Infosys Foundation: బిడ్డ కోరికను ఏ తల్లయినా సరే మన్నిస్తుంది. అది ఎంతైనా సరే ఖర్చు పెడుతుంది. తల్లి ప్రేమ అపురూపమని అనేది ఇందుకే.. అయితే కొందరు తల్లులు మాత్రం బిడ్డల విషయంలో కొంచెం కఠినంగా ఉంటారు. అలాగని వారిని ఇబ్బంది పెట్టరు. జస్ట్ బతుకు పాఠం నేర్పిస్తారు. ఎలా ఉండాలో? ఎలా నడుచుకోవాలో? ఎలా బతకాలో? ఎలా ఉంటే గుర్తింపు లభిస్తుందో? ఎలా ఉంటే సాటి మనుషులు గౌరవిస్తారో? అనే అంశాలను వారంతట వారే తెలుసుకునేలాగా చేస్తారు. ఇన్ఫోసిస్ సుధా మూర్తి కూడా తన కొడుకు రోహన్ విషయంలో ఇలానే చేశారు. తరగనంత డబ్బు, చెదిరిపోని ఆస్తి, వెలకట్టలేని గౌరవం ఉన్నప్పటికీ సుధా మూర్తి అవేవీ తన కొడుకు రోహన్ దగ్గరికి రానివ్వలేదు. ఇప్పుడు ఎందుకు ఈ చర్చ అంటే.. మొన్న బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్ హైదరాబాద్ ప్రగతి భవన్ ఎదుట డివైడర్ ను ఢీ కొట్టి బయటి దేశాలకు పారిపోయాడు. కొడుకు కోసం షకిల్ కూడా బయటి దేశాలకు వెళ్లిపోయాడు. కొడుకు తప్పు చేస్తే మందలించాల్సిన తండ్రి..ఆ తప్పును సమర్థిస్తూ అతడి ని కాపాడే ప్రయత్నం చేశాడు . తన కొడుకు బాగు కోసం కొందరి పోలీసుల జీవితాలను కూడా బలి చేశాడు. కానీ ఇక్కడే సుధా మూర్తి లాంటి పెంపకం తాలూకు విషయాలు మననం చేసుకోవాల్సి ఉంటుంది.
సుధా మూర్తికి అక్షత, రోహన్ అనే ఇద్దరు సంతానం. అక్షతకు ఇంగ్లాండ్ ప్రధానమంత్రి సునాక్ తో పెళ్లయిన సంగతి తెలిసిందే. రోహన్ కు కూడా టీవీఎస్ కంపెనీల వ్యవస్థాపకుడి కూతురితో వివాహం జరిగింది. వివాహానికి ముందు రోహన్ కు సుధా మూర్తి ఒక విలువైన బతుకు పాఠం నేర్పించారు. అదే అతడిని ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వైపు కదిలేలా చేసింది. రోహన్ స్కూల్ డేస్ లో ఉన్నప్పుడు ఒకరోజు అతడి పుట్టిన రోజు. తన స్నేహితులందరిని పిలిచి ఫైవ్ స్టార్ హోటల్లో పార్టీ ఇవ్వాలని అనుకున్నాడు. అదే విషయాన్ని తన తల్లితో చెప్పాడు. దీనికి సుధా మూర్తి పెద్దగా స్పందించలేదు. రోహన్ మళ్లీ మళ్లీ అడగడంతో సుధా మూర్తి స్పందించాల్సి వచ్చింది. ” మన ఇంట్లో పనిచేసే పని మనిషికి ముగ్గురు పిల్లలు. ఆమె పొద్దంతా మా ఇంట్లోనే పనిచేస్తుంది. వాళ్ళ ఆయన కూడా ఎక్కడో పనిచేస్తాడు. వాళ్లు పని చేసుకుంటూనే తమ పిల్లల్ని చదివిస్తున్నారు. వాళ్ల పిల్లల ఏడాది స్కూల్ ఫీజు 20,000. నువ్వు నీ పుట్టిన రోజుకు నీ స్నేహితులకు ఇచ్చే పార్టీ ఖరీదు 20,000. ఒకవేళ ఫైవ్ స్టార్ హోటల్లో నువ్వు ఆడంబరంగా పుట్టినరోజు పార్టీని స్నేహితులకు ఇస్తానంటే అలానే చేద్దాం” అని సుధా మూర్తి రోహన్ కు బదులిచ్చింది.
ఇది జరిగిన కొంత సేపటికే రోహన్ వచ్చి తన తల్లిని గట్టిగా కౌగిలించుకున్నాడు. ” అమ్మా నేను ఆలోచించాను. ఫైవ్ స్టార్ హోటల్లో స్నేహితులకు పార్టీ ఇవ్వాలనే ఆలోచనను విరమించుకున్నాను. ఆ పార్టీకి అయ్యే డబ్బులను మన పనిమనిషి పిల్లల చదువు కోసం ఇవ్వండి” అని అన్నాడు. దీంతో సుధా మూర్తి సంబరపడింది. తన కొడుకుని చూసి గర్వపడింది. ఇక ఈ సంఘటన రోహన్ మీద ఎంత ప్రభావం చూపించిందంటే.. అతడు పెరిగి పెద్దయిన తర్వాత.. అమెరికాలో చదువుతున్న రోజుల్లో అతడికి వచ్చే లక్ష రూపాయల ఉపకార వేతనాన్ని సేవా కార్యక్రమాల కోసం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కు పంపించేవాడు. వ్యాపారాన్ని స్వీకరించిన తర్వాత ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ను మరింత బలోపేతం చేసాడు. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కేవలం కర్ణాటకలో మాత్రమే కాకుండా దేశంలో నుండి చాలా రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. చదువు, ఉపాధి.. ఎన్నో అంశాల్లో వేలాదిమంది యువతకు చేదోడుగా నిలుస్తోంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలను బాధ్యత తెలుసుకునే లాగా పెంచాలి. అప్పుడు వారికి కోపం ఉండొచ్చు.. ఆ తర్వాత ఆ బాధ్యత ఎంత గొప్పదో అర్థమవుతుంది. సుధా మూర్తి చేసిన పని వల్ల రోహన్ ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ను కొత్త పుంతలు తొక్కిస్తున్నాడు.. ఆరోజు సుధా మూర్తి అలా చెప్పకుండా ఉండి ఉంటే రోహన్ ఎలా ఉండేవాడో మరి?