Maruti 800: నాలుగు దశాబ్దాల క్రితం దేశంలో కారంటే.. అంబాసిడర్ లేదా ప్రీమియర్ పద్మిని. అవి ఉన్న వాళ్లు అంటే సంపన్నుల కిందే లెక్క. వాటిని చూడగానే.. మధ్యతరగతి వారి కలలో కూడా కారు కొనాలన్న ఆలోచన వచ్చేది కాదు. ఈ క్రమంలో.. 1983 డిసెంబరు 14న విడుదలైన చిన్న కారు మారుతీ 800.. దేశంలో మధ్యతరగతి ప్రజలకు చేరువై, కారు కొనాలనే పెద్ద ఆశను తీర్చడమే కాదు ప్రజల కారుగా(పీపుల్స్ కార్) నిలిచింది. దక్షిణ ఢిల్లీలోని మారుతీ సుజుకీ భారత ప్రధాన కార్యాలయంలోని బ్రాండ్ సెంటర్లో చూస్తే, ఆధునాతన మోడళ్ల మధ్య ఠీవిగా మారుతీ 800 (ఎమ్‌ఐ00 మోడల్) కనిపిస్తుంది.
విశేష ఆదరణ..
మారుతీ విడుదలయ్యే సమయానికి లైసెన్స్ ఉండేది. అప్పట్లో అనేకమంది మారుతీ 800 కారును సొంతం చేసుకునేందుకు పోటీపడగా, 1983లో తీసిన డ్రాలో ఇండియన్ ఎయిర్లైన్స్ ఉద్యోగి హర్పాల్ సింగ్ తొలి కారును దక్కించుకున్నారు. ఆ తర్వాత మూడేళ్లకే లక్ష కార్లు అమ్ముడుపోయాయంటే ఆ మోడల్‌కు వచ్చిన ఆదరణను అర్థం చేసుకోవచ్చు. అప్పటికి మన మార్కెట్లో ఉన్న ఇతర కార్లతో పోలిస్తే, జపాన్‌కు చెందిన సుజుకీ మెరుగైన సాంకేతికతను వినియోగించి తీసుకొచ్చిన మారుతీ 800 లక్షల మంది మధ్యతరగతి వర్గీయుల ఇళ్లలోకి చేరింది. పాతికేళ్లలోపే 25 లక్షల ఉత్పత్తిని సాధించింది. భద్రత, ఉద్గార నిబంధనలు కఠినతరం కావడానికితోడు.. ఆర్థిక సంస్కరణల ఫలితంగా అనేక సంస్థల నుంచి తీవ్రపోటీ ఎదురవ్వడం, మారుతీ సుజుకీ చిన్నకారు మోడల్లోనూ మార్పులు చేసింది.
ఉత్పత్తి నిలిపివేత..
మారుతీ 800 ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు 2014, జనవరి 18న ప్రకటించింది. అప్పటికి దేశీయంగా 26.8 లక్షల కార్లను విక్రయించగా.. 2.4 లక్షల కార్లను ఎగుమతి చేశారు. అంటే 29.2 లక్షల కార్లు విక్రయమయ్యాయన్న మాట.
మారుతీ 800 మైలురాళు
ఏడాది అప్పటికి మొత్తంకార్లు
1986–87 1 లక్ష
1992–93 5 లక్షలు
1996–97 10 లక్షలు
1999–20 15 లక్షలు
2002–03 20 లక్షలు
2005–06 25 లక్షలు
2014 జనవరి 18 29.2 లక్షలు
సచిన్, గోవిందాల తొలి కారు..
= అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ కుమారుడు సంజయ్‌గాంధీ మారుతీ లిమిటెడ్‌కు తొలి మేనేజర్‌గా వ్యవహరించారు. ఆయన జయంతి సందర్భంగానే ఇందిరాగాంధీ తొలి 4 కార్లను ప్లాంటు నుంచి విడుదల చేశారు.
= క్రికెటర్ సచిన్ టెండూల్కర్, నటుడు గోవిందా కొనుగోలు చేసిన తొలి కారు ఇదే.
= పేరుకు తగ్గట్లే 800 సీసీ ఇంజిన్‌తో వచ్చిన ఈ కారు.. అంబాసిడర్ తర్వాత అత్యధిక కాలం పాటు (31 ఏళ్లకుపైగా) ఉత్పత్తి అయిన మోడల్గా నిలిచింది.
= మన రోడ్లపై తొలిసారి పరుగులు తీసే సమయానికి ఈ కారు ధర రూ.48 వేలు మాత్రమే.
= అప్పట్లో ఇంటి ముందు మారుతీ 800 కారు నిలిపి ఉన్న వారి పిల్లలకు పెళ్లి సంబంధాలు త్వరగా కుదిరేవట.
= అందుబాటు ధర, తక్కువ నిర్వహణ ఖర్చు, ఎక్కువ మైలేజీ, మన రోడ్లకు తగినట్లుగా కాంప్యాక్ట్ పరిమాణంలో ఉండడం.. ఇవే మారుతీ 800 విజయ రహస్యాలు.
ఇందిర, రాజీవ్ కీలక పాత్ర..
ప్రజల కారు మారుతీ 800 ఆవిష్కరణలో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ తెర వెనుక కీలక, ప్రభావవంత పాత్ర పోషించారు. దేశీయంగా వినియోగదారు విప్లవాన్ని ఇది తీసుకొచ్చింది. ఇంజినీరింగ్ పరిశ్రమను మార్చివేసింది. సుజుకీ– మారుతీ సంయుక్త సంస్థ ఏర్పడేందుకు కారణమైన సుజుకీ, వి. కృష్ణమూర్తిలను గుర్తుకు చేసుకోవడం ఈ సందర్భంగా చాలా ముఖ్యం. బీహెచ్‌ఈఎల్(బెల్)ను నిర్మించి ఆ తర్వాత సెయిల్ పునరుజ్జీవం తెచ్చిన కృష్ణమూర్తి భారత్లోనే గొప్ప ప్రభుత్వ రంగ మేనేజర్లలో ఒకరు.