Honda: ప్రముఖ ఆటోమొబైల్ తయారీ సంస్థ హోండా 2024 చివరిలో భారత మార్కెట్లో తన మొదటి రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఇప్పుడు ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలు ప్రారంభమయ్యాయి. ఈ రెండింటిలో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రజాదరణ పొందిన యాక్టివా ఎలక్ట్రిక్ వెర్షన్, దీనికి యాక్టివా-ఈ అని పేరు పెట్టారు. మరొకటి పూర్తిగా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్, దీనికి QC1 అని పేరు పెట్టారు. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా.. ఈ రెండింటి గురించి గందరగోళంలో ఉంటే వాటి మధ్య ఉన్న తేడాలను తెలుసుకోవాలి. ఈ రెండు స్కూటర్‌లలో చాలా వ్యత్యాసం ఉంది. ఇవి బడ్జెట్, డిజైన్, రేంజ్ పరంగా చాలా భిన్నంగా ఉంటాయి.
Also Read: రిలీజ్‌కు ముందే కార్ల బుకింగ్స్ షురూ..బీఎండబ్ల్యూ, టయోటాకు ఇక కష్టకాలమే?
1. డిజైన్
డిజైన్ పరంగా చూస్తే.. హోండా యాక్టివా ఎలక్ట్రిక్‌లో ముందు వైపు హ్యాండిల్‌పై LED DRL కనిపిస్తుంది. కింద డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్‌తో డిస్క్ బ్రేక్ వస్తుంది. అయితే QC1లో సాధారణ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. డిస్క్ బ్రేక్ లేదు.
2. ఫీచర్స్
ఎలక్ట్రిక్ యాక్టివాలో 7 అంగుళాల LED డిస్‌ప్లే లభిస్తుంది. ఇందులో నావిగేషన్, బ్లూటూత్ కనెక్టివిటీ, కాలింగ్, మ్యూజిక్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. అయితే QC1లో 5 ఇంచుల LCD డిస్‌ప్లే మాత్రమే లభిస్తుంది. ఇందులో కేవలం బ్యాటరీ, రేంజ్, స్పీడ్ మాత్రమే చూడగలరు.
3. బ్యాటరీ, స్టోరేజ్
ఈ రెండు స్కూటర్లలో బ్యాటరీ ప్యాక్ విషయంలో పెద్ద వ్యత్యాసం ఉంది. యాక్టివా ఎలక్ట్రిక్‌లో స్వాపబుల్ బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది.. అయితే QC1లో ఫిక్స్డ్ బ్యాటరీ ప్యాక్ లభిస్తుంది. యాక్టివా ఎలక్ట్రిక్‌లో అండర్ సీట్ స్టోరేజ్ లేదు. అయితే QC1లో 26 లీటర్ల అద్భుతమైన అండర్ సీట్ స్టోరేజ్ లభిస్తుంది.
4. రేంజ్, ఛార్జింగ్
ఈ రెండు స్కూటర్ల రేంజ్ గురించి మాట్లాడితే.. యాక్టివా ఎలక్ట్రిక్ 2 బ్యాటరీలతో ఒకే ఛార్జ్‌పై 102 కిలోమీటర్ల రేంజ్‌ను ఇస్తుంది. వీటిని నెలకు రూ.2,000 సబ్‌స్క్రిప్షన్‌తో హోండా పవర్ స్టేషన్లలో అపరిమితంగా మార్చుకోవచ్చు. ఇది ఛార్జ్ చేయడానికి చాలా తక్కువ సమయం పడుతుంది. మరోవైపు QC1లో 80 కిలోమీటర్ల రేంజ్ లభిస్తుంది. దీనిని ఛార్జ్ చేయడానికి 4-5 గంటలు పడుతుంది.
5. స్పీడ్, ధర:
స్పీడ్ విషయానికి వస్తే, QC1 గరిష్టంగా గంటకు 50కి.మీ. వేగంతో వెళ్లగలదు. అయితే యాక్టివా ఎలక్ట్రిక్ గరిష్టంగా గంటలకు 80కి.మీ వేగంతో వెళ్లగలదు. ధర విషయానికి వస్తే, QC1ని కొనడానికి రూ.90,000 ఖర్చు చేయాలి. మరోవైపు యాక్టివా ఎలక్ట్రిక్ కోసం మీరు కనీసం రూ.1.17 లక్షలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.