Mukesh Ambani : డిస్నీ ఇండియా పై ముఖేష్ అంబానీ కన్ను.. డీల్ కుదిరితే ఎక్కడికో వెళ్తాడు

మీడియా రంగంలో పెద్ద సంస్థగా ఆవిర్భవించాలనే ముఖేష్ అంబానీ కోరిక కూడా తీరుతుంది. మరో వైపు ఈ డీల్ కుదిరితే మీడియా వ్యాపారంలో ముకేశ్ అంబానీ ఎక్కడికో వెళ్తారని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Written By: Anabothula Bhaskar, Updated On : February 26, 2024 3:47 pm
Follow us on

Mukesh Ambani – Disney India : వయా కామ్, న్యూస్ 18, జియో సినిమా, కొన్ని ప్రాంతీయ ఛానల్స్ లో పెట్టుబడులు.. ఎన్ని ఉన్నప్పటికీ మీడియాపై ముకేశ్ అంబానికి గుత్తాధిపత్యం దక్కలేదు. ఇప్పటికీ ఈ మీడియా రంగంలో పెద్ద ప్లేయర్లుగా స్టార్, జీ గ్రూపులు కొనసాగుతున్నాయి. మీడియా రంగంలో వేలాది కోట్ల రూపాయల దందా జరుగుతుంటుంది. ఇందులో ఒక్కసారి క్లిక్ అయితే చాలు డబ్బు దానంతట అదే వచ్చిపడుతుంది. ముకేశ్ అంబానీ అందువల్లే దీనిపై ఫోకస్ చేశారు. ఇందులో పెద్ద ప్లేయర్ అయ్యేందుకు భారీ స్కెచ్ వేశారు.

జీ, సోనీ విలీనం జరుగుతుందని.. దేశ మీడియా రంగాల్లో ఇది పెద్ద డీల్ అని ఇటీవల అందరూ అనుకున్నారు. ఏం జరిగిందో తెలియదు కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. కానీ అనూహ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వాల్ట్ డిస్నీ ఇండియా తమ మీడియా వ్యాపారాలను విలీనం చేయాలని నిర్ణయించుకున్నాయి. ఇది దేశ మీడియా రంగంలోనే భారీ విలీనమని నిపుణులు చెబుతున్నారు. విలీనానికి సంబంధించి రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీ ఇండియా మధ్య స్పష్టమైన ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. అయితే ఈ విలీనంపై ఇంతవరకు రెండు సంస్థలు అధికారికంగా ప్రకటన చేయలేదు. వ్యాపార వర్గాలు చెప్పిన వివరాల ప్రకారం ఈనెల ఆరంభంలో డిస్నీ తన భారత దేశ వ్యాపారంలో 60 శాతం వాటాను రిలయన్స్ గ్రూప్ న కు చెందిన వయాకామ్- 18 కు విక్రయించేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం డిస్నీ కంపెనీ విలువను 33,000 కోట్లుగా లెక్కించినట్లు తెలుస్తోంది. విలీనం పూర్తయితే రిలయన్స్ ఇండస్ట్రీకి 61% వాటా, డిస్నికి 39 శాతం వాటా దక్కుతుందని సమాచారం. దేశంలోని డిస్నీ ఆస్తుల విలువ మొత్తం లెక్కింపు పూర్తయిన తర్వాత, ఈ రెండు సంస్థల మధ్య వాటాలపై ఒక స్పష్టమైన అవగాహన వస్తుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారత దేశంలో ఓటీటీ స్ట్రీమింగ్ బిజినెస్ లో వాల్ట్ డిస్నీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. అమెజాన్ ప్రైమ్ వంటి స్ట్రీమింగ్ యాప్స్ తో సబ్స్క్రైబర్లు పూర్తిగా తగ్గిపోతున్నారు. ప్రస్తుతం దేశీయంగా మీడియా వ్యాపారంలో బలంగా ఉన్న రిలయన్స్ సంస్థతో జట్టు కట్టడం ద్వారా స్ట్రీమింగ్ వ్యాపారంలో తమ స్థానాన్ని పటిష్టం చేసుకోవచ్చని డిస్నీ ఆలోచన. అందుకే ఈ విలీనం దిశగా చర్యలు తీసుకుందని తెలుస్తోంది. ఒకవేళ ఈ విలీనం పూర్తయితే అమెజాన్ పై పై చేయి సాధించవచ్చని రిలయన్స్ భావిస్తోంది. జియో సినిమా యాప్ మెరుగైన ఫలితాలు నమోదు చేస్తున్నప్పటికీ.. అందులో ప్రాంతీయ సినిమాలు స్ట్రీమింగ్ కాకపోవడంతో సబ్స్క్రైబర్లు ఆశించినంత స్థాయిలో పెరగడం లేదు. ఉత్తరాది మార్కెట్లో డిస్నికి మంచి పట్టు ఉంది.. ఈ యాప్ లో చాలా వరకు హిందీ సినిమాలు స్ట్రీమ్ అవుతున్నాయి. ఇక ఇందులో వాటా గనుక దక్కించుకుంటే జియో సినిమా మరింత బలోపేతం అవుతుంది.. మీడియా రంగంలో పెద్ద సంస్థగా ఆవిర్భవించాలనే ముఖేష్ అంబానీ కోరిక కూడా తీరుతుంది. మరో వైపు ఈ డీల్ కుదిరితే మీడియా వ్యాపారంలో ముకేశ్ అంబానీ ఎక్కడికో వెళ్తారని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.