
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పెద్దనోట్లను రద్దు చేసిన తరువాత 2,000 రూపాయల నోటును చలామణీలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దుపై, 2000 రూపాయల నోటును మార్కెట్ లోకి తీసుకురావడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమైనా మోదీ సర్కార్ మాత్రం వెనక్కు తగ్గలేదు. అయితే సంవత్సరంసంవత్సరానికి 2,000 రూపాయల నోట్ల చలామణీ అంతకంతకూ తగ్గుతుండటం గమనార్హం.
దాదాపు రెండు సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయల నోట్ల ముద్రణను ఆపేసింది. డిజిటల్ లావాదేవీలను పెంచాలనే ఉద్దేశంతోనే ఆర్బీఐ 2000 నోటు చలామణిని తగ్గించిందని సమాచారం. 2018 నాటికి మార్కెట్ లో ఉన్న 2000 రూపాయల నోట్ల పరిమాణం 3.27 శాతం కాగా ప్రస్తుతం ఆ శాతం 2 శాతానికి తగ్గిపోయిందని తెలుస్తోంది. అయితే ప్రజలు కరోనా భయం వల్ల నగదు డిపాజిట్ చేయడం కంటే విత్ డ్రా చేయడంపై ఆసక్తి చూపుతున్నారు.
డిమాండ్ కు అనుగుణంగా కొత్త నోట్ల సరఫరా కూడా చేపట్టామని బ్యాంకులు చెబుతుండటం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న నోట్లలో 500 రూపాయల నోట్లు ఎక్కువగా చలామణీలో ఉన్నాయి. చలామణిలో ఉన్న నోట్ల సంఖ్యలో 500 రూపాయల నోట్లు 31.1 శాతం అని సమాచారం. ఆ తర్వాత 23. 6 శాతంతో 10 రూపాయల నోట్లు ఎక్కువగా చలామణీలో ఉన్నాయి.
మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరంలో నకిలీ నోట్ల చలామణి కూడా కొంచెం తగ్గిందని ఆర్బీఐ చెబుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 2,08,625 నకిలీ నోట్లను గుర్తించినట్టు ఆర్బీఐ వెల్లడించడం గమనార్హం.