Hyderabad real estate: హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎలా ఉందంటే? తాజా లెక్కలివీ

హైదరాబాద్ పరిధిలో హైడ్రా దెబ్బకు రిజిస్ట్రేషన్లు తగ్గినప్పటికీ ఆదాయం పెరిగినట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్షాలు హైడ్రాపై గగ్గోలు పెడుతున్నప్పటికీ ఆదాయానికి మాత్రం ఎలాంటి ఢోకా కనిపించలేదు. గణాంకాలను చూస్తే ఇదే అర్థం అవుతోంది.

Written By: Srinivas, Updated On : October 7, 2024 2:13 pm

How is the real estate situation in Hyderabad

Follow us on

Hyderabad real estate: ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు రిజిస్ట్రేషన్ శాఖ. రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎంత జరిగితే ప్రభుత్వానికి అంత ఆదాయం సమకూరినట్లే. అందులోనూ.. హైదరాబాద్ మహానగరం రియల్ ఎస్టేట్ రంగానికి పెట్టింది పేరు. ప్రభుత్వాదాయానికి మేజర్ సిటీ. అలాంటి రియల్ ఎస్టేట్ రంగం ప్రస్తుతం హైదరాబాద్‌లో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. హైడ్రా కూల్చివేతలతో రియల్ రంగానికి పెద్ద దెబ్బపడింది. అయితే.. ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో హైడ్రాను తీసుకొచ్చింది. కానీ.. చాలా వరకు ప్రతిపక్షాలు దానిని నెగెటివ్ కోణంలోకి మార్చాలని ప్రయత్నాలు సాగించారు. వాటికి ప్రభుత్వం కూడా దీటుగా బదులిచ్చింది.

ఇదిలా ఉండగా.. హైదరాబాద్ పరిధిలో హైడ్రా దెబ్బకు రిజిస్ట్రేషన్లు తగ్గినప్పటికీ ఆదాయం పెరిగినట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్షాలు హైడ్రాపై గగ్గోలు పెడుతున్నప్పటికీ ఆదాయానికి మాత్రం ఎలాంటి ఢోకా కనిపించలేదు. గణాంకాలను చూస్తే ఇదే అర్థం అవుతోంది. దాంతో ప్రతిపక్షాలకు దిమ్మతిరిగేలా ఈ గణాంకాలు నిలిచాయి. తెలంగాణలో ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 8,89,019 లక్షల డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయ్యాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.7,253 కోట్ల ఆదాయం వచ్చింది. ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకే సుమారుగా 26 శాతం ఆదాయం పెరిగింది. అయితే.. సెప్టెంబర్ నెలలో మాత్రం కాస్త తగ్గినట్లుగా తెలుస్తోంది.

రికార్డుల్లోని గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 12 లక్షల డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్ జరిగాయి. వాటి ద్వారా రూ.14,483 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రూ.7,253 కోట్ల ఆదాయం వచ్చింది. అంటే.. గత ఆర్థిక సంవత్సరం ఆదాయానికి ఏ మాత్రం తీసిపోకుండా అదే స్థాయిలో ఆదాయం వస్తున్నట్లుగా అర్థం అవుతోంది. మరో ఆరు నెలల గడువు ఉండడంతో ఈ కాలంలో రిజిస్ట్రేషన్లు మరింత ఊపు అందుకుంటే ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశాలు లేకపోలేదు. అయితే.. హైడ్రా కారణంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో కాస్త రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గాయి. ఆస్తుల కొనుగోలులో ప్రజలు కూడా ఆచితూచి వ్యవహరిస్తుండడంతో రిజిస్ట్రేషన్లు తగ్గినట్లుగా తెలుస్తోంది.

ఇన్నాళ్లు బిల్డర్లు, రియల్టర్లు ఇష్టారాజ్యంగా ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. దాంతో రేవంత్ రెడ్డి సర్కార్ వాటన్నింటిపై చర్యలు చేపట్టింది. అక్రమ కట్టడాలపై, హైడ్రా విషయంలో ఎక్కడా తగ్గేది లేదని చెప్పారు. ఇదే క్రమంలో హైడ్రాకు చట్టబద్ధత కూడా లభించింది. దీంతో ఇప్పుడిప్పుడే కొనుగోలుదారుల్లోనూ నమ్మకం ఏర్పడుతోంది. ఇక నుంచి రియల్టర్లు, బిల్డర్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉండదని భావిస్తున్నారు. కాస్త ఆలస్యమైనా అన్నిరకాల అనుమతులు, ఎటువంటి కాంట్రవర్సీ లేని ఆస్తులను కొనుగోలు చేయాలని ప్రజలు అనుకుంటున్నారు. దానికి తోడు రియల్ వ్యాపారంలోనూ ఇలాంటి మోసాలకు హైడ్రా వల్ల తావులేకుండా జాగ్రత్తలు తీసుకుంటారని అంటున్నారు. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు కాస్త నెమ్మదించినా.. ముందు ముందు పుంజుకుంటాయని పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాంతో ప్రభుత్వానికి ఆదాయం మరింత పెరుగుతుందని చెబుతున్నారు.