Nissan : ప్రముఖ జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం నిస్సాన్ మోటార్ కంపెనీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. కంపెనీ తమ షేర్ హోల్డర్లకు రికార్డు స్థాయిలో 4.74 బిలియన్ డాలర్ల నుంచి 5.08 బిలియన్ డాలర్ల వరకు నష్టం వస్తుందని హెచ్చరించింది. దీంతో పాటు కంపెనీ ఏకంగా 20 వేల మంది ఉద్యోగులను తొలగించడానికి ప్లాన్ చేస్తోంది. ఇది కంపెనీ మొత్తం వర్క్ ఫోర్స్‌లో దాదాపు 15 శాతంగా చెప్పొచ్చు.
Also Read : అత్యధిక జీతం ప్యాకేజీలు కలిగిన BTech బ్రాంచ్‌లు ఏవి? కోట్లలో ప్యాకేజీలు ఇక్కడే..
జపాన్‌కు చెందిన పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఎన్‌హెచ్‌కే సోమవారం ఈ విషయాన్ని వెల్లడించింది. గతేడాది నవంబర్‌లో నిస్సాన్ 9 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు, గ్లోబల్ ప్రొడక్షన్ కెపాసిటీని 20 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఇప్పుడు మరో 11 వేల మంది ఉద్యోగులను కూడా తీసేయాలని నిర్ణయించింది. రాయిటర్స్ ప్రకారం.. కంపెనీ వీక్ పెర్ఫార్మెన్స్, ముఖ్యంగా అమెరికా, చైనా లాంటి కీలక మార్కెట్లలో సేల్స్ భారీగా పడిపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో నిస్సాన్ నికర ఆదాయం 94 శాతం పడిపోయింది.
నిస్సాన్ కంపెనీ ఇప్పుడు చాలా సవాళ్లను ఎదుర్కొంటోంది. పాత మోడళ్లలో కొత్తదనం లేకపోవడం, డీలర్‌షిప్‌లలో ఎక్కువ డిస్కౌంట్లు ఇవ్వడం, ఉత్తర అమెరికాలో హైబ్రిడ్ వాహనాలు తక్కువగా ఉండడం కంపెనీ కష్టాలను పెంచాయి. దీనికి తోడు చైనాలో బీవైడీ లాంటి లోకల్ ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహన తయారీదారుల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. హోండాతో నిస్సాన్ విలీనం ఈ ఏడాది మొదట్లో విఫలమైంది. రేటింగ్ ఏజెన్సీలు కూడా కంపెనీ రేటింగ్‌ను తగ్గించాయి. కంపెనీ మంగళవారం మార్చిలో ముగిసిన ఆర్థిక సంవత్సరం ఫలితాలను ప్రకటించనుంది. అయితే ఈ ఉద్యోగుల తొలగింపు వార్తపై నిస్సాన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
నిస్సాన్ తీసుకున్న ఈ నిర్ణయం ఆటోమొబైల్ రంగంలో పెరుగుతున్న సంక్షోభానికి అద్దం పడుతోంది. ఎందుకంటే వోక్స్‌వ్యాగన్, వోల్వో, పోర్షే కూడా ఇటీవలే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. నిస్సాన్ తీసుకున్న ఈ నిర్ణయంతో వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీ మళ్లీ మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంది.
Also Read ;మీరు ఫెమినిస్టా? ఇంతకీ ఈ ఫెమినిజం అంటే అసలు అర్థం ఏంటి?