
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అమలు చేస్తున్న పథకాలలో ప్రధాన మంత్రి ఉజ్వల యోజన స్కీమ్ కూడా ఒకటి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మహోబాలో ఈ స్కీమ్ రెండో దశ రేపు ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ అమలు ద్వారా పేద మహిళలకు ఎల్పీజి గ్యాస్ కనెక్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 2016 సంవత్సరంలో ఈ స్కీమ్ ను ప్రారంభించింది.
ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏకంగా 5 కోట్ల బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలకు గ్యాస్ కనెక్షన్లను ఇవ్వాలని కేంద్రం భావించింది. 2018 సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి మరో ఏడు వర్గాల వారికి ఈ స్కీమ్ ద్వారా ఎల్పీజీ కనెక్షన్లను పొందే అవకాశాన్ని కేంద్రం కల్పించింది. కేంద్రం లక్ష్యాన్ని 8 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లకు సవరించగా 2019 సంవత్సరం ఆగష్టు నెలలోనే కేంద్రం ఈ లక్ష్యాన్ని సాధించడం గమనార్హం.
ఎవరైతే ఉజ్వల 2.0 స్కీమ్ ద్వారా గ్యాస్ కనెక్షన్ ను పొందుతారో వాళ్లకు మొదటి రీఫిల్, హాట్‌ప్లేట్ ను అందజేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ కింద ఎల్పీజీ కనెక్షన్ ను పొందాలని అనుకుంటే నమోదు ప్రక్రియకు కనీస పత్రాలు కచ్చితంగా ఉండాలి. రేషన్ కార్డు, నివాస ధృవీకరణ పత్రాన్ని సమర్పించకుందానే వలసదారులు ఈ స్కీమ్ యొక్క బెనిఫిట్స్ ను పొందే అవకాశం ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్ లో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద కోటి అదనపు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లను ప్రకటించడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం తొలి దశ కింద కవర్ చేయని తక్కువ ఆదాయ కుటుంబాలకు ఈ అదనపు కనెక్షన్లను అందించనుందని తెలుస్తోంది.