Gold vs Silver: ఇదే ఏడాది జూలై నెల 26వ తేదీన కిలో వెండి ధర 1,18,120 వరకు పలికింది. సరిగ్గా డిసెంబర్ 26 నాటికి 2,36,350 కు చేరుకుంది.. ఆరు నెలల్లోనే వెండి ధర లక్ష 18 వేల రూపాయలకు మించి పెరిగింది. దీనిని బట్టి వెండికి ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. సాధారణంగా భారతీయులు ఆభరణాలలో బంగారాన్ని మాత్రమే వాడుతుంటారు. వెండిని అతి తక్కువగా వాడుతుంటారు.. అయితే ఇప్పుడు వెండికి ఊహించని విధంగా డిమాండ్ పెరిగింది. దీంతో దాని ధర బంగారాన్ని దాటి వెళ్లిపోయింది.
వెండికి ఈ స్థాయిలో ధర పెరగడానికి ప్రధాన కారణం పారిశ్రామికంగా వేగంగా విస్తరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోలార్ విద్యుత్ సెమీ కండక్టర్స్, డేటా సెంటర్స్, డిఫెన్స్ పరికరాలు వంటి వాటిల్లో వెండిని విపరీతంగా వినియోగిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న వెండిలో 60 శాతం పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తారు. అందువల్లే వెండి కి విపరీతమైన డిమాండ్ ఉంది. గడిచిన ఏడాదిలో సుమారు రెండు కోట్ల కిలోల వెండిని పారిశ్రామిక అవసరాల కోసం వినియోగించారు.
ఇక ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీ కండక్టర్లు వంటి వాటిల్లో వెండి వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. ఇది మాత్రమే కాకుండా పలు దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అమెరికా ఆంక్షలతో బెదిరిస్తోంది. దీంతో చాలామంది తమ పెట్టుబడులను బంగారం, వెండి, ప్లాటినం, కాపర్ వంటి కీలకమైన మెటల్స్ లోకి తరలిస్తున్నారు. అందువల్ల ఈ స్థాయిలో ధర పెరుగుతోంది. పైగా మన కరెన్సీ కూడా ఈ ఏడాదిలో 8 శాతానికి పైగా పతనమైంది. ఇది కూడా వెండి ధర పెరగడానికి ఒక కారణమైంది.
వెండి ధర ఈ స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో.. భవిష్యత్తు కాలంలో రిస్క్ తప్పదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం, వెండి ధరల మధ్య ఉండే తేడాను గోల్డ్ సిల్వర్ రేషియో అని పిలుస్తారు. 2025 మధ్యకాలంలో 107 గా ఉన్న గోల్డ్ సిల్వర్ రేషియో నిష్పత్తి.. ఇప్పుడు 64 కు పడిపోయింది. దీనికి ప్రధాన కారణం వెండి ధర పెరగడమే. 2016, 2021లో కూడా ఈ నిష్పత్తి ఈ స్థాయికి చేరినప్పుడు.. వెండి ధరలు భారీగా పతనమయ్యాయి. అయితే ఇప్పుడు ఉన్న డిమాండ్ ప్రకారం కేజీ వెండి ధర 2.50 లక్షలకు చేరుకోవచ్చు. ఇక ఇదే సమయంలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం 1.65 లక్షలకు చేరుకోవచ్చని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.