Homeబిజినెస్Adani Group: క్విడ్ ప్రో కో కు అలవాటు పడిన రాజకీయ పార్టీలు.. అదానీ ని...

Adani Group: క్విడ్ ప్రో కో కు అలవాటు పడిన రాజకీయ పార్టీలు.. అదానీ ని విమర్శిస్తున్నాయి.. దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదే..

Adani Group: ఇక చిన్నాచితకా ప్రాంతీయ పార్టీలు తమ స్థాయికి మించి అదాని గ్రూప్ మీద ఆరోపణలు చేస్తున్నాయి. దొరికిందే సందు అనుకొని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఇక్కడ అదానీ గ్రూప్ గొప్పదని కాదు. శుద్ధ పూస అని చెప్పడం లేదు. కానీ మనదేశంలో ఏ రాజకీయ పార్టీ మాత్రం శుద్దపూస.. మొన్నటికి మొన్న ఎలక్టోరల్ బాండ్లను అదాని గ్రూప్ కొనుగోలు చేయలేదా.. ఆ డబ్బులను రాజకీయ పార్టీలు తీసుకోలేదా.. ఈ విషయాన్ని ఏ రాజకీయ పార్టీ ఒప్పుకోదు. ఇలా ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగుతుంది. కేంద్రం ఆ విధానాన్ని తెరపైకి తెచ్చింది కాబట్టి.. మేము అమలు చేశామని చెబుతుంది. అంతేతప్ప మేము అదాని గ్రూప్ నుంచి లంచాలు తీసుకోలేదని మాత్రం చెప్పదు. అదాని గ్రూప్ అని మాత్రమే కాదు, మనదేశంలో ఉన్న కార్పొరేట్ కంపెనీలు మొత్తం రాజకీయ పార్టీలకు ఏదో ఒక రూపంలో లంచాలు ఇచ్చినవే. అక్కడిదాకా ఎందుకు ప్రఖ్యాత వ్యాపారవేత్త జార్జ్ సోరోస్ కూడా మనదేశంలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఓ పార్టీ అధికారంలోకి రావడం కోసం భారీగా డబ్బులను ఎన్జీవోలు, ఇతర సంస్థలకు చేరవేశాడని ఆరోపణలు వినిపించాయి.

రాజకీయ పార్టీలు కీలక విషయాలను మర్చిపోతున్నాయి

వాస్తవానికి గౌతమ్ అదానీ గ్రూప్ పై నమోదైన అభియోగాల విషయంలో కొన్ని పార్టీలు కీలకమైన విషయాలను మర్చిపోతున్నాయి.. వాస్తవానికి అదానిని విచారించాల్సింది అమెరికాలో. ఎందుకంటే కేసు బుక్ అయింది అక్కడే కాబట్టి. అమెరికా ఎఫ్బీఐ ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నది. పైగా ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ వ్యవహారంలో ఉన్నారని అభియోగాలు మోపింది.. ఈ రాష్ట్రాలలో బిజెపి అధికారంలో లేదు. అందువల్ల వారంతా అదానీ గ్రూప్ తో క్విడ్ ప్రో కో విధానంలో లంచాలు తీసుకున్నట్టు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకటించింది. అభియోగాలు కూడా మోపింది. ఏకంగా అరెస్టుకు వారంట్ కూడా జారీ చేసింది. మరి అలాంటప్పుడు ఇందులో ఓ సెక్షన్ పార్టీలు చేస్తున్న ఆరోపణలకు అర్థం ఏముంది?!

సోషల్ మీడియాలో ఎదురుదాడితో తెల్ల మొహం

అదాని గ్రూప్ పై ఆరోపణ చేస్తున్న కొన్ని పార్టీలు.. సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టుల వల్ల తల వంపులకు గురవుతున్నాయి. గతంలో ఆ పార్టీల నాయకులు గౌతమ్ ఆదానితో చెట్టా పట్టాలు వేసుకొని తిరిగారు. గౌతమ్ ఆదాని గ్రూపుకు సంబంధించిన విమానాలలో తిరిగారు. గౌతమ్ అదానితో తమ రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టాలని ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రభుత్వపరంగా భూములు ఇచ్చారు. విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించారు. వంగి వంగి దండాలు పెట్టారు. అక్కడ దాకా ఎందుకు దావోస్ ప్రాంతంలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో గ్రూప్ ఫోటోలు కూడా దిగారు. అయితే ఇప్పుడు ఆ పార్టీలు అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్ష స్థానానికి పరిమితమయ్యాయి. అయితే అర్జెంటుగా ఆ పార్టీల నాయకులకు ఆదాని కంపెనీలలో ఆశ్రిత పక్షపాతం కనిపించింది. వెంటనే సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు మొదలుపెట్టారు. కానీ ఇదే సమయంలో కొంతమంది నెటిజన్లు.. నాడు ఆ పార్టీల నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఆదానితో దిగిన ఫోటోలను కౌంటర్ పోస్ట్ చేయడంతో.. తెల్ల మొహాలు వేస్తున్నారు. స్థూలంగా చెప్పాలంటే మన దేశంలో రాజకీయ పార్టీలు, కార్పొరేట్ కంపెనీలు సయామి కవలల లాంటివి. ఒకరితో మరొకరికి అవసరం ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు ఇలాంటి అవకతవకలు బయటపడినప్పుడే మీడియాలో కాస్త హడావిడి ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ యధాతధ స్థితి కొనసాగుతుంది. గతంలో హిండెన్ బర్గ్ అదాని గ్రూప్ సంస్థలపై సంచలన నివేదిక వెలువరించింది.. ఆ తర్వాత ఆ హిండెన్ బర్గ్ స్థాయి ఏమిటో అందరికీ తెలిసిపోయింది. ఆ ఉదంతం తర్వాత అదానీ గ్రూప్ అంబుజా సిమెంట్, ఇతర సిమెంట్ కంపెనీలను కొనుగోలు చేసింది. దేశంలోనే అతిపెద్ద సిమెంట్ తయారీదారుగా అవతరించింది. ఎన్డిటీవీలో వాటాలు కొనుగోలు చేసింది. తన వ్యాపారాలను మరింత విస్తరించింది. ఇంకా చెప్పాలంటే.. ఇలాంటి అభియోగాలు ఎదురైనప్పుడు కంపెనీల అధిపతులకు రూపాయి కూడా నష్టం రాదు. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కొనుగోలు చేసేది వారు కాదు కాబట్టి. అర్థం చేసుకున్న వాళ్లకు అర్ధమైనంత.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular