Mercedes Benz : భారత మార్కెట్లో లగ్జరీ కార్లకు ఎప్పుడూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాంటి వాహనాలను అందించడంలో ముందుండే మెర్సిడెజ్-బెంజ్ ఇప్పుడు మరోసారి తన సత్తా చాటుకుంది. అద్భుతమైన పర్ఫామెన్స్, అత్యంత లగ్జరీ ఫీచర్లతో కూడిన రెండు కొత్త లగ్జరీ స్పోర్ట్స్ కార్లను ఇండియాలో విడుదల చేసింది. అవి AMG GT 63 4MATIC+, AMG GT 63 PRO 4MATIC+. ఈ కార్లు కేవలం స్పీడ్ కు మాత్రమే కాదు.. జర్మన్ ఇంజనీరింగ్ అద్భుతానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. వీటి ధరలు తెలిస్తే సామాన్యుడు కలలో కూడా కొనే ఆలోచన చేయడు. ఈ కారు ధరలు రూ. 3 కోట్ల నుంచి మొదలవుతాయి.
మెర్సిడెజ్-బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ సంతోష్ అయ్యర్ మాట్లాడుతూ.. “స్పీడ్, స్టైల్, పర్ఫార్మెన్స్ అంటే ఇష్టపడే వారి కోసమే ఈ కార్లను తయారు చేశాం. ఇవి జర్మన్ ఇంజనీరింగ్, రేసింగ్ స్పిరిట్ చక్కటి కలయిక” అని చెప్పారు.
AMG GT 63 4MATIC+ ఫీచర్స్
ఈ మోడల్ దాని సెగ్మెంట్లో అద్భుతమైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటుంది. ఈ కారు కేవలం 3.2 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ గంటకు 315 కి.మీ వరకు ఉంటుంది. దీనిలో పవర్ఫుల్ V8 ఇంజిన్ ఉంది. ప్రతి ఇంజిన్‌ను జర్మనీలోని మర్సిడెజ్-ఏఎంజీ ప్లాంట్‌లో ఒకే టెక్నీషియన్ రూపొందించడం విశేషం. దీన్నే “వన్ మ్యాన్, వన్ ఇంజిన్” విధానం అంటారు. ఈ కారులో కొత్తగా ‘డ్రిఫ్ట్ మోడ్’ అనే ఫీచర్ ఉంది. ఇది ఇంజిన్ పవర్‌ను పూర్తిగా వెనుక చక్రాలకు పంపిస్తుంది, డ్రైవింగ్ ఎక్స్ పీరియన్స్ ను మరింత పెంచుతుంది. ఫార్ములా 1 రేసింగ్ కార్ల నుంచి ప్రేరణ పొందిన యాక్టివ్ ఏరోడైనమిక్స్ ఇందులో ఉన్నాయి. ఇది హై స్పీడులో వెళ్తున్నప్పుడు కారు రోడ్డుపై మరింత స్థిరంగా ఉండేందుకు సహాయపడుతుంది. ఈ మోడల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 3 కోట్లు.
AMG GT 63 PRO 4MATIC+ ఫీచర్లు
ఇది AMG GT 63 సిరీస్‌లో మరింత పవర్ ఫుల్ మోడల్. ఈ కారు కేవలం 3.1 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ ఏకంగా గంటకు 317 కి.మీ వరకు ఉంటుంది. ఇందులో 612 హార్స్పవర్ పవర్ అందించే ఇంజిన్ ఉంది. హై-స్పీడ్ పర్ఫార్మెన్స్ కోసం ఇందులో మెరుగైన కూలింగ్ సిస్టమ్ కూడా ఇచ్చారు. కార్బన్ ఫైబర్ పార్ట్స్, ప్రత్యేకంగా ట్రాక్ కోసం డిజైన్ చేసిన టైర్లు, హై-పర్ఫార్మెన్స్ బ్రేక్‌లు ఈ కారులో ఉన్నాయి. గ్రీన్ హెల్ మాగ్నో వంటి కొన్ని స్పెషల్, ఎట్రాక్టివ్ కలర్లలో ఈ కారు లభిస్తుంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.65 కోట్లు.
ఈ రెండు కార్లలోనూ డ్రైవింగ్ అనుభూతిని పెంచే లేటెస్ట్ టెక్నాలజీ ఉంది. లేటెస్ట్ టచ్‌స్క్రీన్, వాయిస్-కంట్రోల్ టెక్నాలజీతో కూడిన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇందులో ఉంది. రేసింగ్ ట్రాక్‌లపై డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవింగ్ డేటాను చూపించడానికి ప్రత్యేకంగా ట్రాక్ పేస్ మోడ్ ఉంటుంది. Apple CarPlay, Android Auto కనెక్టివిటీ, అలాగే క్యాబిన్లో అందమైన ఆంబియంట్ లైట్ సిస్టమ్ ఉన్నాయి. కేవలం డ్రైవర్ కోసమే కాకుండా, వెనుక కూర్చునే వారికి కూడా చాలా కంఫర్టబుల్ సీట్లు ఉన్నాయని కంపెనీ చెబుతోంది.