Real Estate: హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కాస్త నెమ్మదించినట్లుగా అర్థం అవుతోంది. కారణాలు ఏవైనా చాలా వరకు ప్రాజెక్టులు సైతం పెండింగులో ఉన్నట్లు తెలుస్తోంది. చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా కొన్ని ప్రాజెక్టుల నిర్మాణంలో వేగం తగ్గించినట్లుగా పరిస్థితిని చూస్తుంటే అర్థం చేసుకోవచ్చు. అనుకున్నంత ఫాస్ట్‌గా పనులు జరగడం లేదు. అయితే.. దీనికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా మనీ రొటేషన్ అయ్యే పరిస్థితులు ప్రతికూలంగా మారడమే కారణం అని చాలా మంది అంచనాకు వచ్చారు.
ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచక ముందు హైదరాబాద్‌లో ఇళ్లకు చాలా వరకు డిమాండ్ ఉండేది. పెద్ద సంఖ్యలో బుక్సింగ్ కూడా అయ్యాయి. కానీ.. ద్రవ్యోల్బణం పేరుతో వడ్డీ రేట్లను 9 కన్నా పైస్థాయికి చేర్చడంతో చాలా మంది కొనుగోలు దారులు ఆస్తుల కొనుగోలుకు ముందుకు రావడం లేదు. దాంతో వేచి చూడడమే మంచిదని అనుకుంటున్నారు. దీనికితోడు హైడ్రా సైతం కాస్త సంకటంగా మారినట్లుగా ప్రచారం ఉంది. హైడ్రా పరిణామాలతో కూడా చాలా మంది ఆస్తులు కొనుగోలు చేసేందుకు భయపడుతున్నారన్న టాక్ ఉంది. గత నెలరోజులుగా పరిస్థితుల్లో కొద్దికొద్దిగా మార్పులు వస్తున్నాయని చెబుతున్నారు. కానీ.. వాస్తవ పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయనే అర్థం అవుతోంది. మునుపటి పరిస్థితులు రావాలన్నా.. మునుపటి డిమాండ్ చూడాలన్నా ఇంకా సమయం పడుతుందని రియల్ ఎస్టేట్ రంగం నిపుణులు అంచనా వేస్తున్నారు. రియల్ రంగం ఊపందుకుందని, ఏ మాత్రం తగ్గలేదని ప్రభుత్వం చెబుతూ వస్తోంది. అయితే.. రిజిస్ట్రేషన్లు జరుగుతున్న తీరును బట్టి చూస్తుంటే అది నిజమని అనిపిస్తున్నా.. వాస్తవ పరిస్థితులు ఆస్తులు కొనుగోలు చేసే వారి సంఖ్య మాత్రం తగ్గిందని తెలుస్తోంది. గతంలోనే కొనుగోలు చేసిన వారు ఇప్పుడు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారనే వాదన కూడా ఉంది.
చాలా కంపెనీలు కూడా ఇలా బుక్సింగ్ ద్వారా వచ్చే డబ్బుతోనే నిర్మాణ పనులు సాగిస్తుంటాయి. ఇప్పుడు అడ్వాన్సులు తగ్గింపోవడం.. ఇచ్చే వారే లేకపోవడంతో తమ నిర్మాణాలను పెండింగులో పెడుతున్నట్లు తెలుస్తోంది. అడ్వాన్సులు లేక నిర్మాణ పనులకు అవసరమైన నిధులు సమకూర్చడం కష్టతరంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులు సైతం అంత వేగంగా స్పందించి నిధులు సమకూర్చే పరిస్థితులు లేవు. ఇలా ఒకటి రెండు అని కాదు.. వందలాది సంస్థలు ఇదే దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. డిమాండ్ తగ్గడంతో లగ్జరీ ఇళ్ల నిర్మాణం భారంగా మారిందని పలువురు అంటున్నారు. మధ్యతరగతికి అందుబాటులో ఉండేలా ఏ సంస్థలు కూడా ఇళ్లను నిర్మించడం లేదు. అలా నిర్మించం ప్రారంభిస్తే అసలు సమస్యే వచ్చేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రూ.50 లక్షల నుంచి రూ.60 లక్షల లోపు ఇళ్లకు ఇప్పటికీ డిమాండ్ ఉంది. కానీ.. రియల్ కంపెనీలు మాత్రం కోటి రూపాయలకు పైగా విలువైన ఇళ్లు నిర్మి్తున్నారు. తక్కువ డిమాండుతో ఉన్న వాటిని నిర్మిస్తే క్యాష్ రొటేషన్ అవుతుండే అనేది పలువురు నిపుణులు అంటున్నారు. మొత్తానికి ఇప్పటికైనా రియల్ కంపెనీలు ఈ స్ట్రాటజీని ఫాలో అవుతాయా..? తమ బిజినెస్‌ను పెంచుకుంటాయా..? అనేది చూద్దాం. ఒకవేళ ఆ దిశగా ఆలోచించకుంటే ఈ సంక్షోభం ఇలా కొనసాగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.