Harsha Goenka : నేటి కాలంలో ఉద్యోగం దొరకడం అనేది గగనం అయిపోయింది. ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోవడానికి బండెడు చాకిరి చేయాల్సివస్తోంది. ఇదే అదునుగా కంపెనీలు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నాయి. ముగ్గురు చేయాల్సిన పనిని ఒక్కరి మీద వేస్తున్నాయి. ఉద్యోగం లేకుంటే బతికే పరిస్థితి లేదు. కుటుంబాన్ని సాకే స్థితి లేదు.. అలాంటప్పుడు ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకోక తప్పదు.. అనారోగ్యానికి గురైనా.. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఎదురైనా తప్పనిసరి పరిస్థితుల్లో చాలామంది ఉద్యోగాలు చేస్తుంటారు. చేస్తూనే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం అంటే ఎలా ఉండాలి.. ఉద్యోగం ఎలా చేయాలి.. అనే విషయాలపై ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయంక ఒక కీలకమైన వీడియోను పోస్ట్ చేశారు.
హర్ష్ గోయంక సామాజిక మాధ్యమాలలో చురుకుగా ఉంటారు. తనకు తెలిసిన ఏ విషయమైనా సరే పంచుకుంటారు. అందులో ఏదైనా కొత్తదనం ఉంటే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. అందువల్లే ఆయనకు సోషల్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ ఉంటుంది. ఒక వ్యాపారవేత్తగా కాకుండా.. సగటు భారతీయుడిగా ఆయన ఆలోచనలు చాలా విభిన్నంగా ఉంటాయి. ఆలోచన రేకెత్తించే విధంగా కనిపిస్తుంటాయి.. వినూత్నమైన విషయాలు మాత్రమే కాదు.. వివాదాస్పదంగా ఉన్న ప్రభుత్వ విధానాలను కూడా ఆయన ప్రశ్నిస్తుంటారు. కాకపోతే ఆ విధానంలో నూతనత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. అందువల్లే ఆయన అంటే చాలామంది అభిమానం చూపిస్తుంటారు. సోషల్ మీడియాలో ఆయన చేసే ట్వీట్లు, పోస్టులకు కామెంట్లు చేస్తుంటారు..
ట్విట్టర్లో యాక్టివ్ గా ఉండే హర్ష్ గోయంక ఒక ట్వీట్ చేశారు. అది సామాజిక మాధ్యమాలలో చర్చకు తావిస్తోంది.. ఆయన పోస్ట్ చేసిన వీడియోలో ఒక విద్యార్థి ఇంటర్న్ షిప్ పూర్తి చేసుకుంటాడు. అతడికి ఒక వ్యక్తి ఉద్యోగం కల్పిస్తాడు. గడులలో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అతడు నిలుచుని ఉండాలి.. అంతకుమించి అతడు ఏం పని చేయడానికి లేదు. ఉద్యోగ బాధ్యత గురించి చెప్పిన తర్వాతే ఆ వ్యక్తి ఆ విద్యార్థికి ఉద్యోగం ఇస్తాడు. ఇలా సంవత్సరాలు గడుస్తూనే ఉంటాయి. చివరికి ఆ వ్యక్తి తన పదవి విరమణ చేస్తాడు.. ఈ వీడియో చివర్లో 9-5 ఉద్యోగం అనేది మీ జీవితం మొత్తాన్ని లాగేసుకుంటుంది. అలాకాకుండా మీదేనా దినచర్య మొదలు పెట్టండి.. మీరు చేస్తున్న ఉద్యోగంలో నూతనత్వాన్ని వెతుక్కోండి” అంటూ ఓ సందేశం తో ఆ వీడియో ముగుస్తుంది.
ఈ వీడియోను పోస్ట్ చేసిన హర్ష్ గోయంక తనదైన వ్యాఖ్యానం చేశారు..” జీవితం ఒకే విధంగా ఉండకూడదు. ఉద్యోగం కూడా ఒకే విధంగా ఉండకూడదు. మార్పును కోరుకోవాలి. దానిని సాదరంగా ఆహ్వానించాలి. ఆ మార్పును జీవితానికి అన్వయించుకోవాలి. అప్పుడే నూతనత్వం కనిపిస్తుంది. జడత్వం వెళ్ళిపోయి చైతన్యం పరిమళిస్తుంది. ఇవన్నీ కచ్చితంగా జరగాలంటే మార్పునకు అనుకూలంగా మన జీవితాన్ని మార్చుకోవాలి. మలచుకోవాలి” అంటూ హర్ష్ గోయంక పేర్కొన్నారు. అయితే ఈ వీడియో పట్ల రకరకాల వ్యక్తీకరణలు కనిపిస్తున్నాయి. కొందరేమో వీడియో బాగుందని వ్యాఖ్యానిస్తుంటే.. మరి కొందరేమో మీ కంపెనీలో కూడా ఇటువంటి మార్పులకు మీరు సిద్ధమేనా అంటూ ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు