Maruti Suzuki: దేశంలో కార్ల విక్రయాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ వినియోగ వాహనాల(ఎస్‌యూవీ)కు మంచి డిమాండ్ ఉంది. వీటి విక్రయాలు పెరుగుతున్నాయి. ఈ సమయంలో చిన్నకార్ల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో భవిష్యత్‌లో చిన్న కార్లకు డిమాండ్ ఉండదన్న అభిప్రాయం మార్కెట్ వర్గాల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో రాబోయే రెండేళ్లలో చిన్నకార్ల విక్రయాలు తిరిగి పుంజుకుంటాయని ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి చైర్మన్ ఆర్సీ. భార్గవ అన్నారు. ఓ ఇంగ్లిష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిన్న కార్ల మార్కెట్, విద్యుత్ వాహనాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కారణాలు ఇవేనట..
ఇక చిన్నకార్ల విక్రయాలు పుంజుకోవడానికి భార్గవ కారణాలు కూడా చెప్పారు. ఎంట్రీ లెవల్ కస్టమర్లు ఆదాయం పెరగడం, స్కూటర్, మోటార్ సైకిల్ వినియోగించేవారు ఇతర వాహనాలకు అప్‌గ్రేడ్ కావాలని చూస్తుండడం వంటి కారణాలతో చిన్నకార్ల అమ్మకాలు పుంజుకుంటాయని, పూర్వవైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేవలం రెండేళ్లలోనే చిన్న కార్ల పరిశ్రమ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ద్విచక్రవాహనాల నుంచి కార్లకు మారాలనుకునేవారునేరుగా ఎస్‌వీయూవీలను కొనుగోలు చేయరని అభిప్రాయపడ్డారు.
ఎలక్ట్రిక్ కార్ల గురించి..
ఎలక్ట్రిక్ వాహనాల గురించి కూడా భార్గవ మాట్లాడారు. బొగ్గు నుంచి ఉత్పత్తి చేస్తే వచ్చే విద్యుత్‌ను ఉపయోగించి వాహనాలను చార్జి చేస్తే కర్బన ఉద్గారాలు తగ్గిచడంలో సాయపడదన్నారు. కాలుష్యం తగ్గాలంటే బయో ఫ్యూయల్, ఇథనాల్, సీఎన్‌జీ వంటి వాటిని వినియోగించాలని సూచించారు. నిర్వహణ వ్యవయాలు, ఇన్సూరెన్స్ ఛార్జీలు, రోడ్లు, పన్నులు, కర్బన ఉద్గార నిబంధనల్లో వచ్చిన మార్పుల కారణంగా చిన్న కార్లు, ద్విచక్రవాహనాల ధరలు పెరిగాయని తెలిపారు. వీఠి ధరలు పెరగడం డిమాండ్‌పై ప్రభావం చూపిందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో చిన్న కార్ల విక్రయాలు 12 శాతం పడిపోయినట్లు చెప్పారు. దీంతో హోండా, నిస్సాన్, వోక్స్ వ్యాగన్ లాంటి సంస్థలు చిన్నకార్ల మార్కెట్ నుంచి తమ వాటాను క్రమంగా తగ్గించుకున్నాయని తెలిపారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా రికార్డుస్థాయిలో కార్ల అమ్మకాలు జరిగాయని తెలిపారు. వాటిలో ఎస్‌యూవీల వాటా పెరిగిందన్నారు. చిన్న కార్ల వాటా తగ్గిందని చెప్పారు.