Gig Workers: ఎండ దంచి కొడుతోంది. ఏప్రిల్ నెల తొలిరోజే 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతతో హడలెత్తిస్తోంది. బయటికి రావాలంటేనే భయం కలిగించేలా చేస్తోంది. ఇలాంటి ఎండల్లో పనిచేయాలంటే చాలా కష్టం. రోజు మొత్తం ఎండలో ఉండాలంటే ఇంకా కష్టం. అలాంటి వారికోసం చెన్నై నగర పాలక సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read: మార్చి 2025: డిజిటల్ పేమెంట్స్‌లో ఇండియా సరికొత్త రికార్డు..
వేసవిలో బీభత్సమైన ఉష్ణోగ్రతల మధ్య ఫుడ్, ఇతర వస్తువులను గిగ్ వర్కర్లు ఆన్లైన్లో డెలివరీ చేస్తుంటారు. అయితే వారికోసం చెన్నై కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. మండే ఎండల్లో విధులు నిర్వహిస్తూ.. నగరం మొత్తం తీరికలేకుండా తిరిగే వారి కోసం ఉపశమనం కలిగించే విధంగా చెన్నై కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది.. చెన్నైలోని ప్రధాన రోడ్లపై ఏసీ రెస్ట్ రూమ్స్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. వీటివల్ల స్విగ్గి, జొమాటో, ఉబర్ డెలివరీ బాయ్స్ ఉపశమనం లభించనుంది. మరోవైపు చెన్నైలో మాత్రమే కాకుండా హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కోల్ కతా, లక్నో, అహ్మదాబాద్, కోయంబత్తూరు వంటి నగరాల్లో కూడా ఇటువంటి సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్నాయి.
గిగ్ వర్కర్ల కోసం..
గిగ్ వర్కర్ల శ్రమ తీవ్రంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు వస్తున్న ఆర్డర్లను పిక్ అప్ చేసుకొని.. కస్టమర్లకు వీరు సర్వీస్ అందించాల్సి ఉంటుంది. శ్రమకు తగ్గట్టు వేతనం లభించకపోయినప్పటికీ.. తప్పనిసరి పరిస్థితుల్లో వీరు ఆ పని చేస్తుంటారు. వీరితో తీవ్రంగా శ్రమ చేయించుకునే కంపెనీలు అంతంతమాత్రంగానే వేతనం ఇస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ట్రావెల్ అలవెన్స్ లో కూడా కోత విధిస్తాయి. ఇక పని ఒత్తిడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది కస్టమర్లు గిగ్ వర్కర్లను కనీసం మనుషులుగా కూడా చూడరు.. అందువల్లే కొంతమంది గిగ్ వర్కర్లు తప్పుడు పనులు చేస్తుంటారు. ఇటువంటి ఉదంతాలు గతంలో అనేకం జరిగినప్పటికీ.. ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. గతంలో కమీషన్ ను విపరీతంగా పెంచిన కంపెనీలు.. ఇప్పుడు పూర్తిగా తగ్గిస్తున్నాయి. అయితే ఆన్లైన్ ఫుడ్ డెలివరీ రంగంలోకి కొత్త కంపెనీలు ఏవైనా వస్తే మాత్రం తన బతుకులు మారుతాయని గిగ్ వర్కర్లు అంటున్నారు. 2023 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గిగ్ వర్కర్లతో అటు కేటీఆర్.. రేవంత్ రెడ్డి వేరువేరుగా సమావేశమయ్యారు. వారి బాధలు తెలుసుకొని.. అధికారంలోకి వస్తే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఆ దిశగా అడుగులు వేయలేదు. అయితే ఇప్పుడు తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో గిగ్ వర్కర్ల కోసం అధికార డిఎంకె ప్రభుత్వం ఏసి రెస్ట్ రూమ్ లు ఏర్పాటు చేయడం విశేషం. అయితే దీనిపై సానుకూల స్పందనలు వస్తున్నాయి. మరోవైపు ఎన్నికల్లో ప్రచారం కోసమే ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇన్ని రోజులపాటు గుర్తుకురాని గిగ్ వర్కర్లు.. డీఎంకే ప్రభుత్వానికి ఇప్పుడే జ్ఞప్తికి వచ్చారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.