్స్ ప్రకటించలేదు. మిమ్మల్ని తొలగిస్తున్నామని ఉద్యోగులకు చెప్పను కూడా చెప్పలేదు. కేవలం సర్వసాధారణమైన విధానంలోనే ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తి చేసింది. రిలయన్స్ కంపెనీకి 2023 -24 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో 3.89 లక్షల మంది ఉద్యోగులు ఉండేవారు. అయితే ప్రస్తుతం వారి సంఖ్య 3.47 లక్షలకు చేరుకుంది. అయితే ఇందులో ఉన్న 42 వేల మంది ఉద్యోగులు వారి కొలువులు పోగొట్టుకున్నారు. మరో మాటకు తావు లేకుండా ముకేశ్ అంబానీ వారందరినీ ఇంటికి పంపించేశారు.
సాధారణంగా పలు రంగాలలో విస్తరించి ఉన్న రిలయన్స్.. తన ఉద్యోగులను తొలగించడానికి ఒప్పుకోదు. పైగా కొత్త కొత్త వ్యాపారాల్లోకి రిలయన్స్ అడుగుపెడుతోంది. ఈ క్రమంలో ఆ కంపెనీకి కొత్త వర్క్ ఫోర్స్ చాలా ముఖ్యం. ఇలాంటి సమయంలో వర్క్ ఫోర్స్ ను రిలయన్స్ తగ్గించుకోవడం వెనుక ప్రధాన కారణం ఆర్థిక మాంద్యం అని తెలుస్తోంది. అయితే దీనివల్ల రిలయన్స్ ఆర్థిక లావాదేవీలు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయట. అందువల్లే యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నదట. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం, కొనుగోళ్లు ఊపందుకోవడం వంటివి మాత్రమే ఆర్థిక మాంద్యాన్ని నివారిస్తాయని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే అప్పటిదాకా ఆ తొలగించిన ఉద్యోగులు.. తిరిగి రిలయన్స్ లోకి రావడం దాదాపు అసాధ్యమే. అయితే ఇప్పట్లో ఆ పరిస్థితులు నెలకొనడం కష్టమే అనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లను అనేక పరిస్థితులు తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. అలాంటప్పుడు ఇప్పట్లో అవి కోలుకోవడం అంత సులభం కాదు.