Adani – Hindenburg : భారతీయ కుబేరుడు గౌతం అదానీని హిండెన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ వేటాడుతోంది. ఇప్పటికే గౌతం అదానీ వ్యాపారలోపాలను ఎత్తి చూపి ఆయన్ను ప్రపంచ కుబేరుల జాబితా నుంచి కిందకు దించేసిన హిండెన్ బర్గ్ తాజాగా మరో బాంబు పేల్చింది. అదానీ కుంభకోణంలో ఉపయోగించిన ఆఫ్‌షోర్ సంస్థలలో సెబీ చీఫ్ మాధబి బుచ్‌కు వాటా ఉందని హిండెన్‌బర్గ్ బాంబు పేల్చింది. దీంతో వ్యాపారవర్గాల్లో మరోసారి కలకలం చెలరేగింది. అదానీ సంస్థల గుట్టుమట్లపై అనుమానాలు బలపడ్డట్టు అయ్యింది.
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కొత్త నివేదిక ప్రకారం.. మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చైర్‌పర్సన్ మధాబి బుచ్ , ఆమె భర్త అదానీ గ్రూప్ కు సంబంధించిన ఆఫ్‌షోర్ సంస్థలలో వాటాలను కలిగి ఉన్నట్టు హిండెన్ బర్గ్ సంచలన నివేదికను బయటపెట్టింది..
హిండెన్‌బర్గ్ నివేదిక ప్రకారం.. మాదాబి బుచ్ , ఆమె భర్తలకు బెర్ముడా , మారిషస్ దేశాలలో ఆఫ్‌షోర్ ఫండ్‌లలో పెట్టుబడులను కలిగి ఉన్నారని ఆరోపించింది. అదే సంస్థలను గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ఆర్థిక మార్కెట్లను మార్చటానికి ఉపయోగించారని ఆరోపించారు. ఈ పెట్టుబడులు 2015 నాటివని నివేదించబడింది. 2017లో సెబీ పూర్తి-సమయ సభ్యురాలిగా మాధబి బుచ్ నియామకమైంది. ఆమె మార్చి 2022లో సెబీ చైర్‌పర్సన్‌గా ఎదగడానికి చాలా ముందే ఈ స్కాంలో భాగస్వామ్యమైనట్టుగా పేర్కొంది. మాదాబి భార్యభర్తల పెట్టుబడులు ఖచ్చితంగా అక్రమ మార్గంలోనే వచ్చినట్టుగా హిండెన్ బర్గ్ నివేదికలో పేర్కొంది. వారికి ప్రయోజనం కలిగించేందుకే విదేశాల్లో లంచాలను ముట్టజెప్పినట్టుగా నివేదించబడింది.
అదానీ గ్రూప్ అనుమానాస్పద ఆఫ్‌షోర్ వాటాదారులపై సెబీ నిర్ణయాత్మక చర్య తీసుకోకపోవడం, దర్యాప్తులో ఉన్న అదే సంస్థలతో బుచ్ వ్యక్తిగత ఆర్థిక సంబంధాల బయటపడడంతో ఇది స్కాం జరిగినట్టుగా హిండెన్‌బర్గ్ నివేదికలో పేర్కొంది.
భారతదేశంలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్‌లను (REIT) ప్రోత్సహించడంలో మధాబి బుచ్ పాత్రను కూడా హిండెన్ బర్గ్ నివేదిక బయటపెట్టింది. ఆమె భర్త సీనియర్ అడ్వైజర్‌గా పనిచేస్తున్న బ్లాక్‌స్టోన్‌కు గణనీయంగా ప్రయోజనం చేకూర్చేందుకు అదానీ గ్రూప్ ప్రయత్నించిందని ఆధారాలు ఉన్నాయని పేర్కొంది. ఈ స్కాం బయటపెట్టడంతో ఇప్పుడు అదానీ గ్రూప్ తోపాటు సెబీ) చైర్‌పర్సన్ మధాబి బుచ్ కూడా పూర్తిగా ఇరుక్కుపోయినట్టు అయ్యింది. మరోసారి అదానీ గ్రూప్ అక్రమాలపై చర్చ వ్యాపారవర్గాల్లో ప్రారంభమైంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది వేచిచూడాలి.