Indian companies including Paytm have gone into foreign ownership
Paytm – Foreign Investors : ‘బండ్లు ఓడలు, ఓడలు బండ్లు’ అవుతాయి ఈ నానుడి కంపెనీలకు అదీ భారత కంపెనీలకు బగా సూట్ అవుతుంది. గతంలో కాలం కలిసి వచ్చి బాగా ఎదిగిన భారత కంపెనీలు.. కాలం తిరగబడడంతో కొన్న కంపెనీల నుంచి ఆదాయం లేక అందులో పెట్టుబడి పెట్టలేక కొన్ని అమ్మకానికి వెళ్లాయి. కొన్ని ధర కంటే తక్కువకే అమ్మేశారు.
‘టాటా మోటార్స్’, ‘మదర్సన్ సుమీ’ వంటి కంపెనీల పరిస్థితి వేరు. వాటికి మాత్రం కొనుగోళ్లు కలిసే వచ్చి అంతర్జాతీయ దిగ్గజాలుగా ఎదిగాయి. కానీ యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వెళ్లిపోవడం ఈ విజయాలను కమ్మేసే ప్రమాదం కనిపిస్తోంది. వీటికి వ్యాపారాలు.. లాభాలు అధికంగా యూరప్ నుంచే రావడం కొసమెరుపు బ్రిటన్ ఈయూ నుంచి బయటకు వెళ్తే.. ఆయా కంపెనీలు బ్రిటన్‌తో పాటు ఈయూలోనూ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. అనుమతులు కష్టంగా మారుతాయి, ఖర్చులు పెరుగి ఆ ప్రభావం అమ్మకాలు, లాభాలపై పడుతుంది. ఈ నేపథ్యంలో ఏ కంపెనీ టేకోవర్ ఎలా మారిందో తెలుసుకుందాం..
1. టాటా స్టీల్-కోరస్
ఫార్చ్యూన్-500 నుంచి రూ.20వేల కోట్ల నష్టాల్లోకి ఆంగ్లో-డచ్ ఉక్కు దిగ్గజం ‘కోరస్’ను టాటా స్టీల్ 2007లో కొనుగోలు చేసింది. దీంతో టాటా బ్రిటన్ ఉక్కు రంగంలోకి అడుగుపెట్టింది. తమను బానిసలుగా చూసిన బ్రిటీష్ కంపెనీని కొనుగోలు చేయడంపై టాటాపై భావోద్వేగ శుభాభినందనలు వెల్లువెత్తాయి. కోరస్ కోసం టాటా స్టీల్ నెలల తరబడి బ్రెజిల్‌కు చెందిన సీఎస్‌ఎన్ తో తలపడింది. 14 బిలియన్ డాలర్లకు పైగా వెచ్చించింది. సమీప ప్రత్యర్థి కంపెనీ సీఎస్‌ఎన్ కన్నా 5 పెన్స్‌ల కన్నా తక్కువ బిడ్ వేయగలిగింది. అంటే మన కరెన్సీలో కేవలం ఐదు రూపాయలు. అలా కోరస్‌ను టేకోవర్ చేసింది.
25 మిలియన్ టన్నుల వార్షిక ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో ప్రపంచంలోనే 5వ అతి పెద్ద స్టీల్ తయారీ సంస్థగా టాటా ఆవిర్భవించింది. ఫార్చ్యూన్ 500 బహుళ జాతి సంస్థల జాబితాలో చోటు దక్కించుకున్న తొలి భారతీయ సంస్థగా నిలిచింది. కానీ ఈ 5 పెన్స్ విజయమిచ్చిన సంతోషం ఎంతోకాలం నిలవలేదు. 2007లో టన్నుకు 550-575 డాలర్లు ఉన్న ఉక్కు రేటు (హాట్ రోల్డ్ కాయిల్స్) 2016లో 380కి పడిపోయింది. కోరస్ కొనుగోలుకు సమీకరించిన భారీ రుణాలు ఒకవైపు.. కంపెనీ నష్టాలు మరోవైపు టాటా స్టీల్‌ను ఉక్కిరిబిక్కిరి చేశాయి.
అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కూడా తోడవడంతో పరిస్థితులు మరింత దిగజారాయి. డిమాండ్ క్షీణించి, ధర పడిపోవడంతో టాటా గ్రూప్ 2 బిలియన్ పౌండ్లు (దాదాపు రూ.20వేల కోట్లు) నష్టపోయింది. కోరస్ ను అమ్మేయాలని నిర్ణయించుకుంది. డిమాండ్ లేక కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో లాంగ్ స్టీల్ వ్యాపారం, సంబంధిత ప్లాంటును విక్రయించగలిగింది. మిగిలిన వ్యాపారాన్ని తానే నిర్వహించాలని చూస్తున్నా.. బ్రెగ్జిట్ దెబ్బ కుంగదీసే ప్రమాదం కనిపిస్తోంది. బ్రిటిష్ కంపెనీ కోరస్‌ను టాటా స్టీల్ టేకోవర్ చేయడం ఓ సంచలనం. కానీ భారీ నష్టాలతో యూకే ఆస్తులను విక్రయిస్తోంది.
2. మిట్టల్ స్టీల్ – ఆర్సెలర్
భారత్ నుంచి వలస వెళ్లిన లక్ష్మీ నివాస్ మిట్టల్ బ్రిటన్‌లో ఉక్కు వ్యాపారిగా ఎదిగాడు. నెదర్లాండ్స్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్నాడు. లగ్జెంబర్గ్‌కు చెందిన ఆర్సెలర్ స్టీల్‌ను 32 బిలియన్ డాలర్లకు మిట్టల్ స్టీల్స్ 2006లో కొనుగోలు చేసింది. ఈ కలయికతో ప్రపంచంలోనే నెంబర్-1 ఉక్కు కంపెనీగా ఆవిర్భవించింది. దీంతో ఇండియా మరో సారి వ్యాపారం పరంగా ప్రపంచంలో నెం. 1గా ఆవిర్భవించడంతో భారతీయులు సంబురపడ్డార.
2008 నుంచి మొదలైన మందగమనం ఆర్సెలర్ మిట్టల్‌పై ఎక్కువగా పడింది. ఉక్కుకు డిమాండ్ పడిపోయింది. దీంతో సంస్థకున్న 25 బ్లాస్ట్ ఫర్నేస్‌లో తొమ్మిదింట ఉత్పత్తి నిలిచిపోయింది. ఫ్రాన్స్‌లో రెండు ఫర్నేస్‌ను మూసేసింది. అదే ఏడాది తన యూరోపియన్ వ్యాపారం తాలూకు విలువను 4.3 బిలియన్ డాలర్ల మేర తగ్గించి చూపించింది. రెండేళ్ల కిందట కంపెనీలో వాటాలను 770 మిలియన్ డాలర్లకు అమ్మేసింది. సెంట్రల్ ట్రినిడాడ్ ప్లాంటును మూసి వేయడంతో పాటు.. అమెరికాలోని రెండు ప్లాంట్లను అమ్మేయాలని కూడా నిర్ణయించింది.
3. ఎస్సార్ గ్లోబల్ – స్టాన్‌లో రిఫైనరీ
2011లో బ్రిటన్‌కు చెందిన స్టాన్‌లో రిఫైనరీని కొనుగోలు చేసింది. అప్పటి దాకా ఆ రిఫైనరీ ‘షెల్’ యాజమాన్యంలో ఉండేది. ఇందుకు ఎస్సార్ 350 మిలియన్ డాలర్లు వెచ్చించింది. ఎస్సార్ ఆయిల్ ఇప్పటి వరకు ఆ రిఫైనరీపై 1.2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. గతంలో దుర్భర స్థితిలో ఉన్న పాత ప్లాంటు.. బ్రిటన్‌లోని రిఫైనరీల్లో ఒకటిగా ఎదిగింది. దేశంలో రవాణాకు ఉపయోగించే ఇంధనాల్లో 16 శాతం వాటా ఇదే సరఫరా చేస్తోంది.
4. హావెల్స్- సిల్వేనియా
రాజస్థాన్ కేంద్రంగా విదేశాలకు విస్తరించిన దేశీ దిగ్గజం ‘హావెల్స్’. 2007లో తనకన్నా ఒకటిన్నర రెట్లు పెద్దదైన యూరోపియన్ కంపెనీ ‘సిల్వేనియా’ను 300 మిలియన్ డాలర్లకు హావెల్స్ కొనుగోలు చేసింది. ఆ డీల్ సంస్థకు ఇబ్బందిగా మారింది. 2000లో రూ.100 కోట్ల నుంచి 2006లో రూ.1,600 కోట్ల స్థాయికి ఎగిసిన హావెల్స్.. 60-70 మిలియన్ డాలర్ల విలువైన విదేశీ కంపెనీలను కొందామని ప్రయత్నాలు చేసి విఫలమైంది. అదే సమయంలో 5 నుంచి 6 రేట్లు విలువైన సిల్వేనియా ఆఫర్ వచ్చింది. దీంతో 300 మిలియన్ డాలర్లు వెచ్చించేందుకు సై అంటూ ముందడుగు వేసింది హావెల్స్. అప్పటి కరెన్సీ మారక విలువ రూ. 2,000 కోట్లు వెచ్చించిన హావెల్స్, ఆ తర్వాత మరో రూ.1,000 కోట్లు కుమ్మరించింది. కానీ అమ్మకాలు, ఆర్థిక పరిస్థితులు కలిసి రాకపోవడంతో 80 శాతం వాటాను ‘షాంఘై ఫెయిలో అకౌస్టిక్స్’కు రూ. 1,340 కోట్లకు అమ్మేసింది.
5. శ్రీ రేణుకా షుగర్స్- డూబ్రెసిల్
‘శ్రీరేణుకా షుగర్స్’ అంటేనే సంచలనం. కర్ణాటకలో రైతులను ఒక్కటి చేసి.. వాటాలిచ్చి మరీ ఆరంభించిన ఈ సంస్థ తక్కువ సమయంలోనే అంతర్జాతీయ కీర్తిని సంపాదించింది. చక్కెర తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీల జాబితాలో చేరిన ఈ సంస్థ. 2010లో రూ.1,312 కోట్లతో బ్రెజిల్‌కు చెందిన బ్రెసిల్‌ను కొనుగోలు చేసింది. ఒక భారతీయ చక్కెర కంపెనీ.. విదేశీ సంస్థను కొనుగోలు చేయడం ఇదే ప్రథమం. సరిగ్గా ఏడాది తర్వాత 2011లో ఒకసారి, ఆపైన 2014లో మరోసారి బ్రెజిల్‌లో ఏర్పడ్డ కరవు కంపెనీని దెబ్బ తీసింది. బ్రెజిల్ ఆర్థిక పరిస్థితులు దిగజారడం, చక్కెర ధరలు పడిపోవడం తోడైంది. ఈ పరిణామాలతో రేణుకా బ్రెసిల్ దివాలా పిటిషన్ వేయాల్సి వచ్చింది.
6. ఎయిర్‌టెల్- జయిన్
దేశీ టెలికం రంగంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఎయిర్‌టెల్ సంస్థ. విదేశాల్లో విస్తరణకు ప్రయత్నాలు చేసింది. ఆఫ్రికన్ టెలికం సంస్థ ‘ఎంటీఎన్’ను కొనేందుకు ప్రయత్నించినా కుదరలేదు. కువైట్ టెలికం కంపెనీ ‘జయిన్’ రూపంలో అవకాశం వచ్చింది. ఆఫ్రికాలోని 17 దేశాల్లో తమ టెలికం వ్యాపారాన్ని విక్రయిస్తామని సంస్థ ముందుకొచ్చింది. అవకాశం కోసం చూస్తున్న ఎయిర్‌టెల్.. 2010లో 10.7 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 73,211 కోట్లు) కొనేసింది. కొంత కసరత్తు చేస్తే భారీగా లాభాలు వస్తాయనుకున్న ఎయిర్‌టెల్‌కు మెల్లగా పరిస్థితి అర్థమైంది.
ఆఫ్రికాలో ఎంటీఎన్‌ను అందుకోవడం తేలిక కాదని తెలుసుకుంది. 2012 నుంచి తమ నెట్‌వర్క్‌లు, ఐటీ కార్యకలాపాలను అవుట్ సోర్సింగ్‌కు ఇచ్చి ఆర్థిక భారం తగ్గించుకుంది. 2015 డిసెంబర్ క్వార్టర్ లో ఆఫ్రికా యూనిట్ 74 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.506 కోట్లు) నష్టాన్ని ప్రకటించింది. తట్టుకోలేక 2016 జనవరిలో సియెరా లియోన్, బుర్కినా ఫాసో దేశాల్లో కార్యకలాపాలను ఫ్రాన్స్‌కు చెందిన టెలికం సంస్థ ఆరెంజ్‌కు ఎయిర్‌టెల్ విక్రయించింది. 2015, అక్టోబర్‌లో ఆఫ్రికాలోని 8,300 టవర్లను 1.7 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ. 11,000 కోట్లు) అమ్మింది. తాగాగా మిగిలిన 3,700 టవర్లను కూడా విక్రయానికి ఒప్పందం చేసుకొని టవర్ల వ్యాపారం నుంచి బయటపడింది.
7. టాటా మోటార్స్- జేఎల్‌ఆర్
టాటా మోటార్స్ ఆది నుంచీ భారీ వాహనాల వ్యాపారం చేస్తుంది. 1998లో రూ. లక్ష కారు ఇండికాను మార్కెట్లోకి తెచ్చింది. దీంతో చాలా నష్టం ఎదురైంది. కార్ల వ్యాపారాన్ని మూసేస్తే మంచిదనుకుంది. విషయం తెలుసుకున్న ఫోర్డ్ యాజమాన్యం ముంబైలోని టాటా కార్యాలయానికి వచ్చింది. డెట్రాయిట్ రావాలని పిలిచారు. 1999లో టాటా బృందం డెట్రాయిట్ వెళ్లింది. ‘అనుభవం లేకుండా ఈ బిజినెస్‌లోకి ఎందుకు వచ్చారు..? ఇప్పుడు మీకు సాయం చేసేందుకు మీ వ్యాపారాన్ని కొనాలా..?’ అంటూ అవమానించారు. టాటా బృందం రతన్ టాటాకు విషయం చెప్పింది.
తొమ్మిదేళ్ల తర్వాత.. 2009లో అదే ఫోర్డ్‌కు చెందిన జాగ్వార్, ల్యాండ్‌రోవర్ బ్రాండ్లను టాటా కొనుగోలు చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా ఫోర్డ్ మోటార్స్ చైర్మన్ బిల్ ఫోర్డ్ ‘మా జేఎల్‌ఆర్‌ను కొని మాకు పెద్ద ఉపకారం చేశారు’ అన్నారు. ఇలా.. టాటా మోటార్స్ తమకు డెట్రయిట్ లో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంది. ప్రపంచానికి ఇష్టమైన లగ్జరీ బ్రాండ్ జేఎల్‌ఆర్‌ను కొనేందుకు టాటా వెళ్లినపుడు విపరీతమైన వ్యాఖ్యలు వినపడ్డాయి. ‘లక్ష నానో కారు తయారు చేసుకునే కంపెనీ! అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్లను నిర్వహించటం ఎలా అవుతుంది? ఫోర్డ్ వల్లే కానిది టాటా వల్ల అవుతుందా?’ అంటూ విమర్శలు, పెదవి విరుపులు కానీ రతన్ టాటా పట్టు వదల్లేదు.
2008లో జేఎల్‌ఆర్ బ్రాండ్లను సొంతం చేసుకున్నారు. వాటిని టర్న్ అరౌండ్ చేశారు. అమ్మకాలు పెంచారు. విమర్శించిన వాళ్లే నోరెళ్లబెట్టారు. టాటా మోటార్స్‌కు బిలియన్ల కొద్దీ పౌండ్ల లాభాలను ఆర్జించి పెడుతోంది జేఎల్‌ఆర్. లక్ష కారే కాదు.. లక్ష డాలర్ల కారునూ తామే తయారు చేస్తామని నిరూపించింది టాటా.
8. Paytm
2016లో పెద్దనోట్ల రద్దు నిర్ణయం, డిజిటల్ మనీ వినియోగంతో భారత మార్కెట్లోకి వచ్చింది Paytm. పెద్ద పెద్ద ప్రకటనలతో భారత మార్కెట్ ను విపరీతంగా ఆకర్షించింది. తక్కువ సమయంలో ఎదిగిపోయింది. పేమెంట్స్ బ్యాంక్ ను సైతం ప్రారంభించింది. కానీ ఆర్బీఐ నిర్ణయించిన కొన్ని గైడ్ లైన్స్ కు వ్యతిరేకంగా వెళ్తుందని దానిపై విధించిన ఆంక్షల నేపథ్యంలో భారత మార్కెట్ లో పేటీఎం బ్యాంక్ సేవలను నిలిపివేసింది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Indian companies including paytm have gone into foreign ownership
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com