Cars: భారతీయ మధ్య తరగతి కుటుంబాలు కారు కొనుగోలుకు ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. దీంతో కార్ల కంపెనీలు కూడా వారి ఆర్థిక అనుకూలతకు తగ్గట్లుగానే తయారు చేస్తున్నాయి.
ఇటీవల విడుదల చేసిన కాంపాక్ట్ SUV XUV 3XOకు బుధవారం (మే 15) ఉదయం 10 గంటలకు కంపెనీ బుకింగ్ తెరిచింది. తెరిచిన 60 నిమిషాల్లోనే 50,000 బుకింగ్‌లు చేసుకున్నట్లు భారతదేశ ప్రముఖ SUV తయారీదారు మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ తెలిపింది.
XUV 3XO మొదటి 10 నిమిషాల్లోనే 27,000 కంటే ఎక్కువ బుకింగ్‌లను నమోదు చేయడం చూస్తే దేశ వ్యాప్తంగా ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించిందని చెప్పాలి. ఈ మైలురాయి XUV 3XO స్టాండ్ అవుట్ డిజైన్, ప్రీమియం ఇంటీరియర్స్, సౌకర్యవంతమైన రైడ్, అత్యాధునిక టెక్నాలజీ, థ్రిల్లింగ్ పనితీరు, సాటిలేని భద్రతను నొక్కి చెబుతుందని కంపెనీ మీడియాకు తెలిపింది.
మహీంద్ర అండ్ మహీంద్ర లిమిటెడ్, ఆటోమోటివ్ విభాగం ప్రెసిడెంట్ విజయ్ నక్రా మాట్లాడుతూ, ‘XUV 3XO ప్రారంభించిన కొద్ది సేపటికే 50,000 బుకింగ్‌లను దక్కించకుందని. ఇది తమకు గర్వంగా ఉందని చెప్తున్నారు. ఇది మా కస్టమర్లు మాపై ఉంచిన నమ్మకానికి నిదర్శనం అని ఆయన అన్నారు. ఆవిష్కరణకు మా నిబద్ధత, అంచనాలకు మించిన విలువ అందించడం అనేది తమ కంపెనీ భవిష్యత్ ను మరింత ముందుకు తీసుకెళ్తుంది అన్నారు. ఇది ‘మీకు కావలసిన ప్రతిదాన్ని, మరిన్నింటిని’ అందించేందుకు రూపొందించబడింది. మేము ఈ డిమాండ్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. కస్టమర్లకు XUV 3XO డెలివరీ చేయడం ప్రారంభించాము.’
XUV 3XO డెలివరీలు మే 26, 2024 నుంచి ప్రారంభమవుతాయి. కస్టమర్ల ఉత్సాహానికి అనుగుణంగానే ఇప్పటికే 10,000 యూనిట్లకు పైగా ఉత్పత్తి చేశాం. మహీంద్రా అండ్ మహీంద్రా కస్టమర్ అనుభవంపై అత్యంత దృష్టిని సారించి, సకాలంలో డెలివరీలను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటుంది. XUV 3XO కోసం బుకింగ్‌లు ఆన్‌లైన్‌లో, అన్ని అధీకృత మహీంద్రా డీలర్‌షిప్‌లో తెరిచి ఉన్నాయి అని కంపెనీ తెలిపింది.
కేవలం గంటలోనే 50 వేల బుకింగులు చేసుకోవడంతో కంపెనీ యాజమాన్యం డిమాండ్ కు తగ్గట్టు ఉత్పత్తి చేసేందుకు సిద్ధం అవుతుంది. ఉత్పత్తిని పెంచామని, మరింత వేగంగా డెలివరీ చేస్తామని కంపెనీ యాజమాన్యం చెప్తోంది.