Ratan Tata Passed Away: మీరు ఎప్పుడైనా టీవీలలో టాటా సాల్ట్ యాడ్ చూశారా.. యాడ్ మొత్తం పూర్తయిన తర్వాత.. చివర్లో “ఈ దేశపు ఉప్పు” అనే ట్యాగ్ లైన్ వినిపిస్తుంది.. ఆ ట్యాగ్ లైన్ కు తగ్గట్టుగానే మనదేశంలో టాటా కంపెనీలు వ్యాపారాలు సాగిస్తుంటాయి. పూర్తి దేశీయతతో టాటా కంపెనీలు ఉత్పత్తులను తయారు చేస్తుంటాయి. అందువల్లే టాటా గ్రూప్ బ్రాండ్ అచంచలమైన పేరు గడించింది. అయితే మొదట్లో కొన్ని ఉత్పత్తులు మాత్రమే తయారు చేసే టాటా కంపెనీలు.. రతన్ ఆధ్వర్యంలో కి వచ్చిన తర్వాత వేగంగా విస్తరించడం మొదలుపెట్టాయి. రతన్ సారథ్యంలో టాటా గ్రూపు ఏకంగా 10,000 కోట్ల డాలర్ల కంపెనీ మార్కు చేరుకుంది.. రతన్ వల్ల టాటా గ్రూపు అనేక వ్యాపారాల్లోకి విస్తరించింది.. టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా పవర్, టాటా గ్లోబల్ బేవరేజెస్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్, టాటా టెలి సర్వీసెస్ వంటి సంస్థలను అగ్రగామిగా రతన్ తీర్చిదిద్దారు. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ను దేశంలోనే 1000 కోట్ల డాలర్ల వార్షిక ఆదాయం పొందిన తొలి భారతీయ ఐటీ కంపెనీగా రతన్ తీర్చిదిద్దారు.
ఆదాయంలో మొత్తం అటే..
రతన్ తాను సంపాదించిన ఆదాయంలో 65% వరకు దాతృత్వ కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టారు. కోవిడ్ సమయంలో ఆయన చూపిన ఉదారత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన దేశ సమగ్రత కోసం.. దేశ అభివృద్ధి కోసం.. దేశ ఔన్నత్యం కోసం తన సంపాదన మొత్తం ఖర్చు పెట్టారు. వ్యక్తిగత ప్రయోజనాలను పట్టించుకోకుండా.. పూర్తిగా దేశ సేవ కోసమే రతన్ అంకితమయ్యారు. వ్యాపారంలో విలువలను పాటిస్తూ.. భవిష్యత్తు తరాలు కూడా విలువలు పాటించే విధంగా టాటా గ్రూప్ కంపెనీలను తీర్చిదిద్దారు. అందువల్లే ఆయనకు 2000 సంవత్సరంలో పద్మభూషణ్ పురస్కారం లభించింది. 2008లో పద్మ విభూషణ్ పురస్కారం దక్కింది. ఇంతటి గొప్ప వ్యాపారవేత్త అయినప్పటికీ మన దేశ పాలకులు ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వకపోవడం నిజంగా బాధాకరం. ఆయన వ్యాపార దార్శనికతను చూసిన ఇతర దేశాలు అత్యున్నత పురస్కారాలు, గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. రతన్ టాటా ఆధ్వర్యంలో టాటా గ్రూప్ విదేశాల్లో కూడా ఎంట్రీ ఇచ్చింది. జాగ్వార్, ల్యాండ్ రోవర్ కంపెనీలను కొనుగోలు చేసి.. నష్టాల్లో ఉన్న వాటి చరిత్రను లాభాల్లోకి మార్చి.. సరికొత్త ఘనత సృష్టించారు రతన్ టాటా. దాదాపు అన్ని కార్యకలాపాల్లోకి టాటా గ్రూపులను విస్తరించి సరికొత్త వ్యాపార అవకాశాలను సృష్టించారు. లక్షలాదిమందికి ఉపాధి కల్పించారు. అందువల్లే ధన్యజీవిగా మిగిలిపోయారు.