RBI: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని బ్యాంకులను పర్యవక్షించే ఆర్‌బీఐ తాజాగా శుక్రవారం కీలక సమావేశం జరిపింది. ఇందులో కీలక వడ్డీ రేట్లను వరుసగా 11వ సారి కూడా సవరించలేదు. మరోవైపు బ్యాంకులకు ఊరట కల్పించే నిర్ణయం తీసుకుంది. ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన నగదు నిల్వల నిష్పత్తిని 4.5 శాతం నుంచి 4 శాతానికి తగ్గించుకునే వెసులుబాటు కల్పించింది. తద్వారా బ్యాంకులు మరిన్ని రుణాలు మంజూరు చేసే అవకాశం కల్పించింది.
నిర్ణయాలను వెల్లడించిన గవర్నర్..
ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్ శక్తికాంత్ దాస్ శుక్రవారం వెల్లడించారు. సీఆర్‌ఆర్‌ను తగ్గించినట్లు తెలిపారు. ఆర్‌బీఐ నిర్ణయంతో అదనంగా 1.16 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకింగ్ వ్యవస్థలోకి పంపినట్లు అవుతుందని వెల్లడించారు. ఈ ప్రకనతో స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయి. బ్యాంకింగ్ సేర్లు పుంజుకున్నాయి. దీంతో నిఫ్టీ బ్యాంకు సూచీ 1 శాతం పెరిగింది.
నగదు నిల్వల నిష్పత్తి అంటే..
రిజర్వు బ్యాంకు నిబంధన ప్రకారం.. ప్రతీ వాణిజ్య బ్యాంకు తాను ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లలో కొంత భాగాన్ని రిజర్వు బ్యాంకు వద్ద జమ చేయాలి ఇలా ఆర్బీ వద్ద వాణిజ్య బ్యాంకులు రిజర్వు చేయాల్సిన నగదునే నగదు నిల్వల నిష్పత్తిగా పరిగణిస్తారు. డిపాజిట్ల రక్షణ కోసం ఈ చర్య తీసుకున్నారు. సీఆర్‌ఆర్‌ను తగ్గిస్తే మరిన్ని నిధులు బ్యాంకులకు అందుబాటులోకి వస్తాయి. దీంతో వివిధ కంపెనీలు, వ్యక్తులకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులకు అవకాశం లభిస్తుంది. అయితే బ్యాంకులు నిల్వ చేసిన నగదుకు ఆర్‌బీఐ ఎలాంటి వడ్డీ చెల్లించదు.
రైతుల రుణ పరిమితి పెంపు..
ఇక తాజా సమావేశంలో ఆర్‌బీఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో రైతులకు ఊరట కల్పించింది. అన్నదాతలకు తనఖా రహిత వ్యవసాయ రుణాల పరిమితిని పెంచింది. ప్రస్తుతం ఎలాంటి తనకా లేకుండా రూ.1.6 లక్షల వరకు రుణం తీసుకునే వెసులుబాటు ఉండగా, తాజాగా దానిని రూ.2 లక్షలకు పెంచుతున్నట్లు గవర్నర్ శక్తికాంత్‌దాస్ తెలిపారు. పెట్టుబడి ఖర్చులు, ద్రవ్యోల్బణం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ రుణ పరిమితిని సవరించినట్లు తెలిపారు. ఈమేరకు త్వరలో ఉత్తర్వులు జారీ చేస్తామని పేర్కొన్నారు.