Fast Loan : ఒక్క క్లిక్ తో లోన్.. త్వరలో యూఎల్ఐని తేనున్న ఆర్బీఐ.. లాభమా? నష్టమా? వివరాలు తెలుసుకోండి..

గతంలో లోన్లు కావాలంటే అడ్డగోలు పేపర్ వర్క్ ఉండేది. కరోనా తర్వాత చాలా వరకు తగ్గింది. డిజిటలైజేషన్ రావడంతో ఇందులో కూడా ఎంతో కొంత ఆధారాలు అవసరం అవుతున్నాయి. ఇప్పుడు ఆర్బీఐ యూఎల్ఐని తీసుకువస్తుంది. దీంతో ఒక్క క్లిక్ తో బ్యాంకు ఖాతాలో రుణం పడిపోతుంది..

Written By: Mahi, Updated On : August 29, 2024 3:07 pm

Need a Loan

Follow us on

Fast Loan: బ్యాంకింగ్ రంగంలో విప్లవాత్మక మార్పులను తెచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కసరత్తు చేస్తోంది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (యూపీఐ) చలామణిలో ఉండగా యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ (యూఎల్ఐ)ను కూడా తీసుకువచ్చేందుకు సిద్ధం అవుతోంది. ఇక ఇది వచ్చాక రుణం తీసుకోవడం మరింత సులువు అవుతుంది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం (ఆగస్ట్ 26) ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ యూఎల్ఐ గురించి వివరించారు. దాని గురించి ఓకే తెలుగు వ్యూవర్స్ కోసం.. రుణ రంగంలో పనిని సులభతరం చేసే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్
ఇండియా (ఆర్బీఐ) గతేడాది యూఎల్ఐని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించింది. ముఖ్యంగా చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సులభంగా, స్వల్పకాలిక రుణాలు అందించేందుకు ఈ ఇంటిగ్రేటెడ్ లోన్ ప్లాట్ ఫామ్ చాలా ఉపయోగపడుతుందన్నారు. యూపీఐ వచ్చిన తర్వాత చెల్లింపు వ్యవస్థలో ఎంత విప్లవం వచ్చిందో, దాని పద్ధతుల్లో ఎంత పెద్ద మార్పు వచ్చిందో, రుణ రంగంలో కూడా అదే మార్పు వస్తుందని ఆయన చెప్పారు. బ్యాంకింగ్ సేవల డిజిటలైజేషన్ ప్రయాణాన్ని కొనసాగిస్తూ, రుణ ప్రక్రియను ఎటువంటి అవాంతరాలు లేకుండా సులభతరం చేసేందుకు గతేడాది ఈ ప్లాట్ ఫామ్ ను ఉపయోగించడం ప్రారంభించామని శక్తికాంత దాస్ చెప్పారు.

ఈ విధానంతో రైతులు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈలు) త్వరితగతిన రుణాలు లభించనున్నాయి. ఈ ప్లాట్ ఫామ్ ప్రత్యేకతలను ప్రస్తావిస్తూ, ఇందులో వివిధ రాష్ట్రాల భూ రికార్డులతో సహా ఇతర డేటా ఉంటుందని చెప్పారు. దీని ద్వారా పరిశీలన వేగంగా జరిగి చిన్న, గ్రామీణ ప్రాంతాల్లోని రుణగ్రహీతలకు రుణ వెంటనే ఆమోదం అవుతుందని వివరించారు. బ్యాంకింగ్ సేవల డిజిటలైజేషన్ లో భాగంగా యూనిఫైడ్ ల్యాండింగ్ ఇంటర్ఫేస్ ఉందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. యూఎల్ఐ అన్ని డేటా ప్రొవైడర్ల నుంచి రుణగ్రహీతలకు భూ రికార్డులతో సహా డిజిటల్ డేటాను అందిస్తుందని, ఇది క్రెడిట్ వాల్యుయేషన్ కోసం తీసుకునే సమయాన్ని తగ్గించడంలో సహాయపడుతుందన్నారు.

రుణం మంజూరుకు సమాచారం సేకరించేలా యూఎల్ఐని రూపొందించామని, దీని వల్ల రుణం కోసం దరఖాస్తు చేసుకునే వారు ఎక్కువ డాక్యుమెంట్లు సమర్పించాల్సిన అవసరం లేదని, సులభంగా పొందవచ్చని చెప్పారు. యూఎల్ఐ ప్లాట్ ఫామ్ రుణం కోసం దరఖాస్తు చేసుకునే కస్టమర్ ఆధార్, ఈ-కెవైసీతో పాటు భూ రికార్డులు, పాన్, ఖాతా సంబంధించిన అవసరమైన సమాచారాన్ని తక్కువ సమయంలో వివిధ వనరుల నుంచి సేకరిస్తుందని వివరించారు.

యూఎల్ఐ పనిచేసే విధానం గురించి మాట్లాడుతూ, డిజిటల్ రుణ ప్రక్రియను సులభతరం చేసేందుకు ఇది పనిచేస్తుందని స్పష్టమవుతోంది. ఖాతాదారుల ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ డేటా మొత్తం ఉంటుందని, రుణం తీసుకునే సమయంలో ఈ యూఎల్ఐ డిజిటల్ గా యాక్సెస్ చేయడం ద్వారా పనిని సులభతరం చేస్తుందని శక్తికాంత దాస్ చెప్పారు. ‘ప్లగ్ అండ్ ప్లే’ విధానంతో యూఎల్ఐని రూపొందించామని, ఇది రుణ ప్రక్రియలో అనేక చిక్కులను తగ్గిస్తుందని దాస్ చెప్పారు.

స్పష్టంగా చెప్పాలంటే, ఇది ఓపెన్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ (ఏపీఐ) తో ఓపెన్ ఆర్కిటెక్చర్ ను ఇంటిగ్రేట్ చేస్తుంది, దీని ద్వారా వివిధ ఆర్థిక సంస్థలు ‘ప్లగ్ అండ్ ప్లే’ మోడల్ లో చేరవచ్చు. కస్టమర్ కు సంబంధించిన మొత్తం సమాచారం ఈ ఒక్క ప్లాట్ఫామ్ ద్వారా బహిర్గతం అవుతుంది. ఈ మొత్తం వ్యవస్థ డేటా ప్రైవసీతో పనిచేస్తుంది. జన్ ధన్- ఆధార్, యూపీఐ, యూఎల్ఐ అనేవి దేశ ఆర్థిక రంగంలో పెనుమార్పులను తెస్తాయని గవర్నర్ అన్నారు.

ప్రస్తుత కాలంలో తక్షణ రుణాలు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. చిన్న చిన్న వ్యక్తి గత రుణాలు అందించేందుకు వందలాది యాప్ లు పని చేస్తున్నాయి. ఇవి అవసరమైన వారికి నిమిషాలలో తక్షణ రుణాలను అందిస్తాయి. ప్రజలు ఇలాంటి వాటి ఉచ్చులో చిక్కుకొని తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే ఆర్బీఐ యూఎల్ఐని తీసుకువస్తుంది. ఇది బ్యాంకింగ్ రంగంతో కనెక్ట్ అయి తక్కువ వడ్డీకి రుణాలను ఇస్తుంది.