Matter Aera : బైక్ రైడింగ్ అంటే స్పీడ్ అదిరిపోవాలి. మాన్యువల్ గేర్ లివర్‌ను పైకి కిందకు మారుస్తూ స్పీడ్‌ను కంట్రోల్ చేయగలగాలి. అయితే ఎలక్ట్రిక్ బైక్‌లలో ఇది సాధ్యం కాదు. కానీ మన దేశంలో ఒక ఎలక్ట్రిక్ బైక్ ఉంది. అది పెట్రోల్ బైక్ లాగే గేర్లతో వస్తుంది. ఈ బైక్ పేరు అహ్మదాబాద్‌కు చెందిన స్టార్టప్ ‘మేటర్’ తయారుచేసిన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ‘ఏరా’ (Matter Aera).
ఇప్పుడు కంపెనీ ఈ బైక్‌ను మరిన్ని నగరాల్లో కూడా విడుదల చేయడానికి రెడీ అవుతోంది. రాబోయే 45 రోజుల్లో కంపెనీ ఈ మోడల్‌ను పూణే, ఢిల్లీ, చెన్నై, కోయంబత్తూర్, ముంబై, జైపూర్, సూరత్, రాజ్‌కోట్, హైదరాబాద్ లో విడుదల చేయాలని యోచిస్తోంది. మేటర్ ఏరా ఎలక్ట్రిక్ బైక్ ఈ సెగ్మెంట్‌లో టార్క్ క్రాటోస్ R, రివోల్ట్ RV 400 లకు పోటీగా నిలుస్తుంది. కొంతమంది దీనిని Yamaha MT 15 V2, Bajaj Pulsar NS200 లకు కూడా పోటీదారుగా భావిస్తున్నారు. ఎందుకంటే దీని లుక్ పూర్తిగా పెట్రోల్ బైక్ లాగే ఉంటుంది.
Also Read : ఛార్జింగ్ అయిపోతే తోసుకుంటూ పోవాల్సిందేనా? ఈ స్కూటర్ల రేంజ్ ఎంతంటే!
మేటర్ ఏరా దేశంలో మాన్యువల్ గేర్-షిఫ్టింగ్ సిస్టమ్‌తో కూడిన ఏకైక ఎలక్ట్రిక్ బైక్. ఇది 5000, 5000+ అనే రెండు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ.1.74 లక్షలు, రూ.1.84 లక్షలు. 5000, 5000+ రెండింటిలోనూ 10 kW (13.4 bhp) ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది కేవలం 6 సెకన్లలో 0 నుండి 60 కిమీ/గం వేగాన్ని అందుకుంటుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే ఇది 125 కిమీల రేంజ్‌ను ఇస్తుందని కంపెనీ పేర్కొంది.
ఈ ఎలక్ట్రిక్ బైక్ రన్నింగ్ ఖర్చు దాదాపు కిలోమీటరుకు 25 పైసలు. అంటే సిటీ మొత్తాన్ని చుట్టేయడానికి కేవలం రూ.30 ఖర్చు మాత్రమే అవుతుంది. రియల్ వరల్డ్ లో రేంజ్‌లో తేడా ఉండవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో నావిగేషన్, మ్యూజిక్, కాల్, ఇతర ఫీచర్లతో కూడిన 7-ఇంచుల టచ్‌స్క్రీన్ కన్సోల్ ఉంది. ఏరాను ఇంట్లో ఛార్జ్ చేసుకోవచ్చు. ఏదైనా అవుట్‌లెట్‌లో ఫాస్ట్ ఛార్జ్ కూడా చేయవచ్చు.
కంపెనీ తన వెబ్‌సైట్, ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్ ద్వారా బుకింగ్‌లను ప్రారంభించింది. కొత్త నగరాల్లో విడుదల కోసం మేటర్ “ఎక్స్‌పీరియన్స్ హబ్”లను సిద్ధం చేస్తోంది. ఇక్కడ ఆసక్తి ఉన్న వ్యక్తులు బైక్ టెస్ట్ డ్రైవ్ చేయవచ్చు.. బైక్‌ను దగ్గరగా తెలుసుకోవచ్చు. ఈ ఎక్స్‌పీరియన్స్ హబ్‌ల ముఖ్య ఉద్దేశ్యం ఏరా రోజువారీ ప్రయాణ అవసరాలకు ఎలా సరిపోతుందో రైడర్‌లకు తెలియజేయడం. ఈ హబ్‌లు బైక్ అందుబాటులోకి రాకముందే అన్ని 8 నగరాల్లో ప్రారంభమవుతాయి. అయితే బైక్‌లోని లోపాలను పరిశీలిస్తే ఇది తన పోటీదారుల కంటే కొంచెం ఎక్కువ ఖరీదైనదిగా అనిపిస్తుంది. అంతేకాకుండా 125 కిమీల రేంజ్ లాంగ్ రైడింగ్‌కు సరిపోదు.
Also Read : అత్యధిక మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్ లు ఇవే.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 300 కి.మీ.