Gold And Silver Prices: రోజురోజుకు రికార్డు స్థాయిలో ధరలు పెరిగిన బంగారం, వెండి ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ముఖ్యంగా శనివారం బులియన్ మార్కెట్ నుంచి వెండి ధరలు పడిపోయినట్లు వార్తలు రావడంతో ఇన్వెస్టర్లను షాక్‌కు గురిచేశాయి. కేజీ సిల్వర్ రేటు శనివారం ఒక్కరోజే భారీగా రూ.55వేలు పడిపోగా, ప్రస్తుతం రూ.3,50,000 స్థాయికి చేరింది. కేవలం రెండు రోజుల్లోనే వెండి ధరలు మొత్తం రూ.75వేల వరకు తగ్గడం గమనార్హం. ఇటీవలి రోజుల్లో ఆకాశాన్ని తాకిన ధరల కారణంగా కొనుగోలుదారులు వెనుకంజ వేయగా, ఇప్పుడు ఈ భారీ పతనంతో సామాన్యుల్లో కొంత ఊరటనిచ్చినట్లయింది. అయితే ధరలు పెరుగుతాయన్న ఆశతో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు మాత్రం ఇది భారీ నష్టాలను మిగిల్చింది. ఇదిలా ఉండగా బంగారంతో పాటు వెండి ధరలు తగ్గడానికి ఒకే ఒక వ్యక్తి కారణం అన్న ఆసక్తి చర్చ సాగుతోంది. ఇంతకీ ఆయన ఎవరంటే?
బులియన్ మార్కెట్ ప్రకారం.. గత రెండు రోజుల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.18,270 వరకు తగ్గింది. ఇదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.16,750 మేర క్షీణించడం విశేషం. ఇటీవల వరుసగా పెరిగిన బంగారం ధరలు సామాన్యుడిని ఆందోళనకు గురిచేశాయి. అయితే వివాహాలు, శుభకార్యాల సీజన్ నేపథ్యంలో ధరల పతనం కొనుగోలుదారులకు కొంత ఊరటగా మారుతోంది. అయితే మార్కెట్‌లో ఇంత తక్కువ సమయంలో ఇంత పెద్ద పతనం జరగడం బులియన్ ట్రేడర్లను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది.
బంగారం,వెండి ధరలు అకస్మాత్తు పతనానికి ఒకే ఒక వ్యక్తికారణం అన్న విషయం ఆసక్తిగా మారింది. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్‌కు సంబంధించిన పరిణామాలు గ్లోబల్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. ఫెడరల్ రిజర్వ్ తదుపరి ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్ (Kevin Warsh) నియామకం ఖరారుకావడం ఇందుకు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనను నామినేట్ చేయడంతోనే మార్కెట్లలో ఒక్కసారిగా భయం వ్యాపించింది. గతంలో ఫెడరల్ రిజర్వ్ గవర్నర్‌గా పనిచేసిన వార్ష్ వడ్డీ రేట్ల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తారన్న పేరు ఉంది. దీంతో డాలర్ బలోపేతానికే ఆయన పెద్దపీట వేస్తారన్న అంచనాలు బంగారం, వెండి వంటి సేఫ్ హెవెన్ ఆస్తులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే బంగారం వంటి నాన్-ఇంట్రెస్ట్ బేరింగ్ ఆస్తుల ఆకర్షణ తగ్గుతుంది. దీంతో ఇన్వెస్టర్లు భారీగా అమ్మకాలకు దిగారు. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు కుప్పకూలగా, అదే ప్రభావం భారత బులియన్ మార్కెట్‌పై పడింది.