Homeఅంతర్జాతీయంNestle: అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. నెస్లే పాలపొడి "చక్కెర" కూట విషం..

Nestle: అక్కడ అలా.. ఇక్కడ ఇలా.. నెస్లే పాలపొడి “చక్కెర” కూట విషం..

Nestle: “కాఫీ, మాల్ట్ ఉత్పత్తులకు హెల్త్ డ్రింక్ అని ఎలా పేరు పెడతారు. ఆ పేరుతో వ్యాపారం చేస్తే సహించేది లేదు. కచ్చితంగా మీరు తీరు మార్చుకోవాలి.. మీ ఉత్పత్తుల పేరు మార్చుకోవాలని” ఇటీవల క్యాడ్బరీ సంస్థ తయారు చేసే బోర్నా విటాకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.. దాని మర్చిపోకముందే ప్రముఖ బహుళ జాతి సంస్థ నెస్లె “చక్కెర” కూట విషం వ్యవహారం వెలుగులోకి వచ్చింది.. ఇంతకీ ఈ కంపెనీ ఏం చేస్తోంది అంటే..

స్విట్జర్లాండ్ చెందిన నెస్లే కంపెనీ.. మనదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చిన్నపిల్లలకు సంబంధించి పాల పొడులు, ఇతర బలవర్ధకమైన ఆహార పదార్థాలకు సంబంధించి వ్యాపారం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పేద దేశాలలో నెస్లే తయారుచేసిన ఉత్పత్తులకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. ఈ సంస్థ కేవలం పేద దేశాలు మాత్రమే కాకుండా అభివృద్ధి చెందిన దేశాలలోనూ తన ఉత్పత్తులను విక్రయిస్తూ ఉంటుంది. అయితే ఇటీవల ఈ సంస్థ ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా ప్రాంతాల్లో విక్రయిస్తున్న పాల పొడులు, ఇతర ఉత్పత్తుల పరిశీలన నిమిత్తం స్విట్జర్లాండ్ దేశానికి చెందిన పబ్లిక్ ఐ, IBFAN(ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్క్) సంస్థలు బెల్జియం పంపాయి. నెస్లే తయారు చేస్తున్న అన్ని ఉత్పత్తులు అదనపు చక్కర స్థాయిని కలిగి ఉన్నాయని, ప్రతి సర్వింగ్ లో అది మూడు గ్రాములుగా ఉందని బెల్జియం ప్రయోగశాల పంపిన నివేదికలో తేలింది. ఇదే సమయంలో జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్ లో ఆరు నెలల శిశువుల కోసం విక్రయించే నెస్లే ఉత్పత్తుల్లో ఎటువంటి చక్కర లేదని… అదే ఆఫ్రికాలోని ఇథియోపియాలో విక్రయించే నెస్లే ఉత్పత్తుల్లో ఐదు గ్రాముల కంటే ఎక్కువ చక్కెర ఉందని వెల్లడైంది. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన శాస్త్రవేత్త నిగెల్ రోలిన్స్ స్పందించారు. ఈ విషయాన్ని పబ్లిక్ ఐ, ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్క్ ఈ విషయాన్ని ఆయన ఎదుట ప్రస్తావించగా..”ఇక్కడ ద్వంద్వ ప్రమాణం కనిపిస్తోంది. దానిని ఎవరూ సమర్థించరు. స్విజర్లాండ్ లో తన ఉత్పత్తులకు నెస్లే ఎటువంటి చక్కెర జోడించదు. ప్రజారోగ్యం, నైతిక దృక్పథం నుంచి ఆలోచించినప్పుడు ఇది అత్యంత సమస్యాత్మకమైనదని” ఆయన పేర్కొన్నారు.

వాస్తవానికి చిన్న పిల్లలకు చక్కర తినిపించకూడదు. ఎందుకంటే అది వారిలో స్థూలకాయత్వానికి దారితీస్తుంది. దీర్ఘకాలిక వ్యాధులకు కారణమవుతుంది. 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ చిన్న పిల్లల ఆహార ఉత్పత్తుల్లో చక్కర, స్వీటెనర్లను నిషేధించాలని సూచించింది. ప్రో యాక్టివ్, ప్రజా ఆరోగ్య లక్ష్యాలకు మద్దతు ఇవ్వాలని వివిధ సంస్థలను కోరింది..కానీ, నెస్లే ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. పైగా
తన ఉత్పత్తుల్లో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్న నెస్లే.. యాదృచ్ఛికంగా తన వెబ్ సైట్ లో మాత్రం ” మీ బిడ్డకు ఆహారాన్ని తయారు చేసేటప్పుడు అందులో చక్కెర వాడకండి. చక్కెర పానీయాలు తాగిపించకండి. కొంతమంది ఆరోగ్య నిపుణులు, పోషకాహార నిపుణులు పిల్లలకు పండ్ల రసాలు కూడా తాగిపించవద్దని సూచిస్తున్నారు. సహజ చక్కర వల్ల పిల్లల్లో స్థూలకాయత్వం పెరుగుతుంది. కృత్రిమ చక్కర కూడా వారి ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది. అందువల్ల ఎల్లప్పుడూ లేబుల్ తనిఖీ చేయండి” అంటూ నీతి వాక్యాలు ప్రబోధించింది. కానీ, అదే కంపెనీ తక్కువ, మధ్య ఆదాయం కలిగి ఉన్న దేశాలలో మాత్రం తన ఉత్పత్తుల్లో విపరీతంగా చక్కర వాడుతోంది. బెల్జియం లో చేసిన పరిశోధనల నేపథ్యంలో.. చక్కర స్థాయి అధికంగా ఉందని నెస్లే కంపెనీ దృష్టికి పబ్లిక్ ఐ, ఇంటర్నేషనల్ బేబీ ఫుడ్ యాక్షన్ నెట్వర్క్ తీసుకెళ్లగా.. ఆ కంపెనీ ప్రతినిధులు స్పందించారు..”గత దశాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా శిశు తృణధాన్యాల పోర్ట్ పోలియోలో చాలా మార్పులు చేశాం. చక్కర స్థాయిని 11 శాతానికి తగ్గించాం. వచ్చే రోజుల్లో అది మరింత తగ్గుతుంది. నాణ్యత, భద్రత, రుచి పై రాజీ పడకుండా ఉత్పత్తులను తయారు చేస్తుంటాం. మా ఉత్పత్తులను కొత్తగా ఆవిష్కరించడం లేదా పునర్నిర్మించడం మేము కొనసాగిస్తూనే ఉంటామని” ఆ కంపెనీ ప్రతినిధులు చెప్పడం విశేషం.

నెస్లే తయారు చేస్తున్న ఉత్పత్తుల్లో చక్కెర స్థాయి ఎలా ఉందంటే..(ఒక ప్యాకెట్ పరంగా)

థాయ్ లాండ్: 6 గ్రాములు..
ఇథియోపియా: 5.2 గ్రాములు
సౌత్ ఆఫ్రికా: 4 గ్రాములు
పాకిస్తాన్: 2.7 గ్రాములు
ఇండియా: 2.2 గ్రాములు
బంగ్లాదేశ్: 1.6 గ్రాములు
యూకే: 0 గ్రాములు
జర్మనీ: 0 గ్రాములు
స్విట్జర్లాండ్: 0 గ్రాములు

గతంలో నెస్లే తయారుచేసిన మ్యాగీ నూడుల్స్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అందులో ప్రమాదకరమైన అవశేషాలు ఉన్నాయని కొంతమంది పర్యావరణవేత్తలు కోర్టుకు వెళ్లారు.. దీంతో ప్రభుత్వం ఆ ఉత్పత్తులపై నిషేధం విధించింది. అనంతరం నెస్లే సంస్థ మ్యాగీలో వాటిని తొలగించడంతో.. తిరిగి విక్రయాలు ప్రారంభమయ్యాయి. కిట్ క్యాట్, మిల్క్ మేడ్ వంటి ఉత్పత్తులపై కూడా ఆరోపణలు ఉన్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular